Thursday, January 23, 2025

ఫీజుల నియంత్రణకు దారేది?

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య ఒకటిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే వీరి వ్యాపారం మొదలవుతుంది. అడ్మిషన్ల టైంలోనే పుస్తకాలు, యూని ఫాం, బ్యాగు, షూలను విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడీ తో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఒక్కొక్క స్కూల్లో బ్రాండ్‌ను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు నోటు బుక్స్, పాఠ్య పుస్తకాలను అమ్ముతుంటారు.

స్కూల్ యూనిఫామ్ దీనికి అదనం. సరే పుస్తకాలు బయట కొనుకుందామంటే అది కుదరదు. స్కూల్లోనే వాటిని కొనుగోలు చేయాలి. నర్సరీ చదువుతున్న చిన్నారుల పుస్తకాల కోసం సుమారు రూ. 5 వేలు చెల్లించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు బకాయి చెల్లించని యెడల వచ్చే విద్యా సంవత్సరం పుస్తకాలు ఇచ్చేది లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెండేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోక పోవడంతో వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్, కిడ్స్ ప్లే స్కూల్స్, ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా పెంచుతూ ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరానికి గాను కొన్ని పాఠశాలలో ఏకంగా 25% వరకు ఫీజులు పెంచాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40 – 50% వరకు భారం మోపుతున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలలు కొత్త రుసుముల వివరాలు తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశపడి తమకు తలకు మించిన భారమే అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే వివిధ రకాల ప్రత్యేకతలు చూపుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు మోత మోగిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా ఎల్‌కెజీ, యుకెజీ ఫీజులు ఇంజినీరింగ్, ఎంబిబిఎస్ విద్యార్థుల సెమిస్టర్ ఫీజులతో సమానంగా ఉంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఎల్‌కెజీ ఫీజులే సుమారు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలను కల్పిస్తున్నటువంటి యాజమాన్యాలు ఎల్‌కెజీ స్టూడెంట్‌కు రూ. లక్ష 30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం కనిష్ట ఫీజు పలు పాఠశాలలో ఒకటవ తరగతికి రూ. 30 వేల వరకు ఉంది. కొంచెం మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి, ప్రచారం చేసుకున్నటువంటి కొన్ని స్కూళ్లలో రూ. 45 వేల వరకు ఉంది.

ఇక వివిధ రకాల ఫీజుల పేరుతో జరుగుతున్నటువంటి అదనపు వసూళ్లు తల్లిదండ్రులకు భారంగానే మిగులుతున్నాయి. అదనంగా రూ. 5 వేల వరకు ఉంటున్నాయి. ఇదే కాక బస్సు ఫీజును విడిగా వసూలు చేస్తున్నారు. ప్రవేటు పాఠశాలలో సౌకర్యాలను బట్టి ఫీజులు ఉండాలనేది గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో ఉంది. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలు కలిపి 90 శాతంగా లెక్కవేసి మిగిలిన 10% పాఠశాల లాభంగా నిర్ణయించి దాన్ని బట్టే ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ లెక్కన చిన్న పాఠశాలకు ఎంత ఫీజు ఉండాలి. కార్పొరేట్ సంస్థలకు ఎంత ఫీజు ఉండాలనేది తెలుస్తుంది. ఆ ఫీజులు అమలు ఎలా ఉందనే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ పాఠశాలలను నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్కూళ్లను నడిపిస్తున్నటువంటి పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తూతూ మంత్రం గానే ఉన్నాయి.

సొంత గ్రౌండ్ కలిగినటువంటి పాఠశాలలు చాలా తక్కువ. కనీస ప్రమాణాలు విద్యా నిబంధనలు పాటించకుండా నడుస్తున్నాయి. అయితే కేవలం ఫలితాలను ప్రచారం చేసుకుంటున్నటువంటి పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను ఏడాదికి ఏడాది పెంచుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో మాత్రమే పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం పాఠశాలలు మారిస్తే పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మార్చకుండా ఒకే దగ్గర విద్యను అభ్యసించే విధంగా తోడ్పాటును అందిస్తున్నారు. పేరెంట్స్ నమ్మకాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతున్నది. ప్రతి పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో కలిపి ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇది ఎక్కడ కూడా ఏర్పాటైనటువంటి దాఖలాలు లేవు.

వాస్తవానికి కమిటీ సమావేశమై ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. అదే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్, డిగ్రీ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించుకొని వారితోనే విద్యను బోధిస్తున్నారు. ఇవి బయటకు తెలియకుండా ఒకరిద్దరూ అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులను, కేరళ టీచర్లను నియమించుకొని వారిచే బోధన చేస్తూ హంగామా చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సైతం వారి వయస్సుకు తగ్గట్టుగా పుస్తకాల బరువు ఉండడం లేదు. వయసుకు మించి పుస్తకాల బరువును మోస్తున్నారు. ఇంకా సాధారణ చదువులతో పాటు ఐఐటి ఫౌండేషన్ అంటూ మరికొంత ఫీజును, యోగ, సంగీతం, డ్రాయింగ్, డాన్స్ అని ఇతర వాటికి కూడా విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి వెనక్కి వెళ్లలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ -6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ -11 ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి.సెక్షన్- 12 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్- 12 ప్రకారం టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు. చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీల కు కేటాయించాలి.

ఇవే కాకుండా పాఠశాలల్లో మున్సిపాలిటీ పరిధిలో అయితే 1000 చదరపు మీటర్ల ఆట స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు దేన్నీ పాటించడం లేదు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు సభ్యులుగా ఉన్నటువంటి ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు చిన్న విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టినటువంటి బాధ్యత ఉంది. ఈ విధంగా చేసినట్లయితేనే అధిక ఫీజులను వసూలు చేయకుండా ఉంటుంది. ఫీజులను కొంతమేరకు నియంత్రించవచ్చు.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News