Monday, December 23, 2024

సింగరేణిపై ఎవరి దారి వారిదే!

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా జరుగుతన్న గనుల వేలంలో మన గొంతు వినేదెవరు అనే నిర్లిప్తత తెలంగాణ సర్కారులో కనబడుతోంది. గనులు కావాలనుకునే వాళ్ళు వేలంలో పాడుకోవలసిందే అని ఖరాఖండీగా అన్న కిషన్ రెడ్డి తర్వాత చెలరేగిన విమర్శలకు తాళలేక ఈ విషయం ప్రధాని దృష్టికి తీసికెళ్తాను అని ఓ మొక్కుబడి మాట అనేశారు. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి వైపు నుండి సింగరేణి సంస్థను ఎలాగైనా కాపాడాలనే ఆలోచన, పట్టింపు కానరావడం లేదు. పైగా కెసిఆర్ హయాంలో సింగరేణిలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరగాలని అంటున్నారు. గత పదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు కెసిఆర్ అతి జోక్యంతో సంస్థను నష్టపరిచారని అనడంలో అర్థమే లేదు. గనులను వేలం వేస్తాం కాని సింగరేణిని ప్రైవేటుకు అప్పగించం అని ఆయన అనడం కూడా విడ్డూరమే.

అందెశ్రీ కీర్తిస్తూ రాసిన ‘సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం’ అనే పాట నిన్నటి మాటగానే మిగిలిపోతుందేమో.. బొగ్గు గనుల వేలం వల్ల తెలంగాణలోని కొత్త గనులపై సింగరేణి సంస్థ హక్కు కోల్పోయి క్రమంగా అది మూతపడే అవకాశం ఉందని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. అందరి బెంగ ఆ వైపు ఉంటే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల వాదన ఎవరికివారు తప్పించుకునే ధోరణిలో ఉంది. ఆ సంస్థను మీరంటే మీరు ధ్వంసం చేశారంటూ బిజెపి, కాంగ్రెస్, భారాస నాయకులు ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా జారుకుంటున్న వీరి వైఖరికి తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు.

అందరం తెలంగాణ వాళ్ళమే, సింగరేణి మన సంస్థ. దాన్ని ఎలా కాపాడుకుందాం అని సామరస్యంగా మూడు పార్టీల నేతలు కలిసి చర్చించకుండా అదెటుపోతే మాకేంది, దాని పరిస్థితికి మా పార్టీ కారణం కాదని చెప్పుకోవడానికే అందరూ తండ్లాడుతున్నారు. 2015లో కేంద్రం దేశంలోని బొగ్గు గనుల బ్లాకులను వేలం విధానం ద్వారా అప్పగించడం మొదలయ్యాక గనుల తవ్వకాల్లో ప్రయివేటు సంస్థలకు ప్రవేశం లభించింది. అంతకు ముందంతా తెలంగాణలో ఎక్కడ బొగ్గు నిక్షేపాలున్నా సింగరేణి సంస్థ వాటి తవ్వకాలను మొదలు పెట్టేది. అలా 125 ఏళ్ళు గడిచింది. ప్రస్తుతం ఆరు తెలంగాణ జిల్లాల వ్యాప్తిగా 40 బొగ్గు గనుల్లో 42 వేల మంది ఉద్యోగులతో తవ్వకాలు కొనసాగిస్తోంది. ఒకప్పుడు లక్ష మంది ఉద్యోగులున్న సింగరేణి క్రమంగా కుదించుకుపోయింది. బొగ్గు తవ్వకంలో యంత్రాల వాడకం, ఓపెన్ కాస్టు విధానంతో క్రమంగా మానవ వనరుల అవసరం తగ్గిపోయింది.

అయినా ఇప్పటికీ సింగరేణిలో ఉద్యోగం అంటే గర్వపడే కాలమే కొనసాగుతోంది. మంచి సాలరీ, అలవెన్సులు, బోనస్, గృహవసతి, వైద్య, విద్య సదుపాయాలు సింగరేణి ఉద్యోగిని గర్వపడేలా చేస్తున్నాయి. చుట్టూ రాష్ట్రాలలో విద్యుదుత్పత్తికి సింగరేణి బొగ్గుయే కీలకం. బొగ్గుకు మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉన్నందువల్ల సింగరేణి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. ఉద్యోగుల బాగోగుల విషయంలో, పరిశ్రమల సామాజిక బాధ్యతలో అది ముందుంది. ఇప్పుడు పరిశ్రమకు మూలమైన బొగ్గునే లాగేసుకుంటే సంస్థ ఆరిపోయే దీపంలా కొడికట్టక తప్పదు.

