Thursday, January 23, 2025

తీరు మారని వెస్టిండీస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. తొలి మూడు ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరి రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న విండీస్ ప్రస్తుతం ఆ మెగా టోర్నమెంట్‌కు అర్హత సాధించలేని దుస్థితికి చేరుకుంది. తాజాగా భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. రెండు ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోరుకే ఆలౌటై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకంటే కూడా విండీస్ బలహీనంగా మారిపోయింది. గతమెంతో ఘనంగా ఉన్న వెస్టిండీస్ పరిస్థితి ఇటీవల కాలంలో అత్యంత దయనీయంగా తయారైంది. వన్డేలు, టెస్టులతో పాటు తమకు ఎంతో కలిసి వచ్చే టి20 ఫార్మాట్‌లో కూడా వరుస ఓటములను చవిచూస్తోంది. సొంత గడ్డపై కూడా విండీస్ తీరు ఏ మాత్రం బాగుండడం లేదు.

భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 150కి పైగా స్కోరును సాధించలేక పోయింది.మొదటి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఏ దశలోనూ టీమిండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విండీస్ ఘోరంగా విఫలమైంది. అశ్విన్, జడేజాల బౌలింగ్ ధాటిని తట్టుకోలేక విండీస్ బ్యాటర్లు విలవిల్లాడి పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి అశ్విన్ విండీస్ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. జడేజా కూడా ఐదు వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. ఇక భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇద్దరు శతకాలతో చెలరేగి పోయారు. ఆరంగేట్రం మ్యాచ్‌లో యశస్వి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని దెబ్బకు విండీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

రోహిత్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. విరాట్ కోహ్లి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్లను హడలెత్తించాడు. ఇక విండీస్ ఆట తీరు రోజురోజుకు తీసికట్టుగా తయారు కావడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతో నిరాశకు గురిచేస్తోంది. 70, 80, 90 దశకాల్లో పెద్ద పెద్ద జట్లపై సయితం అలవోక విజయాలు సాధించి తన మార్క్ జైత్ర యాత్రను కొనసాగించిన విండీస్ ఇటీవల కాలంలో చిన్న చిన్న జట్లను సయితం ఓడించలేక చతికిల బడిపోతోంది. దీనికి ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో విండీస్‌కు ఎదురైన ఓటములే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా విండీస్ బోర్డు నష్టనివారణ చర్యలు తీసుకోక పోతే విండీస్ క్రికెట్ టీమ్ పూర్తిగా కనుమరుగై పోయినా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News