‘సనాతన ధర్మం’ అంటే పురాతన కాలం నాడు అనుసరించిన ధర్మం అనే అర్ధం ఉంది ఏ ‘ధర్మం’ అయినా సాధారణంగా ఆయాకాలాల్లో అవసరాలు, పరిస్థితులను బట్టి రూపొందుతాయి. ధర్మం అనే పదానికి జీవన విధానం అనే అర్ధం కూడా వాడుకలో ఉంది.వాటి అవసరం, ప్రయోజనం ఉన్నంత వరకు మనిషి వాటిని పాటిస్తాడు.ఆ ధర్మాలు కూడా అమలులో ఉంటాయి. అయితే కాలప్రవాహంలో మనుషుల అవసరాలు, కోరికలు మారుతుంటాయి. వాటిని అనుసరించి పాత ధర్మ శాస్త్రంలో కొన్ని నియమాలు, సూత్రాలు, ఆచారాలు రద్దు కావచ్చు. మరికొన్ని అక్కడక్కడా మార్పులు, చేర్పులు అవసరం కావచ్చు. లేదా పూర్తిగా పాత ధర్మాన్ని తొలగించి దాని స్థానం లో నూతన ధర్మాన్ని ప్రతిష్టించవచ్చు. ఈ కాల ప్రవాహంలో సర్వకాల, సర్వవ్యవస్థలకు పనికి వచ్చే శాశ్వత ధర్మాలు అంటూ ఏవీ ఉండవు. ఈ ధర్మాలనే, శాసనాలు, చట్టాలు అని కూడా వాడుకలో పిలుస్తాము. వీటి నుండే సంప్రదాయాలు, ఆచారాలు, వాడుకలు, రివాజులు ఏర్పడతాయి.
ఇవి అన్ని మతాలకు సమానంగా వర్తిస్తాయి. ఈ ధర్మాలు కూడా కొంత కాలం అతి బలమైనవిగా, ప్రభావశీలంగా ఉంటాయి. అశేష ప్రజలను తీక్షణంగా శాసిస్తాయి. క్రమంగా పలుచబడి, చివరకు శక్తిహీనంగా రూపు మాసిపోతాయి. ఇవన్నీ మన అవసరాల కోసం ఆయా కాలాలలో మనుషులు (రుషులు, ఆచార్యులు పేర్లు, విశేషణాలు ఏమైనా కావచ్చు) రూపొందించినవే కానీ, ఏవీ ‘అపౌరుషేయాలు’ కావు. అంటే ఈ ధర్మాలు, శాసనాలు కేవలం మానవ నిర్మితాలే. అంతేగానీ దేవుడో, మరో అతీంద్రీయ శక్తులో రూపొందించినవి కావు. ఇలాంటి ధర్మాలు, చట్టాలు, శాసనాలు, ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, రివాజులు పేర్లు ఏవైనా ఆనాటి సమాజంలోని ప్రజలను భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక క్రమ పద్ధతుల్లో నడపడానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు అవసరమయ్యాయి. మానవ భౌతిక ప్రవర్తనను క్రమశిక్షణలో, అదుపులో ఉంచటానికి ఇవి ప్రయత్నిస్తాయి. కానీ మానవ మనోభావాలను అదుపు చేయటం కష్టం. ఎన్ని నియమాలు పెట్టినా మానవ ఆలోచనలు, తలంపులు అంత తొందరగా అదుపులో ఒదిగి ఉండవు.
అందుకే మతం అనేది మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన మనసుపై ప్రభావాన్ని చూపుతుంది. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం వంటి కొన్ని భయాలు, కొన్ని అపోహలు మానసికంగా మనిషిని నిర్దేశిస్తాయి. మానవ ఆలోచనా పరంపరకు కళ్ళెం వేయటానికి ఈ భయాలు కొంతమేరకు తోడ్పతాయి. గుడులు, గోపురాల పరిసరాలు, పూజా విధానాలు, మంత్ర, తంత్రాలు, యోగం, ధ్యానం మొదలైనవి కొంతమేరకు మానవ భౌతిక శరీరాన్నీ, మనసును అదుపు చేస్తాయి. సమాజ ఆమోదిత ప్రవర్తనను కట్టుతప్పి ప్రవర్తించకుండా కొంత మేరకు నియంత్రణ చేస్తాయి. ఇవి అన్ని యుగాలలోనూ, అన్ని మతాలలోనూ, అన్ని దేశాలలోనూ, అన్ని కులాలు, తెగలలోనూ మానవ సమూహాలలో ఇలాంటి కట్టుబాట్లు చరిత్ర అంతటా ఉంటాయి. ఇవి భూత, భవిష్యత్త్, వర్తమాన కాలంలో కూడా ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి కూడా. అయితే ఇవి ఏవీ శాశ్వతమైన శిలాశాసనాలు కావు. ఇవి కాలాన్ని అనుసరించి, మానవ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చెందడం సహజం. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు స్వచ్ఛందంగా పరిసరాల నుండి ఏర్పడితే మరి కొన్ని ఇతర ప్రాంతాల, దేశాల సంపర్కం వల్ల దిగుమతి అవుతాయి. కొంత కాలానికి స్వదేశీ సంస్కృతిలో అంతర్లీనం అవుతాయి.
