Wednesday, January 22, 2025

ఒక్క ఆరోపణనైనా రుజువుచేస్తే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిరసన తెలుపుతున్న రెజ్లర్స్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుతుండడంతో భద్రతను పెంచేశారు. ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీలో రెజ్లర్లకు మద్దతుగా సంఘీభావం ప్రకటించనున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుంచి అనేక మంది నాయకులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోనున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం రైతులు రెజ్లర్ల నిరసనలో చేరడానికి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారిని పోలీసులు తిక్రీ బార్డర్ వద్ద ఆపేశారు.

‘రెజ్లర్లకు మా మద్దతు పూర్తిగా ఉంది. తదుపరి కార్యక్రమం ఏమిటన్నది మేము నేడు నిర్ణయిస్తాము. ఎఫ్‌ఐఆర్ నమోదయింది కనుక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాల్సిందే’ అని రైతు నాయకుడు రాకేశ్ టికైత్ తెలిపారు. డబ్లుఐఎఫ్ అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని పది రోజులుగా రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సాక్షి మల్లిక్ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా రెజ్లర్లపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. డబ్లుఎఫ్‌ఐ చీఫ్ పదవి నుంచి బ్రిజ్ భూషణ్‌ను తొలగించి, కటకటాల వెనుకకు పంపే వరకు తాము అక్కడి నుంచి కదిలేది లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను పెంచేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని నిర్బంధించమని అధికారులకు ఆదేశాలు అందాయి. నేషనల్ హైవే నం. 44లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్‌లను అనుసంధానిస్తుంది. పోలీసు సిబ్బంది బారికేడ్లను ఏర్పాటుచేశారు.

‘మా నిరసన(రెజ్లర్లకు మద్దతుగా) నేడొక్క రోజే. ఒకవేల ప్రభుత్వం పరిష్కారం కనుగొనకుంటే, తర్వాత ఏమి చేయాలో ఆలోచిస్తాం’ అని ఓ రైతు నాయకుడు అన్నారు. ఇదిలావుంటే రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ‘తనపై రెజ్లర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను లైంగికంగా వేధించానని ఒక్క ఆరోపణనైనా రుజువు చేస్తే నేను ఉరేసుకుంటా’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News