రోడ్డు పక్కన ఎవరైనా వడదెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడదెబ్బ తగిలినట్టు అనిపించినా, తక్షణం ప్రథమ చికిత్స అవసరం. వడదెబ్బకు పడిపోతే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. అంబులెన్స్ వచ్చేలోగా, బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశంలో లేదా చెట్టునీడలో ఉంచి ప్రథమ చికిత్స చేయాలి. బాధితుడి ఒంటిపై దళసరి వస్త్రాలు ఉంటే తీసివేయాలి. శరీరానికి గాలి తగిలేలా చూడాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చల్లని నీడిలో గుడ్డ తడిపి శరీరమంతా తుడవాలి. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు ఉంటే 101 నుంచి 102 డిగ్రీల ఫారన్‌హీట్‌కు తగ్గించాలి.
ఐస్‌ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఉంచాలి. ఈ శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. బాధితుడ్ని షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా ఫర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లో అయినా ముంచవచ్చు. ఆరోగ్యవంతులైనా, యువకులైనా తీవ్ర వ్యాయామం వల్ల వడదెబ్బకు గురైతే “ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్” అంటారు. వీరికి ఐస్‌బాత్ చేయించాలి. వృద్దులు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైతే ఐస్ లేదా మంచును అసలు ఉపయోగించరాదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంతవరకు సాధారణ నీటి తోనే వారి శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ప్రయత్నించాలి.