Monday, November 18, 2024

సమరోత్సాహంతో టీమిండియా

- Advertisement -
- Advertisement -

బార్బడాస్: వెస్టిండీస్‌తో గురువారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగే తొలి వన్డేలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య వెస్టిండీస్‌కు ఈ సిరీస్ సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత కూడా సాధించలేక పోయింది. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి చిన్న చిన్న జట్ల చేతుల్లోనూ అవమానకర రీతిలో పరాజయాలు చవిచూసింది. ఇలాంటి స్థితిలో టీమిండియా వంటి బలమైన జట్టును ఓడించడం విండీస్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి.

ఫేవరెట్‌గా భారత్..
మరోవైపు వన్డే సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించారు. ఈ సిరీస్‌లో కూడా వీరిద్దరూ జట్టుకు కీలకంగా మారారు. వీరిద్దరూ విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. హార్దిక్, జడేజాలు తమ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. టెస్టుల్లో జడేజా మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.

ఇక సూర్యకుమార్‌కు ఈ సిరీస్ సవాల్‌గా మారింది. కొంతకాలంగా వన్డేల్లో అవకాశాలు లభిస్తున్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అతను విఫలమవుతున్నాడు. ఈసారైనా సత్తా చాటుతాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూను ఆడిస్తారా లేక ఇషాన్‌కు చాన్స్ ఇస్తారా అనేది కూడా ఆసక్తిగా మారింది. టెస్టు సిరీస్‌లో ఇషాన్ బాగానే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి బ్యాటర్‌గా పేరున్న శాంసన్‌కే తుది జట్టులో అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఉమ్రాన్ మాలిక్, సిరాజ్, ఉనద్కట్, ముకేశ్, యజువేంద్ర చాహల్, జడేజా, హార్దిక్, కుల్దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న టీమిండియా సిరీస్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది.

పరీక్షలాంటిదే..
ఇక ఆతిథ్య వెస్టిండీస్‌కు సిరీస్ సవాల్‌గా తయారైంది. బలంగా ఉన్న భారత్‌ను ఓడించాలంటే విండీస్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా జట్టు ఆట తీరు రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్‌లో విండీస్ ఎలా ఆడుతుందో సందేహమే. షాయ్ హోప్, హెట్‌మెయిర్, బ్రాండన్ కింగ్, రొనాల్డో షెఫర్డ్, మేయర్స్, రొమాన్ పొవెల్, జోసెఫ్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. అయితే వీరు సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. కానీ సొంత గడ్డపై ఆడుతుండడం విండీస్‌కు కాస్త అనుకూలించే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News