లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు సమీపిస్తున్న వేళ, దేశ భవిష్యత్తు ఆ తర్వాత ఏ విధంగా ఉండవచ్చుననే ప్రశ్నపై స్పష్టత కనిపించడం లేదు. ఎవరు గెలిచి అధికారానికి రాగలరనే అంచనాలు సరేసరి. బిజెపికి లేదా ఎన్‌డిఎకి గతంలోవలె భారీ మెజారిటీ రాగలదా? లేక సీట్లు తగ్గి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునా? లేక అనూహ్యమైన రీతిలో ‘ఇండియా’ కూటమికి ఆధిక్యత లభించగలదా? అనే ప్రశ్నలపై ఎడతెగని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందుకు సమాధానం జూన్ 4న ఏ విధంగా తేలినప్పటికీ, పైన అనుకున్నట్లు ఆ తర్వాత దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండవచ్చుననే విషయమై ఆలోచించవలసిన సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే, ఎవరు అధికారానికి వచ్చినా ప్రజల పరిస్థితి ఎంత మెరుగుపడవచ్చుననే ప్రశ్నకు సమాధానం రావడం లేదు.
ముందుగా జయాపజయాల పరిస్థితి చూసి, భవిష్యత్తు గురించిన చర్చలోకి తర్వాత వెళదాము. ఇంతకూ ఎవరు గెలవచ్చుననే ఊహాగానాలు ఇక్కడేమీ చేయడం లేదు. రెండు వైపులా గల వాదనలు ఏమిటో తెలిసిందే. కాకపోతే, అనుకూలతలు ‘ఇండియా’ కూటమి కన్నా ఎన్‌డిఎకు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఎన్నికలకు ముందు అట్లా కనిపించి కూడా ఫలితాలు మరొక విధంగా వెలువడిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అందుకు మూడు కారణాలను చెప్పవచ్చు.
ఒకటి, ఇంత సువిశాలమైన, వైవిధ్యమైన దేశంలో అంచనాలు తేలిక కాదు. రెండు, ప్రజలు ఒకప్పటివలే తమ అభిప్రాయాలను సర్వేయర్లకు మనసువిప్పి చెప్పకపోగా, సర్వే సంస్థలు కూడా తమ పని శాస్త్రీయంగా నిర్వహించడం లేదు. మూడు, ఆయా పార్టీలు లేదా వారి అనుకూలురు డబ్బిచ్చి చేయించే సర్వేలు కుప్పతెప్పలుగా విడుదలవుతూ ప్రజలను ప్రభావితం చేయజూడటం. ఇది చాలదన్నట్లు మేధావులు, అనబడే వారు సైతం తమ అభిమాన పార్టీల మధ్య చీలిపోయి, శాస్త్రబద్ధత ఏమీ లేకుండా, వాటికి అనుకూలం కాగల లెక్కలు ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ స్థితిలో, ఎవరికెన్ని సీట్లు, ఎవరిది ప్రభుత్వమనే అంచనాలలోకి వెళ్లకపోవటమే మంచిది.
ఎన్‌డిఎ, ‘ఇండియా’లలో ఎవరు అధికారానికి వచ్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చునన్నది తర్వాతి విషయం. ఇక్కడ గమనించవలసిన అంశాలు రెండున్నాయి. బిజెపి అజెండాలో, ప్రచారంలో మతం, జాతీయత అన్నవి బాగా చోటు చేసుకున్నాయి. ఇది వారు తిరిగి పెద్ద మెజారిటీతో గెలిస్తే ఏ విధంగా ఉంటుంది? మెజారిటీ బాగా తగ్గితే ఎట్లా ఉండవచ్చును? ఒకవేళ ‘ఇండియా’ కూటమి అధికారానికి వస్తే పరిస్థితి ఏమిటి? అన్నవి ఒక విధమైన ప్రశ్నలు. సాధారణ పరిపాలనకు సంబంధించి ఆర్థిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, విదేశాంగ విధానం, రక్షణ విధానం, ఆంతరంగిక విధానాలు ఎవరు గెలిస్తే ఏ విధంగా ఉండవచ్చుననేది రెండవ రకం ప్రశ్నలు. ఈ రెండింటిని కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే తప్ప, ఎన్నికల అనంతరం దేశ భవిష్యత్తు గురించి మన కేమీ తెలియదు. గెలిచేది ఎవరనే ప్రశ్న కన్న పరిపాలన గురించిన ఈ ప్రశ్నలు ఎక్కువ ముఖ్యమని వేరే చెప్పనక్కర లేదు.
