బార్బడాస్: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి వన్డేలో టీమిండియా జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం పలుసార్లు ఆటంకం కలిగించింది. దీంతో పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా తయారైంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి జట్టు బౌలర్లు భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
ఓపెనర్ ఇషాన్ కిషన్ (55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (34) పరుగులు చేశాడు. అయితే సంజూ శాంసన్ (9), అక్షర్ పటేల్ (1), కెప్టెన్ హార్దిక్ పాండ్య (7) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (24), రవీంద్ర జడేజా (10), శార్దూల్ ఠాకూర్ (16) కూడా నిరాశ పరిచారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మోతి, షెఫర్డ్ మూడేసి వికెట్లు తీయగా, అల్జరీ జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఆదుకున్న షాయ్ హోప్, కార్టీ
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (15), కేల్ మేయర్స్ (36) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన అలిక అథనాజే (6) కూడా విఫలమయ్యారు. జట్టును ఆదుకుంటాడని భావించిన హెట్‌మెయిర్ (9) కూడా నిరాశ పరిచాడు. ఈ దశలో షాయ్ హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విండీస్‌ను ఆదుకున్నాడు. అతనికి కార్టీ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కార్టీ 4 ఫోర్లతో అజేయంగా 48 పరుగులు చేశాడు. దీంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది.