అప్పుల్లో చివరి నుంచి ఐదో స్థానంలో రాష్ట్రం
దళితబంధు ఓట్ల రాజకీయం కోసం తెచ్చిన పథకం కాదు
డిక్కీ ప్రతినిధుల సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దమ్మున్న పనిచేసి చరిత్రపై చెరగని సంతకం వేసిన వాడే నాయకుడే చరిత్రలో నిలిచిపోతారని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. కొందరు ఏ పదవిలో చేయకపోయినా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, మహాత్మాగాంధీ వంటి వాళ్లు పెద్ద పదవులు చేయకపోయినా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతే పథకమని వ్యాఖ్యానించారు. ఒకరికి లక్ష ఇస్తే లక్షం నెరవేరదు అని భావించి, దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని, ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ పథకం ఓట్ల రాజకీయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని స్పష్టం చేశారు. కొంతమందికి దళితబంధు వచ్చి ఎక్కువ మందికి రాకపోవడం వల్ల తమ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ పథకం తీసుకువచ్చామని తెలిపారు. దళిత కుటుంబాలకు ఆర్ధికంగా ఎదగాలి, శాశ్వతంగా వాళ్ళ కష్టాలు తీరాలనే ఉద్దేశంతో దళితబంధు పథకం కింద రూ.పది లక్షలు ఇస్తున్నామని చెప్పారు. దశల వారీగా అందరికీ దళితబంధు ఇస్తామని వెల్లడించారు.
ఒకేసారి అందరికీ ఇవ్వాలని తమకూ ఉంటుందని, కానీ పిండి కొద్దీ రొట్టె..నిధులు సమకూర్చుకొని ఇస్తున్నామని పేర్కొన్నారు. తాజ్ హోటల్‌లో మంగళవారం జరిగిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(డిక్కీ) సమావేశానికి మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలను, విజయగాధలను పంచుకున్నారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, కులవ్యవస్థ ఉండకూడదని కోరుకున్న వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా చేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద అందరూ వాహనాలు కొనాలని ఆసక్తి కనబరిచారని, అలా కాకుండా ఈ పథకం లబ్దిదారులతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన వ్యాపారాలు పెట్టించామని చెప్పారు. దళితులు వ్యాపార రంగంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకువెళ్లాలని సూచించారు. దళితులు వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. దళితబంధును వంద శాతం సక్సెస్ చేసి చూపిస్తే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
మనం చేసింది అప్పు కాదు.. అది పెట్టుబడి…
కెసిఆర్ అప్పులు చేస్తున్నాడు అని ప్రతిపక్షాలు అంటున్నాయని, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోనే అప్పులు చేయాల్సి ఉంటుందని, అంతకుమించి ఏ ప్రభుత్వమూ అప్పులు చేయాలని కెటిఆర్ వివరించారు. ఎఫ్‌ఆర్‌బిఎంలో 32 రాష్ట్రాల్లో తెలంగాణ చివరి నుంచి 5వ స్థానంలో ఉందని చెప్పారు. అప్పులు చేయటంలో తెలంగాణ రాష్ట్రంపైన 26 రాష్ట్రాలు ముందు ఉన్నాయని పేర్కొన్నారు. మనం చేసింది అప్పు కాదు..అది పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పులు తీసుకువచ్చి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్, మౌలిక వసతుల కల్పనపై వెచ్చించామని వివరించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు ఒకటవ స్థానానికి చేరిందని చెప్పారు. మంచి నీళ్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
12 ఇందిరమ్మ ఇళ్లతో సమానం…
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలకు రాలేదని కెటిఆర్ విమర్శించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బా లాంటి ఇండ్లు ఇచ్చారని, అందుకే ఆలస్యమైనా పేదలకు ఉచితంగా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్‌రూం కట్టి ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిన 12 ఇందిరమ్మ ఇళ్లకు సమానమని పేర్కొన్నారు. కొంతమందికే డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడం వల్ల రాజకీయంగా తమకు కూడా ఇబ్బందే అని, అయినా పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేది మా విధానం…
సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేది తమ విధానమని కెటిఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ రెండు కొనసాగాలంటే స్థిరమైన ప్రభుత్వం.. సమర్థ నాయకత్వం ఉండాలని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మంచి చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. మంచి చేస్తున్నప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని అన్నారు. తాము అధికారం చేపట్టి తొమ్మిదిన్నరేళ్లు అవుతుందని, అయితే అందులో రెండేళ్ల కరోనా కాలం తీసేస్తే తాము నికరంగా పాలన చేసింది ఆరున్నరేళ్లే అని పేర్కొన్నారు. ఈ ఆరున్నరేళ్లలో మేం చేసింది చూపిస్తున్నాం…మంచి చేశాం… మళ్ళీ గెలుస్తామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాదీలు ఓటింగ్‌కు తరలిరావాలి…
హైదరాబాద్ నగరంలో ఉండే విద్యావంతులే చాలా వరకు ఓటింగ్ దూరంగా ఉంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. గ్రామాలలో 80 శాతం ఓటింగ్ నమోదవుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం 60 శాతమే నమోదవుతుందని, అది కూడా ఎక్కువగా మురికివాడల ప్రజలే ఓట్లు వేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఉండే వాళ్లు ఎంత బిజీగా ఉన్నా ఒక గంట సమయం కేటాయించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈసారి హైదరాబాద్‌లో ఉండే విద్యావంతులు, ఉద్యోగులు, అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవాళ్లు ఓటింగ్‌కు తరలివచ్చి ఓటింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు.