చికాగో : అంగారక గ్రహం వాతావరణంలోని మార్పులే ఎడారిలా గ్రహం మారడానికి కారణాలని ఇదివరకు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే కొత్తగా అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు వాతావరణం లో కార్బన్‌డైయాక్సైడ్ కోల్పోవడం వల్లనే గ్రహం పొడిగా, ఎడారిలా మారిందని తేల్చారు. కొన్నివేల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై వెచ్చదనంతోపాటు తడి కూడా ఉండేదని, రానురాను పొడిగా వాతావరణం మారుతూ వచ్చిందని యూనివర్శిటీ ఆఫ్ చికాగో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకప్పుడు అంటే 3.6 బిలియన్ సంవత్సరాల క్రితం నదులు, సరస్సులకు అనుకూలమైన వాతావరణం ఉండేదనడానికి నదీతీరాలు, డెల్టాల అవశేషాలు ఇప్పుడు సాక్షంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీటి ఉనికి ఉండేందుకు అనువైన శీతల , తేలికపాటి వాతావరణం నెలకొందని చికాగో యూనివర్శిటీ జియో ఫిజికల్ సైంటిస్టు ఎడ్విన్ కైట్ పేర్కొన్నారు. ఒకప్పుడు నివాసయోగ్యంగా ఉండే ఈ గ్రహం ఇప్పుడు నివసించలేనిదిగా మారిన గ్రహం ఇదొక్కటే అని, అందువల్ల దీని వాతావరణాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గ్రహంపై ఇదివరకు ఎత్తైన పర్వతాలు ఉండేవని, కానీ తరువాత ఇవి నదులు ఏర్పడడానికి వీలుగా మారాయని కైట్ ఇదివరకటి విశ్లేషణ వెల్లడించింది. హరిత వాయువుల ప్రభావానికి వాతావరణ మార్పులకు సంబంధం ఉందని, గ్రహ వాతావరణ శాస్త్రవేత్త బొవెన్ ఫాన్ చెప్పారు.