Monday, December 23, 2024

దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?

- Advertisement -
- Advertisement -

South India politics

పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు మనం కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి ఇచ్చేది ఆఠానయే అనే మాట వాస్తవం. 2014 -15 లో అయితే రాష్ట్రం ద్వారా కేంద్రానికి దక్కిన పన్నుల ఆదాయం రూ. 40727 కోట్లు కాగా రాష్ట్రానికి విడుదల అయింది మాత్రం రూ. 14924 కోట్లు మాత్రమే. అంటే రూపాయికి 37 పైసలే అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సొమ్ముకు బదులుగా కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న చిక్కులే ఎక్కువ. ఇదే రకంగా తమిళనాడు రూపాయికి ముప్పై పైసలు, కర్ణాటక 47 పైసల భాగం పొందుతున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ రూపాయి ఇచ్చి రూ. 1.79 పై., బీహార్ రూ. 2 .19 పై. దండుకుంటున్నాయి.

 

మన దేశంలో దక్షిణాన ఉన్న అయిదు రాష్ట్రాల, మిగితా ఉత్తరాది రాష్ట్రాల మధ్యన ఏ రంగంలో చూసినా కనీస విభిన్నత కనబడుతుంది. దేశ పాలనలో కూడా రాజధానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాల ప్రాబల్యమే ఎక్కువ. ప్రధాన మంత్రిగా ఒక టర్మ్ పూర్తి చేసిన పివి నరసింహారావు, పది నెలలు ఆ పీఠంపై కూచున్న దేవెగౌడ మినహా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మిగితా ప్రధానులంతా ఉత్తరాది వారే. భవిష్యత్తులో దక్షిణాది వ్యక్తి ఆ పదవిని అలరించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు కూడా ఆశావహ సమాధానం దొరకదు. ఈ పరిస్థితికి పలు కారణాలున్నాయి. ఉత్తరాన గల హిందీ మాట్లాడే ఏడు రాష్ట్రాల్లో 205 పార్లమెంట్ స్థానాలున్నాయి. మొత్తం 543 లోక్‌సభ సీట్లలో 129 మాత్రమే దక్షిణాది రాష్ట్రాల చేతిలో ఉన్నాయి. అంటే 75 % ఉత్తరాదికి చెందినవే అనేది స్పష్టం. ఈ ఆధిక్యత వల్ల దేశాన్ని పాలించే బలం దక్షిణాది వారికి లేకపోవడం పోగా ఢిల్లీ పీఠం ఆధిక్యతను, వివక్షను కింది రాష్ట్రాలు భరించక తప్పడం లేదు.
ఫెడరల్ స్ఫూర్తిని తూట్లు పొడిచేలా కేంద్రం క్రమంగా దేశంపై సర్వహక్కుల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం యథేచ్ఛగా కొనసాగుతున్నా దక్షిణాదిది కేవలం ప్రేక్షక పాత్రగానే మిగులుతోంది. పార్లమెంట్‌లో సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్నా దక్షిణం ఎన్నో అంశాల్లో ఉత్తరాదిని మించి ముందడుగులో ఉంది. ఈ రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో ఆధునికబాటలో పయనిస్తున్నాయి. వీటిలో సామాజిక వివక్ష, హింస తక్కువ, ముస్లిం తదితర హిందూయేతర మతాల పట్ల వ్యతిరేకత ఉత్తరాదిలో పోల్చితే లెక్కలోకి రాదు. విశ్వ విద్యాలయాల్లో అగ్రకుల ఆధిక్యత లేదనవచ్చు. ఉత్తరాది మాదిరి వ్యాపార వర్గాలు తక్కువున్నా, కేంద్రం చల్లని చూపు లేకున్నా దక్షిణ రాష్ట్రాల్లో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి తక్కువేమి లేదు. గత రెండు దశాబ్దాలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఇంజినీరింగ్ విద్య పెరిగి దేశంలోనే అధిక సంఖ్యలో సాంకేతిక నిపుణులు ఈ వైపు నుంచి పుట్టుకొచ్చారు. జీవన ప్రమాణాలు మెరుగై స్థిరాదాయాలతో ప్రజలిక్కడ శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. ఉత్తరాది నుండి దక్షిణం వైపే కార్మిక వలసలు ఎక్కువని ఎన్నో లెక్కలు తేల్చాయి.
1960 దాకా పేదరికం అనుభవించిన ద్రవిడ ప్రాంతం 1980, 90 దశకాల్లో పారిశ్రామిక అభివృద్ధికి శ్రమశక్తి తోడై అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించింది. 1990 -2000 మధ్యన సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో ఈ ప్రాంతం సాధించిన అభివృద్ధి దేశ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ కల్పనలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఉత్తరాదిలో యుపి, బీహార్ రాష్ట్రాల మాదిరి మత హింస లేనందువల్ల విదేశీ పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి. కింది వర్గాలను ఎదగనీయకుండా అడ్డొచ్చే బ్రాహ్మణీయ ప్రాబల్యం వివిధ సామాజిక సంస్కరణవేత్తల సాహసిక శ్రమ ఫలితంగా ఇక్కడ అంత ఉధృతంగా లేదు. పెరియార్, నారాయణ గురు లాంటి సంస్కర్తల బోధనల వల్ల కుల, లింగ వివక్ష తగ్గు ముఖం పట్టాయి. దక్షిణాది మహిళలో చదువు పట్ల ఆసక్తి పెరిగింది. పెళ్లి విషయంలో, భర్త ఎంపికలో కొంత స్వేచ్ఛ ఉంది. వరకట్నం, తక్కువ సంతానం, సొంత ఆస్తి లాంటి కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ఈ విధంగా ప్రపంచంలో ఈ దేశం ముందైనా తల ఎత్తుకొనే స్థాయికి దక్షిణ భారతం చేరుకుంటుంటే ఢిల్లీ పాలన హక్కు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