ఇప్పుడు మొదటి ప్రశ్నను చూద్దాము. హిందూత్వ స్థాపన తమ లక్షమనటంలో బిజెపికి ఇక దాపరికమేమీ లేకుండాపోయింది. వాజ్‌పేయీ 19962004 మధ్య పాలించినపుడు ఇటువంటి అజెండాను ముందుకు తేలేదు. మోడీ కూడా 201419 మధ్య దీనిని చాలా వరకు మంద్ర స్థాయిలోనే ఉంచి, 2019లో రెండవ సారి అధికారానికి వచ్చినప్పటి నుంచి తీవ్రతను పెంచారు. అభివృద్ధిలో గుజరాత్ నమూనా మాటేమో గాని, సమాజాన్ని కాషాయీకరించడంలో మాత్రం గుజరాత్ నమూనాను అమలు పరచడం మొదలుపెట్టారు. అక్కడ ఆయన అధికారంలో ఉండిన 200114 మధ్య కాషాయీకరణ జరిగిన తీరుపై తగినన్ని అధ్యయనాలున్నాయి. అదే నమూనాను ఆయన 2019 నుంచి జాతీయ స్థాయిలోకి తీసుకు రావడం మొదలు పెట్టారు.
అందుకు ఇక మీదట పగ్గాలు ఉండబోవని ప్రస్తుత ఎన్నికల ప్రచారపు తీరును బట్టి ఆయన దేశ ప్రజలకు తెలియజెప్పుతున్నారు. అయితే ఇందుకు షరతులున్నాయి. 2019లో కన్న బిజెపి (303), ఎన్‌డిఎ (352)ల బలం పెరగాలి లేదా కనీసం ఇంచుమించు ఆ స్థాయిలో ఉండాలి. తమ స్వంత బలం 370కి, ఎన్‌డిఎ స్థానాలు 400కు పైగా చేరగలవని మోడీ ప్రచారం చేస్తున్నారు. అది నెరవేరకపోయినా, ఒకవేళ 2019 కన్న తగ్గినప్పటికీ స్వల్పంగానే అయిన పక్షంలో బిజెపి, సంఘ్ పరివార్‌ల కాషాయీకరణ ప్రణాళికకు తగిన ఊతం తప్పక లభిస్తుంది. అనగా 202429 మధ్య కాలం ఇందుకు సంబంధించి ఏ విధంగా సాగగలదీ ఎవరి ఊహాగానాలు వారు చేయవచ్చు. దాని ప్రభావాలు సమాజంపై, మత సామరస్యత, శాంతి భద్రతలపై ఎట్లా ఉండేది కూడా అంచనాలకు రావచ్చు. ఒకవేళ బిజెపి సీట్లు 2019 కన్న గణనీయంగా తగ్గినా, లేక వారసలు అధికారానికి రాకపోయినా కాషాయీకరణకు సంబంధించి ఏమి జరగవచ్చునన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న.
ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం ఉన్నది. అదేమంటే, బిజెపి సీట్లు గణనీయంగా తగ్గినా లేక అసలు అధికారంలోకి రాకపోయినా కాషాయీకరణ ప్రయత్నాలు ఆగకపోవచ్చు. అధికారానికి రాకపోతే అందుకు కేంద్ర ప్రభుత్వపు తోడ్పాటు ఉండదు గాని, బిజెపి రాష్ట్రాల తోడ్పాటు ఉంటుంది. ఆ రాష్ట్రాల సంఖ్య తక్కువ కాదు. ఒకవేళ కేంద్రంలో తక్కువ సీట్లతో అధికారానికి వచ్చినా, అది కొంత వెనుకబాటు అయ్యే మాట నిజమే గాని, అంతమాత్రాన కాషాయీకరణ ప్రయత్నాలు నిలిచిపోగలవనే హామీ లేదు. ఎందుకంటే, సంఘ్ పరివార్‌కు, బిజెపికి అది అన్నింటికన్న, ప్రభుత్వాధికారం కన్నా కూడా ముఖ్యమైన సైద్ధాంతిక లక్షం. వారు ఆ లక్షం కోసం అధికారాన్ని వదులుకుంటారు గాని, అధికారం కోసం లక్షాన్ని కాదు. అయితే, అధికారం కోసం లక్షం విషయంలో కొంత రాజీ పడే పద్ధతి వాజ్‌పేయీ, అద్వానీల కాలం వరకు ఉండేది. ఆ తర్వాత కాదు. మునుముందు ఏమయేదీ చెప్పలేము. కాని ప్రస్తుతం ఆ విధంగా లేదు. అందువల్ల, మెజారిటీ తగ్గినప్పటికీ బ్రేకులు పడతాయని భావించలేము.
ఇది ఒకటైతే, ఒకవేళ ‘ఇండియా’ కూటమి గెలిచినట్లయితే కాషాయీకరణను ఆపగలదా అన్నది ఒక కీలకమైన ప్రశ్న. దీనిపై సెక్యులరిస్టులు అనబడేవారు, ముస్లింలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అపుడు కాషాయీకరణకు ప్రభుత్వం నుంచి దోహదం లభించదు. కాని గ్రహించవలసిందేమంటే, సామాజిక స్థాయిలో కాషాయీకరణ ఇప్పటికే చాలా జరిగింది. ఇంకా జరుగుతున్నది. కొంత బాహాటంగా, కొంత చాపకింద నీరువలే. బిజెపి తిరిగి అధికారానికి రాకున్నా ఈ ప్రయత్నాలను సంఘ్ పరివార్ ఉధృతంగా సాగిస్తూనే ఉంటుంది. అపుడు మరింత పట్టుదలతో చేయవచ్చు కూడా. ఇందులో సమస్య ఏమంటే, స్వయంగా కాంగ్రెస్ పైకి ఏమి మాట్లాడినా, వారికి ప్రణాళికబద్ధమైన, అంకిత భావం గల సెక్యులర్ అజెండా నెహ్రూ తర్వాత ఎప్పుడూ లేదు. పైగా, హిందూత్వ వ్యాప్తికి భయపడి సాఫ్ట్ హిందూత్వ విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు.
అందుకు రాహుల్ గాంధీ మినహాయింపు కారు. కనుక, ఒకవేళ ఓడినా కొనసాగే బిజెపి కాషాయీకరణ వత్తిళ్ళు, ప్రణాళిక, నిబద్ధత లేని కాంగ్రెస్ సెక్యులరిజం మధ్య జరిగేది ఏమిటో ఊహించడం కష్టం కాదు. ఇకపోతే సాధారణ పరిపాలన. నిజానికి ఆర్థిక విధానాలు, ఇతర విధానాలు, ప్రజల అభివృద్ధి, సంక్షేమం, సమర్థవంతమైన పాలన, అవినీతి మొదలైన విషయాలలో బిజెపి, కాంగ్రెస్‌లకు తేడా లేదు. ఇరువురి పరిపాలనా కాలాలను, వాటి ఫలితాలను సమీక్షిస్తే ఈ మాట ఎవరికైనా అర్థమవుతుంది. కేంద్ర స్థాయిలోనైనా, రాష్ట్రాలలోనైనా రాహుల్ గాంధీ ఈసారి మరో విడతగా అవే పాత అజెండాలను ప్రకటించారు. గతంలో అమలుగానివి ఈసారి అమలవుతాయని నమ్మగలమా? పైగా వ్యక్తిగతంగా ఆయన సమర్థత గత 20 ఏళ్లలో ఎప్పుడూ కన్పించనపుడు? ఇది చాలదన్నట్లు ‘ఇండియా’ కూటమి సుస్థిరతపై ఎన్నో సందేహాలు. అందువల్ల, జూన్ 4 నుంచి ఎవరు పాలించినా, దేశ భవిష్యత్తుపై అనిశ్చిత చాలా కనిపిస్తున్నది.
టంకశాల అశోక్
9848191767