న్యూఢిల్లీ : న్యాయస్థానాలు న్యాయ వ్యవహారాలలో దిట్ట అన్పించుకోవచ్చు కానీ విద్యా రంగంలో నైపుణ్యత కోర్టులకు ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఉద్యోగాలకు అవసరమైన అర్హతల డిగ్రీలు ఏమిటీ? ఓ అభ్యర్థి తగు విధమైన అర్హతతోనే ఉద్యోగం పొందారా లేదా అనేది నిర్థారించాల్సిన అవసరం కోర్టులకు లేదు. ఇందుకు తగ్గ నైపుణ్యత కోర్టులకు ఉండాలని అనుకోరాదు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సింది సంబంధిత నిర్థారణల సంస్థలు లేదా వ్యవస్థలు అని, ఈ బాధ్యత తీసుకోవల్సింది అవే అని న్యాయమూర్తులు ఎంఆర్ షా, బివి నాగరత్నాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఉద్యోగాలకు ప్రకటనలు తరచూ పత్రికలలో యాడ్స్‌గా వస్తుంటాయి.
అయితే ఉద్యోగ అర్హతల డిగ్రీ ఖరారు దీనిని బేఖాతరు చేయడం వంటి అంశాలను కోర్టులు పరిశీలించాల్సిన అవసరం లేదని, నిజానికి ఏ ఉద్యోగానికి ఏ డిగ్రీ అర్హత ఉంటుంది? దేనిని ఎందుకు ఖరారు చేస్తారనేది పూర్తిగా సంబంధిత విద్యా నైపుణ్యాల సంస్థలు లేదా వ్యవస్థలు చూసుకుని తీరాలి, ఇందులో న్యాయ సంస్థలు చేయడానికి ఏమీ ఉండదు. చేయలేవు. అందుకు తగ్గ ప్రాతిపదిక కూడా ఉండదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో హైస్కూల్ టీచర్ల పోస్టులకు అక్కడి ప్రభుత్వం పిజి డిగ్రీలను అర్హతగా పేర్కొంది. సంబంధిత అంశంపై పలు అప్పీళ్లు దాఖలు అయ్యాయి. దీనిపై జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రకటన ప్రకారం చూస్తే సదరు పోస్టుకు పిజి అర్హతను ఖరారు చేశారు. అయితే అర్హతల డిగ్రీ ఖరారు సముచితమేనా కాదా? అనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు కావని ధర్మాసనం స్పష్టం చేసింది.