విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా ఇండియాలో పర్యటిస్తోన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం ఆంధ్రప్రదేశ్‌లో మెడ్‌టెక్ జోన్‌ను శనివారం సందర్శించింది. జోన్‌లోని పలు సంస్ధలను పరిశీలించిన ఈ బృందం పలు కంపెనీల ప్రతినిధిలు, స్టార్టప్‌లతో సమావేశమైంది. మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్టెఫాన్ డాసన్ (ఎంఎల్‌సీ, మినిస్టర్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ ఎకనమీ, మెడికల్ రీసెర్చ్, వలెంటీరింగ్), ప్రొఫెసర్ పీటర్ క్లీంకెన్ ఏసీ (చీఫ్ సైంటిస్ట్– వెస్ట్రన్ ఆస్ట్రేలియా), నషిద్ చౌదరి (ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ కమిషనర్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇండియా–గల్ఫ్ రీజియన్), డాక్టర్ జితేంద్ర శర్మ (మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్) పాల్గొన్నారు.
ఈ సదస్సులో స్టెఫాన్ డాసన్ మాట్లాడుతూ వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వైద్య పరిశోధనలు, ఆవిష్కరణలు మనం ఆరోగ్యంగా జీవించేందుకు తోడ్పడుతున్నాయన్న ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది అత్యంత కీలకమైన సమయమన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యం, వైద్య పరిశోధనలలో ఉన్న అపార అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు దృష్టి సారించిందంటూ ఈ రంగాలను ప్రోత్సహించడానికి గణనీయంగా నిధులను కేటాయించేందుకు సైతం కట్టుబడి ఉన్నామన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో ఈ రంగాలలో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తీర్చిదిద్దామన్నారు. స్థానిక ప్రతిభావంతులకు తగిన అవకాశాలను అందించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలో నే అక్కడి ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాలు, వాటి ప్రభావాన్ని సైతం ఆయన వివరించారు.
వైద్య రంగంలోని వారికి ఫెలోషిప్‌లను సైతం అందిస్తున్నామన్న ఆయన తమ నూతన ఫెలోషిప్ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, వైద్య పరిశోధకులను వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆకర్షిస్తుందన్నారు. ప్రస్తుతం పరిశోధకులకు మూడు, ఐదు సంవత్సరాల ఫెలోషిప్‌లను అందిస్తున్నామని, ఐదు మిలియన్‌డాలర్ల ఈ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పరిశోధనలు చేస్తున్న వారైనా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారి అత్యున్నత నాణ్యతతో కూడిన , వినూత్నమైన పరిశోధనా కార్యక్రమాలు చేయవచ్చన్నారు. అయితే ఈ పరిశోధనలు ఆదివాసి ఆరోగ్యం, గ్రామీణ ఆరోగ్యం, వ్యాధుల భారం తగ్గించడం, కొవిడ్–19 వంటి అంశాలపై దృష్టి సారించి ఉండాల్సి ఉందన్నారు. అత్యధిక వృద్ధి సామర్ధ్యం కలిగిన స్టార్టప్స్‌కు సైతం మద్దతు అందించేందుకు పెర్త్ ల్యాండింగ్‌ప్యాడ్ కార్యక్రమం కూడా ప్రారంభించామంటూ సాంకేతికరంగంలోని కంపెనీలు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాలను వృద్ధి చేసుకొవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఇండియాకు ఎన్నో సారుప్యతలున్నాయన్న ఆయన జీ20లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో మెడ్‌టెక్ జోన్ ఓ జీ2జీ ఒప్పందాన్ని కేవలం వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోసం వైద్య సాంకేతికతల అభివృద్ధి కోసం చేసుకునే దిశగా ఆలోచన చేయాల్సిందిగా సూచించారు.