మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో వాట్సాప్ సంభాషణ, సందేశాలే కీలకమని విచారణలో తేలింది. ఈక్రమంలో విధ్వంసం జరిగిన రోజు నిందితుల మద్య జరిగిన వాట్సల్ కాల్స్, సందేశాలను గుర్తించిన విచారణాధికారులు వీటిని ఫొరెన్సిక్ విశ్లేషణ పంపించారు. ఘటన జరిగిన రోజు ఆందోళనకారులు వాడిన ఇనుప రాడ్ల వంటి ఆయుధాలను కూడా పరీక్షల కోసం పంపారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు. విధ్వంసం కేసులో సిట్, జిఆర్‌పి పోలీసులతో పాటు ఆర్‌పిఎఫ్ సైతం విచారణ సాగిస్తోంది. కాగా రైల్వే స్టేషన్‌లో విధ్వసం జరిగిన రోజు పలు వాట్సాప్ గ్రూపులలో ఏకమైన నిరుద్యోగ యువకులు విధ్వంసానికి ప్రణాళిక వేసుకున్నారని, ఎన్ని గంటలకు ఎక్కడ కలవాలి, ఏమి చేయాలన్నది ముందే నిర్ణయించుకున్నారని విచారణలో తేలింది, వీరిని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సైతం రెచ్చగొట్టారని, ఇదంతా వాట్సాప్ వేదికగా సాగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఈ కేసులో వాట్సాప్ చాటింగ్‌లే కీలకంగా మారాయి.
అభియోగాలను నిర్ధారించాలంటే ఈ సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయి, వాటి సారాంశమేమిటన్నది సాంకేతికంగా తేల్చాల్సి ఉందని విచారణాధికారులు వివరిస్తున్నారు. ఈక్రమంలో ఈ కేసులోని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫొరెన్సిక్ విశ్లేషణకు పంపించామని, నిందితులు అరెస్ట్ కాక ముందే చాలా మెసేజ్లను డిలీట్ చేశారని వివరించారు. నిందితులు డెలీట్ చేసిన సందేశాలను తిరిగి పునరుద్ధరించాల్సి ఉంటుందని, తొలుత ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్‌కు మెసేజ్ వెళ్లిందన్న అంశాలపై దర్యాప్తు సాగుతోందని తెలిపారు. కాగా ఈ కేసులోని నిందితులకు ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
జూన్ 17న జరిగిన ఈ ఘటనలో రైల్వేశాఖకు సుమారు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 13మంది నిందితులు బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావుతోపాటు మరో 28మంది విడుదలయ్యారు. అభ్యర్థులు విడుదలవుతున్నందున వారి వారి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున జైలువద్దకు చేరుకున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక మాత్రమే పెండింగ్‌లో ఉందని, అది అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేస్తామని రైల్వే పోలీసు అధికారులు వెల్లడించారు.