Sunday, January 19, 2025

పదేండ్లు మీరేం చేశారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, దాదాపు పదేళ్లుగా ఆయన ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం రహదారుల మీద శ్రద్ధ పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఎవరి మీద కావాలని కక్ష సాధించమని, తప్పులు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం ఉదయం సచివాలయంలోని 5వ అంతస్తులోని రూమ్ నెంబ ర్ 11లోని తన కార్యాలయంలోబాధ్యతలను స్వీకరించారు. ముందుగా వేదపండితులు నిర్వహించిన పూజల అనంతరం సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నరకు బాధ్యతలు స్వీకరించిచారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొమ్మిది దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.

14రోడ్లకు నేషనల్ హైవేలుగా హోదా పెంచాలి
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్ల నిర్వహణే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఢిల్లీకి వెళ్లి సోమవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లను నేషనల్ హైవేలుగా హోదా పెంచాలని, రీజనల్ రింగ్ రోడ్ సౌత్‌ను నేషనల్ హైవేగా గుర్తించాలని, విజయవాడ, హైదరాబాద్ రోడ్డును ఆరు లేన్‌లకు పెంచాలని, హైదరాబాద్- కల్వకుర్తి రోడ్డును నాలుగు లైన్‌లు చేయాలని గడ్కరీకి విన్నవిస్తానని ఆయన తెలిపారు.

సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను పెంచాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండున్నర గంటల్లో చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తామని మిగిలిన వాటిని 2 నుంచి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని రహదారులను నెలరోజుల్లోగా పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. భువనగిరి ఎంపి పదవికి నేడు రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. రానున్న వంద రోజుల్లో తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. సిఎం ప్రారంభించిన మహాలక్ష్మి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలనుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన తెలిపారు.

సీఎల్పీ ఆఫీస్‌లు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం
హెరిటేజ్ భవనంగా ఉన్న శాసనసభ పాత భవనాన్ని పునర్ వ్యవస్థీకరించి దానిలో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సీఎ ల్పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని, నూతన కౌన్సిల్ భవన నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారని, పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధం గా ప్రస్తుతం ఉన్న సిఎల్‌పి, ఇతర పార్టీల కార్యాలయాలున్న భవనాన్ని తొలగించి పబ్లిక్ గార్డెన్ నుంచి లలితా కళా తోరణం వరకు సుందరీకరణ చేసి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఒక ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్న ట్టు ఆయన వివరించారు. ఈ విషయంలో మరి కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి, శాసన మండలి చైర్మన్, సంబంధిత అధికారులతో కలసి పరిశీలించనున్నటు చెప్పారు.

ధర్మాపురం రహదారికి రూ.100 కోట్లు
కోమటిరెడ్డి చేసిన 9 సంతకాల్లో నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు రూ. 100 కోట్లు కేటాయింపు, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో లింగంపల్లి నుంచి దుగ్యాల రోడ్డుకు రూ. 4 .15 కోట్ల వ్యయంతో విస్తరణ చేయడం, రాష్ట్రంలో 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్-గ్రేడ్ చేయడం. వీటిలో మల్లెపల్లి నల్గొండ రహదారి, రీజనల్ రింగ్ రోడ్ సౌత్ వైపు ఉన్న చౌటుప్పల్,- ఆమనగల్ -టు షాద్‌గర్ టు -సంగారెడ్డి రహదారి తదితర రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హై- వేను ఆరులైన్ల రోడ్డుగా మార్చడం. నకిరేకల్- టు నాగార్జున సాగర్ మార్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం. హైదరాబాద్- టు కల్వకుర్తి జాతీయ రహదారి 765లోని ఒక సెక్షన్ మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చడంతో పాటు మరో రెండు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. రానున్న రెండు లేదా మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జయవీర్, బాలూ నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, స్పెష ల్ సెక్రటరీ విజయేంద్ర, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు మంత్రికి శుభాకాంక్షలు అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News