Monday, January 20, 2025

విండీస్‌కు పరీక్ష

- Advertisement -
- Advertisement -

 సిరీస్‌పై భారత్ కన్ను, నేడు రెండో వన్డే


అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో బుధవారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు పర్యాటక విండీస్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. మొదటి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన టీమిండియా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. రోహిత్ తన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్సీలో అదరగొట్టాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. అతని రాకతో ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు కష్టంగా మారింది. రాహుల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇక రాహుల్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారత్‌కు శుభారంభం ఖాయం.
విరాట్ ఈసారైనా..
మరోవైపు తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. కొంతకాలంగా విరాట్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ ఫామ్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. తొలి వన్డేలో విఫలమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం కాస్త ఊరట కలిగించే అంశమే. యువ ఆటగాడు దీపక్ హుడా కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో అతను మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అంతేగాక వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌ల రూపంలో మెరుగైన ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక తొలి మ్యాచ్‌లో రాణించిన స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అసాధారణ బౌలింగ్‌తో ఇద్దరు విండీస్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చిన విషయం తెలిసిందే. సిరాజ్, ప్రసిద్ధ్, ఠాకూర్‌లతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
గెలిచి తీరాల్సిందే..
ఇక విండీస్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. తొలి మ్యాచ్‌లో విం డీస్ 176 కుప్పకూలింది. ఒక దశలో 79 పరుగులకే ఏడు వికెట్లు కోల్పియిన వెస్టిండీస్‌ను జేసన్ హోల్డర్ ఆదుకున్నాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హోల్డర్ 4 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఫబియాన్ అలెన (29) కూడా కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. దీంతో విండీస్ ఆ మాత్రమైనా స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్ షాయ్ హోప్, కెప్టన్ పొలార్డ్‌లతో పాటు నికోలస్ పూరన్, బ్రావో, హోల్డర్ తదితరుల తమ బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. అంతేగాక బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలి. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News