విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేయను!
సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది
డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్
రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ
సింగ్ అన్ని పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
గోండా: రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తను విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తను నిర్దోషినని, ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తన పదవికి రాజీనామా చేయనని శనివారం తెలిపారు. తను నిర్దోషినని, సుప్రీంకోర్టు, ఢిల్లీ పోలీసులుపై తనకు పూర్తి నమ్మకం ఉందని గోండా నగరానికి 40కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణోహర్‌పూర్‌లోని తన నివాసంలో మీడియాకు తెలిపారు. రెజ్లింగ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని కానీ అలాచేస్తే చేయని నేరాన్ని అంగీకరించినట్లు అవుతోందన్నారు. శనివారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెజ్లర్లతో సమావేశమై మద్దతు ఇవ్వడంపై సింగ్ స్పందించారు. ఈ వివాదం వెనుక ఎవరు ఉన్నారనేది తెలిసిందన్నారు.
Also Read: కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ ఖర్చుపై ఢిల్లీ ఎల్‌జి ఆరా
కాంగ్రెస్ హస్తంతోపాటు ఓ పారిశ్రామికవేత్త దీని వెనుకు ఉన్నారనేది తను మొదటి నుంచి నమ్ముతున్నట్లు తెలిపారు. తను నేరస్థుడిని కాదని, రాజీనామా చేయడం అంటే వారి ఆరోపణలను అంగీకరించినట్లే అని యూపీలోని కైసర్‌గంజ్ బిజెపి ఎంపి సింగ్ అన్నారు. తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా వారింకా ఎందుకు ధర్మా చేస్తున్నారని సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ, క్రీడామంత్రిత్వశాఖకు వ్యతిరేకంగా ఎందుకు నిరంతరం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రెజ్లర్లు చేస్తున్న ధర్మా క్రీడాకారుల నిరసన కాదని, కుట్రదారుల నిరసన అని సింగ్ అన్నారు. తను 12ఏళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడతున్నప్పుడు ఫెడరేషన్, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదని విలేఖరుల సమావేశంలో సింగ్ ప్రశ్నించారు. వారు నేరుగా జంతర్‌మంతర్‌కు వెళ్లారని, విచారణ కమిటీకి తన ఆడియో క్లిప్‌ను సమర్పించాను అన్నారు. ఓ వ్యక్తి తనను ఇరికించేందుకు అమ్మాయిని ఏర్పాటు చేయడం గురించి అందులో ఉందని సింగ్ తెలిపారు.
సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తానని అయితే నిరసనకారులు రోజుకో కొత్త డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తొలుత ఎఫ్‌ఐఆర్ కోసం డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన తరువాత నన్ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తను లోక్‌సభ సభ్యుడిని అని, వినేశ్ ఫోగట్ దయతో ఎంపి కాలేదు ప్రజలు తనను ఎంపిని చేశారన్నారు. మొత్తం యూపి, హర్యానా అఖాడాలు తన వెంట ఉన్నాయన్నారు. తను నిర్దోషిని అని త్వరలో దేశం కూడా తెలుసుకుంటుందన్నారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌గా తన పదవీకాలం పూర్తయిందని కొత్త అధ్యక్షుడి ఎన్నికతో తన పదవీ విరమణ అమలులోకి వస్తుందన్నారు. ఎన్నికల పూర్తయ్యేవరకూ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నట్లు తెలిపారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌గా 12ఏళ్లు పూర్తిచేసుకున్న సింగ్ మరోసారి పోటీచేసేందుకు అనర్హులు.
Also Read: విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు
కాగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ శనివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లను కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌ను రక్షిస్తోందని ఆమె ఆరోపించారు. సింగ్‌ను అన్ని పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.మరోవైపు రెజ్లర్లు ఆందోళనను పునఃప్రారంభించడంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మైనర్ రెజ్లర్ ఆరోపణలకు సంబంధించి తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.