అందుకే కృతయుగ ధర్మాలు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ఉండే ధర్మాలు ఒకటి కావు. కాలాలను బట్టి యుగ ధర్మాలు కూడా ఎంతో కొంత మేరకు మార్పులకు లోనవుతూ వుంటాయి. మరి కొన్ని రద్దవుతూ, కొన్ని నూతన ధర్మాలు, చట్టాలు, శాసనాలు మారుతూ వస్తాయి. ఈ ధర్మాలలో కొన్ని చాలా దీర్ఘకాలం మార్పులు చెందకుండా కొనసాగుతాయి. వాటినే మనం శాశ్వత ధర్మాలు, శాశ్వత విలువలు అంటాము. కానీ అవి కూడా మరికొంత కాలానికి తరాలు మారినకొద్దీ వాటి అంతరాంతరాల్లో కూడా తేడాలూ వస్తూనే వుంటాయి. మన దేశంలో హిందువులు ప్రామాణికంగా చెప్పినవి (వ్యాసుడు, ఆపస్థంబుడు, పరాశరుడు, మనువు మొదలైన అనేక మంది రుషులు, మునీశ్వరులు) చెప్పిన ధర్మాలను ఆనాటి సమాజంలో ప్రజలు విధిగా ఆచరించారు. ఇవి లిఖిత రూపంలో కానీ, అలిఖిత రూపంలో కానీ ఉండొచ్చు. కాలం మారే కొద్దీ వీటిని పాటించేవారు, అలాగే వాటిని తిరస్కరించి, ధిక్కరించేవారుఉంటారు.
వాటిల్లో లోపాలు వెతికేవారు కూడా ఆయా కాలాల్లో సమాంతరంగా ఉంటారు. సమాజంలో ఆస్తిక వాదం, నాస్తిక వాదాల మధ్య వైరుధ్యాలు సహజంగా ఉంటాయి. ముఖ్యంగా లోకాయతం, చార్వాకులు మొదలైన వారు నాస్తికులు. వీరు ఆత్మవాదాలను, అలౌకిక భావాలను తిరస్కరించిన భౌతిక వాదులు. వీరు నాస్తిక భావాలకు, పదార్ధ భావాలకీ, భౌతిక ఉనికికీ ప్రాధాన్యతను ఇచ్చారు. వీరు పూర్తిగా విగ్రహారాధనను, వేద వాంజ్మయాన్ని తిరస్కరించారు. పరలోకం, పిండాలు పెట్టడం, జ్యోతిష్యం మొదలైన కర్మకాండను తిరస్కరించారు. సనాతన ధర్మాల్లో యజ్ఞ, యాగాదులు, ఈశావాస్యం, కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు మొదలైన వాటిల్లో చెప్పబడిన జంతు బలులు, నరబలులు, విగ్రహారాధన, పూజలు, నోములు మొదలైన కొన్ని అనాచారాలను బుద్ధుడు ధిక్కరించాడు, అనేక అమానుష పద్ధతులను ఖండించాడు.
అలాగే నాగార్జునుడి ‘మాధ్యమిక వాదం’, విజ్ఞానవాదం, వజ్రాయనం, వామాచారం, జైనం, తర్క పద్ధతి, సాంఖ్య దర్శనం, వైశేశిక దర్శనం, న్యాయ దర్శనం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, అద్వైతం (ఆది శంకరుడు), శంకరాద్వైతం, శంకరుని మాయావాదం, విశిష్టాద్వైతం (రామానుజుడు),
ద్వైతవాది మధ్వాచార్యుడు, వైష్టవ భక్తకవులు, శైవం: పాశుపతం, కాపాలికం, వీరశైవం, కాశ్మీర శైవం, శాక్తేయం, వామాచచారం మొదలైన సంప్రదాయ హిందూ తాత్త్విక సిద్ధాంత, ఆచారాలలో అనేక వైరుధ్యాలు, ఘర్షణలు, మార్పులు, చేర్పు లు కాలానుగుణంగా వచ్చాయి. కనుక నిత్యనూతన మార్పులకు ఏ సిద్ధాంతాలు, తత్త్వాలు అతీతం కాదు. ఏదీ పవిత్రమూ కాదూ, ఏదీ అపవిత్రం కూడా కాదు. కాలవరవడిలో, మారుతున్న మానవ అవసరాలకు తగినట్లుగా సామాజిక మార్పులు, జీవన విధానాలు, విలువలు, నమ్మకాలు, విశ్వాసాలు మార్పులు చెందటం సహజం. ఆధునిక కాలంలో కూడా హిందూ ధర్మంలో (మతంలో) స్థిరపడిన అనేక నమ్మకాలను, విశ్వాసాలను హేతుబద్ధంగా, తర్కబద్ధంగా వ్యతిరేకించిన సంఘ సంస్కర్తలు ఉన్నారు. వారు కొన్ని సంఘాలను స్థాపించి, మతం పేరుతో కొనసాగుతున్న కర్మకాండను, వ్రతాలను, క్రతువులనూ, యజ్ఞయాగాలను జంతు/ మానవ బలులనూ, విగ్రహారాధనను, కొన్ని మూఢ నమ్మకాలను నిరసించారు. ఈ సంఘ సంస్కర్తలు మానవ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను ఎండగట్టి ఆయా కాలాల్లో సంస్కరణలను తీసుకువచ్చారు. హిందూ సంప్రదాయ సమాజంలో ఒక నూతన చైతన్యం తెచ్చారు.