పన్నుల విషయానికొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపం లో కేంద్రాని కిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు మనం కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి ఇచ్చేది ఆఠానయే అనే మాట వాస్తవం. 2014 -15 లో అయితే రాష్ట్రం ద్వారా కేంద్రానికి దక్కిన పన్నుల ఆదాయం రూ. 40727 కోట్లు కాగా రాష్ట్రానికి విడుదల అయింది మాత్రం రూ. 14924 కోట్లు మాత్రమే. అంటే రూపాయికి 37 పైసలే అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సొమ్ముకు బదులుగా కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న చిక్కులే ఎక్కువ. ఇదే రకంగా తమిళనాడు రూపాయికి ముప్పై పైసలు, కర్ణాటక 47 పైసల భాగం పొందుతున్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ రూపాయి ఇచ్చి రూ. 1.79 పై., బీహార్ రూ. 2 .19 పై. దండుకుంటున్నాయి. పార్లమెంట్ సీట్ల సంఖ్య విషయంలోకి వెళ్లే జనాభా పెరుగుదల సంగతి చూద్దాం.
2011 నుండి 2021 మధ్యన ఉత్తరాదిలో జనసంఖ్య పెరుగుదల రేటు 20 % ఉంటే దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం 16 % మాత్రమే ఉంది. జనాభా ప్రాతిపదికన భవిష్యత్తులో పార్లమెంట్ స్థానాలు పెంచినా మరింత లాభపడేది ఆర్యపథమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం దేశంలో 8 లక్షల జనాభాకు ఒక లోక్‌సభ స్థానం లెక్కన 1952 లో 500 సీట్లు ఖరారు చేశారు. వాటిని 1973 లో 525 గా సవరించారు. నాటికీ నేటికీ జనాభా మూడింతలు పెరిగింది. భవిష్యత్తులో సీట్లు పెరిగినా దక్షిణ పాలు మరింత తగ్గే అవకాశమే ఉంది.
జులై 2021లో సవరించిన కేంద్ర మంత్రివర్గం ప్రకారం 75 మందిలో దక్షిణ భారతం నుండి కేవలం ఐదుగురికి మాత్రమే బెర్తు లభించింది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌ల నుండి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేదు. ఈ అయిదు రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే బిజెపి పాలన ఉంది. మిగితా మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఒక చోట సిపిఎం పాలన ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలు కేంద్ర కంటికినుకును అనుభవించాల్సిరావడం రాజ్యాంగానికే ఒక సవాలుగా మారిందనవచ్చు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పాలన పెరిగి కేంద్రంలో పాలించే పార్టీతో వాటికి ఎలాంటి బంధం లేనపుడు ప్రజలు రాజ్యాంగబద్ధ సమాన హక్కును అనుభవించే సదుపాయం కోల్పోకూడదు. కేంద్రం విద్య, వైద్య సదుపాయాలను, నిధులను, అభివృద్ధిని అన్ని రాష్ట్రాలకు అవసరానుగుణంగా పంచాలి.
పశ్చిమ బెంగాల్ తో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు హక్కుల దుర్వినియోగానికి ఉదాహరణగా చెప్పొచ్చు. వరదల సమయంలో కేరళను కేంద్రం పలు చిక్కులు పెట్టింది. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి రాజకీయ వైరుధ్యాలు రైతుల కష్టాలకు కారణమవడం అసమ పాలనకు పరాకాష్ఠ.ఎటు చూసినా ప్రాంతీయ పార్టీల పాలన వల్లగాని, పార్లమెంట్ సీట్లలో తగిన సంఖ్యలేకపోవడం వల్ల గాని పార్లమెంట్ భవనంలో జరిగే నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం. ఈ విషయంలో బిజెపి నాలుగాకులు ఎక్కువే చదివినట్లు విపక్ష పార్టీల పాలన గల రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తోంది.
దక్షిణాది ప్రాంతీయ పార్టీలతో పాటు ఉత్తరాదిన నిమ్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కలిస్తే కేంద్రంలో బిజెపిని ఢీ కొనే అవకాశం ఉంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలు, బిజెపి పాలనలోని ప్రతిపక్షాలు కలగలిసి గట్టి కూటమి కడితే దేశంలో కొంగొత్త, వినూత్న పాలనకు బాటలు వేయవచ్చు. గత కొద్ది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ పక్ష నేతలను కలుస్తున్న తీరు కొంత ఆశల్ని కలిగిస్తోంది. తెలంగాణ సాధనలో ఆయన చూపిన పట్టు, తెగువ దేశవ్యాప్త గుర్తింపును తెచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడే నేతలు దేశ వ్యాప్తంగా పాలనలో, విపక్షంగానో ఎందరో ఉన్నారు. వీరి కృషి, సంకల్పం వల్లనైనా దక్షిణ, ఉత్తర అనే భేదభావాలకు తెర పడాలి. ఇది భావి భారతానికి ఆవశ్యకం, అనివార్యం.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News