దేశ రాజధాని ఢిల్లీ పాలన అనిశ్చితంగానే కొనసాగుతున్నది. ఆప్, బిజెపి రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల మధ్య ఢిల్లీ గమ్యం ఎటు, ఈ ప్రభుత్వ భవితవ్యం ఏమిటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగబోతుండడంతో ఈ అనిశ్చిత పరిస్థితులకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పాలన సాగించేందుకు జైలు నిబంధనలు అనుమతించకున్నా ఆయన అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా చెబుతూ ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని కోరుతున్నారు.
లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. తన స్థానంలో మరో ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశమున్నా బిజెపి రాష్ట్రపతి పాలన విధిస్తే అది ఎన్నికల్లో తమకు అనుకూలిస్తుందని కేజ్రీవాల్ ప్రత్యామ్నాయ సిఎంను ప్రకటించడం లేదు. ఇది గ్రహించిన బిజెపి కూడా రాష్ట్రపతి పాలనకు తొందరపడడం లేదు. దీనితో ఢిల్లీ పాలన గందరగోళం మరి కొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయి. ఈ కేసులోని విచారణపరమైన అంశాలతో సంబంధం లేకుండా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని నిర్ధారించడానికి వీలులేని పరిస్థితి ఎదురైంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అగ్నిపరీక్షలో పడింది. కేజ్రీవాల్ జైలులో ప్రతివారం ఇద్దరు మంత్రులతో ఆయా విభాగాలకు సంబంధించి పాలనా పరమైన అంశాలపై చర్చిస్తారని, సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తారని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది.
ఈ సందర్భంగా జైలు మేన్యువల్ నిబంధనల ఆచరణ చర్చకు దారి తీసింది. జ్యుడీషియల్ కస్టడీలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కల్పించిన అవకాశాలను ఆసరా చేసుకుని కేజ్రీవాల్ జైలు మేన్యువల్ గ్యాప్‌ను ఉపయోగించుకుంటున్నారని, జైలు అధికారులు కూడా దీనికి అనుమతిస్తున్నారన్న అభిప్రాయం వస్తోం ది. అయితే జైలు మేన్యువల్ కార్యాచరణ (మోడస్ ఆపరెండి) అలా లేదు. ముఖ్యమంత్రిగా జైలులో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అది కల్పించడం లేదు. కేబినెట్ సమావేశాలు నిర్వహించడం కానీ, ఫైళ్లను సమీక్షించడం కానీ జైలు మేన్యువల్ ప్రకారం వీలుకాదు. ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కేజ్రీవాల్‌కు చట్టపరమైన అర్హత ఉన్నప్పటికీ, ఆ విధంగా విధులు నిర్వహించడానికి జైళ్ల మార్గదర్శకాలు ఒప్పుకోవు. ఈ విషయంలో ఖైదీల హక్కుల పరంగా జైలు మేన్యువల్ చాలా నిర్మాణాత్మకంగా ఉంది.
విచారణలో (అండర్ ట్రయల్ ) ఉన్న ఖైదీలు తమ కుటుంబీకులకు, సన్నిహిత బంధువులకు, స్నేహితులకు, న్యాయవాదులకు ఆస్తికి సంబంధించిన వివాదాలపైనే సమాలోచనలు చేయవలసి ఉంటుంది. అలాగే ఆ మేరకు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయడానికి వీలుంటుంది. అంతేకానీ రాజకీయ చిక్కులతో ముడిపడి ఉన్న ఏ వ్యవహారంపైనయినా, సంబంధిత డాక్యుమెంట్లపై సంతకం చేయరాదు. ఈ నిబంధన జైలులో ఉన్న ఏ ముఖ్యమంత్రికైనా వర్తిస్తుంది.ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా పనిచేసే అవకాశం ఈ నిబంధన కల్పించదు. ఈ కారణంగానే భూమి వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను గత ఫిబ్రవరిలో ఇడి అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా పాలన సాగించలేని పరిస్థితి ఏర్పడింది.
ఆయన అరెస్ట్ అయిన తరువాత ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. రెండు రోజుల తరువాత జార్ఖండ్ ముక్తిమోర్చా నేత చంపాయి సోరెన్‌ను అక్కడి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నియమించుకుని ప్రమాణ స్వీకారం చేయించింది. నిబంధనల ప్రకారం లెజిస్లేటివ్ సభ్యుడు ఎవరైనా ఏదైనా కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు జైలు నుంచి శాసన సభ స్పీకర్‌తో మాత్రమే సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. కేజ్రీవాల్ విషయంలో అలా ఏం జరగడం లేదు. తన వారసునిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చట్టపరంగా ఎవరికీ అప్పగించలేదు. అధికారికంగా ప్రభుత్వంలో ఎలాంటి హోదాలేని తన భార్య సునీతకు, పార్టీ ఎంఎల్‌ఎలకు, కార్యకర్తలకు జైలు నుంచే ఆదేశాలు అందిస్తున్నారు. తనతో పాటు ఆరుగురే తన ఆదేశాలు అమలు చేసేవారిగా కేజ్రీవాల్ చెబుతున్నారు.
ఈ ఆరుగురిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు. కానీ చట్టపరంగా ఇదెంత వరకు ఆచరణయోగ్యం అన్నది ప్రశ్న. ఢిల్లీలో ఇప్పుడు రాజ్యాంగపరమైన పాలన విచ్ఛిన్నమైందన్న వాదన వస్తోంది. 1991లో రాజ్యాంగంలో చేరిన ఆర్టికల్ 239 ఎబి ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో పరిపాలన నిబంధనల ప్రకారం సాగడంలేదని చెబుతూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోఅసాధారణ పద్ధతిలో ఢిల్లీ పాలనా వ్యవహారాలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సాగించడం తనతోపాటు తన పార్టీని రాష్ట్రపతి పాలన చట్రంలో ఇరుక్కునేలా చేయడమవుతుంది. అందుకని ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ వైదొలగి, లోక్‌సభ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తే చట్టపరమైన చిక్కులు తగ్గుతాయని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.