Friday, November 22, 2024

రాహుల్ కులమేమిటని అడిగితే తప్పేమిటి?: కేంద్ర మంత్రి కిరేణ్ రిజిజు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నీ కులమేమిటని అడగడంలో తప్పేమీ లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరేణ్ రిజిజు అన్నారు. రాముల్ గాంధీ కూడా అదే పని చేస్తూ దేశాన్ని కులాల వారీగా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నాడిక్కడ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభలో మంగళవారం బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ తమ కులమేమిటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. నిరంతరం ప్రజల కులాల గురించి మాట్లాడేది కాంగ్రెస్ నాయకులేనని ఆయన విమర్శించారు. ప్రజలను వారి కులం గురించి అడగడం ద్వారా దేశౠన్ని చీల్చడానికి కాంగ్రెస్ కుట్రపన్నిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కులం గురించి ఎవరైనా మాట్లాడితే ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు నిరంతరం ప్రజలను వారి కులాల గురించి ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు.

విలేకరులకు కలుసుకున్నపుడు ఆయన(రాహుల్) మీ కులమేమిటని అడుగుతారని, సాయుధ దళాల సిబ్బందిని కలిసినపుడు వారి కులమేమిటని అడుగుతారని, భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజలను మీ కులమేమిటని అడుగుతారని రిజిజు ఎద్దేవా చేశారు. ప్రజల కులం గురించి వారు అడగవచ్చు కాని రాహుల్ కులం గురించి ఎవరు మాట్లాడకూడదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్‌ను సమర్థిస్తున్నారని, వారేమైనా పార్లమెంట్‌కు, దేశానికి అతీతులా అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. హింసను వీధుల నుంచి పార్లమెంట్‌కు విస్తరించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలను చీల్చడానికి కాంగ్రెస్ చేసే ప్రయత్నాలను బిజెపి సాగనివ్వబోదని ఆయన చెప్పారు. విలేకరుల ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ప్రధాని మోడీ ఓబిసి కులానికి చెందిన వారని, ఆయన అన్ని కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రిజిజు చెప్పారు.

ప్రతిపక్షాలు మొదటి నుంచి ఓబిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిల రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ ఓబిసిల కోసం పనిచేస్తే మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఆ కులాలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆయన చెప్పారు. మరో కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మాట్లాడుతూ కుల గణన కోసం ప్రతిపక్షాలు డిమాండు చేస్తుండగా రాహుల్ గాంధీ కులం గురించి అడిగితే తప్పేముందని ప్రశ్నించారు. 70 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు కుల గణన ఎందుకు జరపలేదని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News