హైదరాబాద్: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, మహనీయుడు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుండా అడ్డుకుంటున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయాంలో సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో మహనీయుడు చిత్రపటానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. దళిత బందు తొలగించి అంబేడ్కర్ అభయహస్తం తెస్తామన్నారని, ఇప్పటివరకు ఎందుకు తీసుకరాలేదని అడిగారు. దళితబంధు అడిగిన వారిపై దండిగా కేసులు పెడుతున్నారని కెటిఆర్ విమర్శలు గుప్పించారు.