Sunday, January 19, 2025

చంద్రుడితో ఆటాడుకోవడం కుదరదు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : మనిషి భూగోళం దాటి ఇతర గ్రహాలపై కూడా ఉనికి చాటుకోవాలని, అక్కడ ఇప్పటి వరకూ వినియోగంలోకి రాకుండా ఉన్న అపార వనరులను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని దేశాలు పోటీపడి చంద్రుడిపైకి అంతరిక్ష నౌకలను పంపిస్తున్న దశలో చంద్రమండలంపై వనరుల సంగతి ఏమిటీ? అక్కడి సంపదపై హక్కులు ఎవరికి చెందుతాయి? ఎవరు చంద్రుడిపైకి వెళ్లి, తమ ఇలాఖాలను సృష్టించుకుంటే వారిదే చంద్రుడిపై అధికారమా? ఈ విధంగా ఆయా దేశాలే చంద్రుడిపై తమ సామ్రాజ్యాలు సృష్టించుకోవచ్చా? అనే పలు ప్రశ్నలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అయితే చంద్రుడు అందరివాడు. చంద్రుడిపై ఎవరికి ప్రత్యేకించి నిర్థిష్టమైన హక్కులు ఉండవు. ఈ క్రమంలో వనరులు కేవలం సార్వత్రికం అవుతాయని, ఏ దేశం ఐనా పరిశోధనలు నిర్వహిస్తే ఇవి మానవాళి ప్రయోజనాలకు వినియోగించుకోవడానికే అని హక్కుల జోలికి వెళ్లరాదని అంతర్జాతీయ చట్టాలు నిర్థిష్టంగా ఉన్నాయి. ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనల ధోరణి ఆరంభం కాగానే ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై ఓ నిర్థిష్టమైన ఒప్పందాన్ని ఔటర్ స్పేస్ ట్రీటి పేరిట తీసుకువచ్చింది. దీని మేరకు నిర్థిష్టంగా పలు నియమాలను రూపొందించారు.

ఈ ట్రీటి ప్రకారం చంద్రుడు లేదా ఏ ఇతర ఖగోళ సంబంధిత అంశంపై అయినా ఏ దేశానికి ప్రత్యేకంగా హక్కులు ఉండటానికి వీల్లేదని ప్రతిపాదించారు. ఖగోళ సంబంధిత ఆస్తులపై ఏ దేశమూ ఎటువంటి సార్వభౌమాధికారాన్ని చాటుకోవడానికి వీల్లేదని తెలిపారు. అయితే ఏదైనా ప్రాంతంపై ఏ దేశం అయినా తన ప్రాబల్యం చాటుకునేందుకు వీలుంటుందా? అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. చంద్రుడిపై మనిషి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న దశలో 1979లో మూన్ అగ్రిమెంట్ ఒకటి తీసుకువచ్చారు. దీని మేరకు ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వ సంస్థ అయినా , ఏ సంస్థ అయినా చంద్రుడిపై హక్కులు చాటుకోరాదు. వనరులు తమవని వాడుకోరాదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవడం, వీటి యాజమాన్యం తమదే అని ప్రకటించుకోవడానికి వీల్లేదు. చంద్రుడు , అక్కడి నిక్షిప్త ఆస్తులన్ని మానవాళి సొంతం. సహజవనరులు ఉమ్మడి సొత్తుగా ఉంటాయి. సంబంధిత ఒప్పందం 1984లో అమలులోకి వచ్చింది. అయితే చంద్రుడిపైకి ల్యాండర్లు పంపించి ఉన్న చైనా, అమెరికా, రష్యాలు ఈ ఒప్పందం విషయాన్ని పరిశీలించి తరువాత చెపుతామని తెలిపాయి.

కానీ ఇంతవరకూ దీనిపై ఎటువంటి వైఖరిని స్పష్టం చేయలేదు. ఇప్పటి చంద్రయాన్‌తో ఈ దేశాల సరసన భారతదేశం చేరుకుంది. చంద్రుడి వనరులపై సమగ్ర పరిశోధనలు, అన్వేషణలు జరుపుతామని భారతదేశం ప్రకటించింది. మరి వనరుల హక్కులపై భారత ప్రభుత్వం స్పందన ఏమిటనేది స్పష్టం కావాల్సి ఉంది. అయితే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి అమెరికా 2020లో ఆర్టెమిస్ ఒప్పందాన్ని తీసుకువచ్చింది. చందమామపై సమగ్రమైన సురక్షితమైన, మానవాళి సంక్షేమయుత ప్రయోగాలు నిర్వహించుకోవాలనేదే ఈ ఒప్పందం సారాంశం. దీనిపై కెనడా, జపాన్, యూరప్ దేశాలు ఇటీవలి కాలంలో ఇండియా కూడా సంతకాలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News