Saturday, November 2, 2024

రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల భర్తీ ఏది ?

- Advertisement -
- Advertisement -

ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే చిత్తుగా ఓడిస్తాం : ఆర్ కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల ప్రస్తావన లేకపోవపడం పట్ల జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీని విస్మరించే పార్టీలను చిత్తుగా ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలు ఉద్యోగ ఖాళీలు భర్తీ విషయంలో, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎలా చేస్తారో చెప్పడం లేదని అన్నారు. నిరుద్యోగ భృతి అంశం, స్వయం ఉపాధి పథకం ఎలా కల్పిస్తారో చెప్పడం లేదని అన్నారు.

రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు  ఉద్యోగ – ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి శక్తి – యుక్తులను సమాజం ఉపయోగించు కోవాల్సిన అవసరం ఉందని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, – మండలాలు, – మున్సిపాలిటీలు , మున్సిపల్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారని, కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాల్లో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయని, 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 డిఎస్‌ఫి ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలిస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయని కృష్ణయ్య తెలిపారు. అయినప్పటికీ కొత్త పోస్టులు సృష్టించడం లేదు. ఈ విషయంలో కూడా పార్టీలు స్పష్టత ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేల టీచర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా పోస్టుల భర్తీపై ఏ పార్టీ స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. గత 9 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు జారీ చేయలేదని, వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని తెలిపారు. మొత్తం ఖాళీలను లెక్కించి భర్తీ చేయాలని కోరారు. జూనియర్ లెక్చరర్‌లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌లు, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, దాదాపు 9 వేల వరకు ఖాళీగా ఉన్నాయన్నారు. . వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. కాలేజీలో లెక్చరర్లు లేక. పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ నీల వెంకటేష్, జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నందా గోపాల్, హేమంత్ కుమార్, శివ కృష్ణ ముదిరాజ్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News