Monday, January 20, 2025

ఎపి, బీహార్‌కు నాటి వాగ్దానాలు ఏమయ్యాయి?: రాహుల్

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక హోదాపై మోడీని ప్రశ్నించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు ప్రత్యేక తరగతి హోదా(ఎస్‌సిఎస్)ఇస్తామన్న వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తారా అని కాంగ్రెస్ గురువారం ప్రశ్నించింది. ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శనాస్త్రాలను సంధిస్తూ మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందని పదేపదే ఊదరగొట్టారని, కాని వాస్తవం ఏమిటంటే ఇప్పుడు ఏర్పడేది మోడీ 1/3 ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ఒక వీడియో ప్రకటనను రమేష్ విడుదల చేస్తూ ప్రధాని మోడీకి నాలుగు ప్రశ్నలను&రెండు ఆంధ్రప్రదేశ్‌కు, రెండు బీహార్‌కు సంబంధించి కాంగ్రెస్ అడుగుతోందని చెప్పారు.

2014 ఏప్రిల్ 30న తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. దాని వల్ల ఆ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని మీరే చెప్పారు. పదేళ్లు గడిచినా అది ఇప్పటికీ జరగలేదు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తారా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇస్తారా? అని రమేష్ నిలదీశారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయడాన్ని ఇప్పుడు ఆపుతారా అని ఆయన ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఇక బీహార్‌కు సంబంధించి తన మిత్రపక్షం జెడియు అధినేత నితీష్ కుమార్ పదేళ్లుగా చేస్తున్న బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేరుస్తారా అని కూడా రమేష్ ప్రశ్నించారు.

2014 ఎన్నికలలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని కోసం ఎప్పటి నుంచో డిమాండు ఉందని, కాని ప్రధాని మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదని రమేష్ విమర్శించారు. ఆర్‌జెడి, కాంగ్రెస్, నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియుతో కూడిన మహాగట్బంధన్ ప్రభుత్వం బీహార్‌లో కులగణన నిర్వహించిందని రమేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే జరగాలని తాము డిమాండు చేశామని, దీన్ని నితీష్ కూడా సమర్థించారని ఆయన తెలిపారు. బీహార్‌లో నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తానని ప్రధాని మోడీ వాగ్దానం చేస్తారా అని రమేష్ ప్రశ్నించారు. కాగా..లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన జెడియు, టిడిపిపై బిజెపి ఆధారపడవలసి రావడంతో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు మోడీ గతంలో చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ ఇప్పుడు గుర్తు చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News