Thursday, January 23, 2025

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు…

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : ఈ ఏడాది మండే ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సామాన్యుడు కొనలేని స్థితిలో రేట్లు పెరిగాయి. టమాట ధర సెంచరీ దాటి రిటైల్ ధర రూ.120ల వరకు పలుకుతుంది. పచ్చిమిర్చి కూడా ఘాటుగానే ఉంది. రైతు బజార్‌లో కేజి అమాంతం రూ.200లు కావడంతో వినియోగదారులు బావురుమంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు భారీగా పెరిగిన ధరలు చూసి అవాక్కవుతున్నారు. ఎం కొనేటట్లు లేదు.. ఎం తినేటట్లు లేదంటూ వాపోతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు అంతగా ప్రభావం చూపని కూరగాయల ధరలు ఈ మాసాంతానికి చుక్కలు చూపిస్తున్నాయి.

కేవలం పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యధిక ధరలు ఉండడంతో పచ్చడి మెతుకులతో జీవితం గడపాల్సి వస్తుందని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం వేసవికాలం అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల సకాలంలో పంటలు వేయకపోవడం తద్వారా దిగుబడి తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని వ్యాపారులు చెపుతున్నారు. ఉత్తరాదిన అత్యధికంగా పండే టమాట, పచ్చిమిర్చి,కొత్తిమీర అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నదని, రవాణా వ్యవస్థ కూడా స్తంబించడంతో మార్కెట్‌లో ఉన్న నిల్వలకు ధర పెరిగిందని అంటున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు మదనపల్లిలో రైతులు టమాట సాగు ఎక్కువగా చేస్తుంటారు.

అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పచ్చని పొలాలు నివాస స్థలాలుగా మార్చడంతో దిగుబడి అమాంతం తగ్గిందని మార్కెట్ వర్గాల అంచనా. సామాన్యుడిని కంటతడి పెట్టిస్తున్న ఈ ధరలు జులై రెండవ వారంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం కావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు పట్టెడన్నం తినలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, దళారులు మాత్రం బాగుపడుతున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఈ అత్యధిక ధరల కారణంగా కేజి కూరగాయలు తీసుకోవాల్సిన చోట పావుకేజి, అరకేజికి పరిమితం అవుతున్నామని వినియోగదారులు అంటున్నారు.

మాంసాహార ధరలు కూడా ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేజి చికెన్ ధర రూ.320లకు పైగా చేరింది. మటన్ కొన్ని ప్రాం తాల్లో కేజి రూ.900 వరకు లభిస్తుంది. పాలకులు, అధికారులు వెంటనే దృష్టి సారించి పెరుగుతున్న ధరలను అరికట్టాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి డిమాండ్‌కు తగిన విధంగా సప్లై పెంచి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News