భారాస ఇప్పుడు అధికారంలో లేని పార్టీ. ఆ పార్టీ విమర్శను ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. మిగతా రెండు పార్టీల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో, బిజెపి కేంద్రంలో పాలనలో ఉన్నాయి. తెలంగాణకు చెందిన జి.కిషన్ రెడ్డి కేంద్రంలో బొగ్గు గనుల శాఖామాత్యులుగా ఉన్నారు. 2015లో పార్లమెంట్‌లో గనుల వేలం బిల్లును ప్రవేశపెట్టినప్పుడు భారాస మద్దతు పలికిందని భాజపా నేతలు ఆ పార్టీని విమర్శిస్తున్నారు. మద్దతు పలికినంత మాత్రాన ఆ పార్టీకి ప్రశ్నించకూడదని అనలేం. ఆ సాకుతో బిజెపి తప్పించుకోవద్దు. గనుల వేలం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది అని కిషన్ రెడ్డి అంటున్నారు. కాని రాష్ట్రానికి పెరిగే ఆదాయం కన్నా సింగరేణి ఉనికి, ఉద్యోగుల భద్రత ముఖ్యం కదా! కాంగ్రెస్ పార్టీకి ఏమి చేయాలో తోచక రెండు పార్టీలను దోషిగా చేస్తోంది. పాలన తమ చేతిలో ఉంది కాబట్టి ఆ పార్టీ సింగరేణిని రక్షించే ఆలోచన చేయాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా నగరంలో జరుగుతున్న వేలం ప్రారంభ సభకు వెళ్లి కిషన్ రెడ్డిని వినతి పత్రాన్ని ఇచ్చి వచ్చారు. దాంతో ఆ పార్టీ బాధ్యత తీరిపోదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో సింగరేణికి సరైన మార్గ నిర్దేశన చేయకపోవడం మరో లోపం.

దేశవ్యాప్తంగా జరుగుతన్న గనుల వేలంలో మన గొంతు వినేదెవరు అనే నిర్లిప్తత తెలంగాణ సర్కారులో కనబడుతోంది. గనులు కావాలనుకునే వాళ్ళు వేలంలో పాడుకోవలసిందే అని ఖరాఖండీగా అన్న కిషన్ రెడ్డి తర్వాత చెలరేగిన విమర్శలకు తాళలేక ఈ విషయం ప్రధాని దృష్టికి తీసికెళ్తాను అని ఓ మొక్కుబడి మాట అనేశారు. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి వైపు నుండి సింగరేణి సంస్థను ఎలాగైనా కాపాడాలనే ఆలోచన, పట్టింపు కానరావడం లేదు. పైగా కెసిఆర్ హయాంలో సింగరేణిలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరగాలని అంటున్నారు. గత పదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు కెసిఆర్ అతి జోక్యంతో సంస్థను నష్టపరిచారని అనడంలో అర్థమే లేదు. గనులను వేలం వేస్తాం కాని సింగరేణిని ప్రైవేటుకు అప్పగించం అని ఆయన అనడం కూడా విడ్డూరమే. కొత్త గనులకు సింగరేణిని దూరం చేయడం అంటే ప్రయివేటు కన్నా అది పెద్ద వేటు. సింగరేణి కుదేలు అవడానికి ఈ దెబ్బ సరిపోదా! జరిగేది జరుగుతుందన్నట్లు కాంగ్రెస్ కాలు కదపడం లేదు. నామినేషన్ పద్ధతిలో గనులను తీసుకుంటే సదరు రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీ 14 % రాయల్టీ చెల్లించాలని అంటున్నారు. దాని వల్ల సింగరేణికి లాభం గణనీయంగా తగ్గుతుంది.

రాయల్టీ మొత్తం రాష్ట్రానికే చెందుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ కొచ్చే రాయల్టీని తగ్గించుకుంటే సింగరేణికి కోరుకున్న గనులు వచ్చే అవకాశం ఉంది. ఇంత అనుభవం, యంత్రాలు, ఉద్యోగులు, మౌలిక వసతులు ఉన్న సింగరేణి.. వేలం మాట వినగానే వణికి పోయే పరిస్థితికి కారణమేమిటి అనేది కూడా తేలాల్సిన ప్రశ్న. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ. వేలంలో గనులను రాబట్టుకునే ఇతర సంస్థలు ప్రయివేటు రంగానివి. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలుంటాయి. పని గంటలు, జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, వసతుల కల్పన.. మున్నగునవి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఒకేలా ఉండవు. ప్రభుత్వ పాఠశాల, ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏ విషయంలోనూ పోలిక ఉండదు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ప్రయివేటు సంస్థ సొంత లాభాల కోసం సిబ్బంది ఖర్చును వీలైనంత తగ్గిస్తుంది.

సింగరేణి తీరు వేరు. ఇప్పటికే ఉద్యోగులకు ఒక విధానం తయారై ఉంది. దాన్ని మార్చడం కుదరదు. ఈ వ్యవస్థతో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడడం దానికి అసాధ్యం. అలాగని సింగరేణిని నిర్వీర్యం చేస్తే రాష్ట్రం నిర్వహణలో బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగ కల్పన దెబ్బ తింటుంది. ప్రయివేటు కంపెనీలు వీలైనంత తొందరగా యంత్రాల సాయంతో బొగ్గును తవ్వుకొని లాభాలు దండుకొని వెళ్లిపోతాయి. అదే సింగరేణి అయితే ఉద్యోగాలు కల్పిస్తూ కలకాలం నిలిచి ఉంటుంది. రాష్ట్రానికి ఏది మేలు చేస్తుంది అని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పార్టీలను పక్కన పెట్టి ఆలోచించాలి. సింగరేణిని బతికించేందుకు వీరు చేసే కృషిని, దాని ఫలితాన్ని తెలంగాణ ప్రజలు వారి పేర్లతో ఎల్లకాలం గుర్తుంచుకుంటారు. లేదంటే సింగరేణిని ముంచిన మచ్చ కూడా వారిపైనే పడుతుంది.

బి.నర్సన్ 9440128169

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News