కాంగ్రెస్ నేతలపైనే ఎందుకు ఈ దాడులు?
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడి, సిబిఐ, ఐటి దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు వేరే పార్టీల నేతలపై ఎందుకు సోదాలు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లమీద ఐటి రెయిడ్స్ చేయడంతో పాటు, వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన మండిపడ్డారు.
తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. అమిత్ షా పని గట్టుకోని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సృజనా చౌదరి, సిఎం రమేశ్ లు టిడిపిలో ఉన్నప్పుడు కేసులు వేశారు. వారు బిజెపిలో చేరగానే క్లీన్ చీట్ ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని విహెచ్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఎపికి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కళ్యాణ్ తిరిగి బిజెపి వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు. ఇండియా కూటమిలో నితీశ్ కుమార్, శరత్ పవార్, మమతా, స్టాలిన్‌లు.. రాహుల్‌కు మద్దతుగా ఉన్నారన్నారు.