వారిలో ప్రముఖులు బ్రహ్మసమాజం (రాజా రామమోహన రాయ్), ఆర్యసమాజం (దయానంద సరస్వతి), స్వామీ వివేకానంద, దివ్యజ్ఞాన సమాజం (డా.బి. అనీబిసెంట్) దివ్యజీవన దర్శనం (అరవింద ఘోష్), విశ్వమానవుడు (రవీంద్రనాథ్ టాగూర్), నవ్యమానవతావాది (ఎంయన్ రాయ్), నిత్య సత్యాన్వేషి (జిడ్డు కృష్ణమూర్తి) మొదలైన ఆధునిక హైందవ తాత్త్వికులు హిందూ ధర్మంలో వున్న సిద్ధాంతాలతో వారు విభేధించారు. ఇలా విభేదాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకూ అనేకం ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. ఇవి కేవలం హిందూ మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని ప్రధాన మతాలలో అంతర్గత సిద్ధాంత చర్చ, ఘర్షణ, వాదోపవాదాలు కాలానుగుణంగా మన భౌతిక, మానసిక పరిణితిని అనుసరించి సమాజంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. భారత దేశంలో తరతరాలుగా వేళ్ళూనుకున్న కులం, మతం, అంటరానితనం కొంత మేరకు మొదలైన రుగ్మతలు సమాజాన్ని విడగొట్టి ప్రజల మధ్య అంతరాలను పెంచింది. అయితే, క్రమంగా విద్యావంతుల్లో, ఉద్యోగులలో, పట్టణ, నగర వాసుల్లో కొంత మేరకు ఈ వివక్ష భావాలు తగ్గాయి. బ్రిటీష్ వారి కాలం నుంచి అనేక పాలనా సంస్కరణలు,
మన సంఘ సంస్కర్తల కృషి వల్ల అనేక నూతన చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా కన్యాశుల్కం రద్దు. బాల్యవివాహాల రద్దు, వితంతు పునర్వివాహ చట్టం, సతీసహగమన రద్దు, స్త్రీ విద్యకు ప్రోత్సాహం, ఇంగ్లీషు చదువులు, స్త్రీలకు ఆస్తిహక్కు మొదలైన అనేక నూతన చట్టాలు సనాతన ధర్మాలలో అమానుష ఆచారాలను ధర్మాలను రద్దు చేసి మన దేశ పౌరుల మూఢ విశ్వాసాలను తొలగించారు. నర బలులను నిషేధించారు. ఈ కార్పొరేట్ యుగంలో, నవ సమాజంలో కుల, మతాలతో గూడు కట్టుకున్న అంతరాలను సంస్కరిస్తూ అనేక చట్టాలు వచ్చాయి. అయినా కూడా ఈ వివక్షలు పూర్తిగా గ్రామీణ, పట్టణ సమాజం నుండి సమూలంగా అంతరించిపోలేదు. వాటి అవశేషాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే ‘కరోనా’ వైరస్ వివిధ దశలలో పరివర్తనం (మ్యుటెషన్) చెందుతున్నట్లు ఈమార్పులు కూడా మానవ సమాజంలో వచ్చినట్లు కనిపిస్తున్నా, నాగరికుల్లో కూడా అంతరాంతరాల్లో ఏదో మూల కులతత్త్వం, మతతత్త్వ సనాతన సంకుచిత భావాలు నిక్షిప్త రూపంలో ఉన్నాయి.అమెరికాకు పోయినా, అంతరిక్షానికి పోయినా ఈమతమౌఢ్య భావాల జాడ్యా లు అంతతొందరగా మనిషిని వదలడం లేదు. తాను సృష్టించుకున్న ఈ కుల,
మత ఊబిలో నుండి బయటకు పూర్తిగా రాలేక ‘శేష్మంలో ఈగ’ లా గిలగిలా కొట్టకుంటున్నాడు. ఇప్పుడున్న అధునాతన సాంకేతిక విప్లవం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఛాట్ జిపిటి)వంటివి మానవ మేథస్సుతో పోటీపడి మనిషిని- మనీషిగా మారుస్తుందా? మరింత దారుణంగా అమానుషంగా సనాతన కుల, మతాల సంఘర్షణలకు తావిస్తుందా!! అనేది భవిష్యత్తులో చూడాలి.