Thursday, January 23, 2025

గోధుమ కనీస మద్దతు ధర రూ 150 పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గోధుమల కనీస మద్దతుధర (ఎంఎస్‌పి)ని క్వింటాలుకు రూ 150 చొప్పున పెంచింది. పెంచిన ధరలతో ఇప్పుడు గోధుమల కనీస మద్దతు ధర 202425 పంట విక్రయ కాలానికి క్వింటాలుకు రూ 2275 అవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో కనీస మద్దతు ధర పెంపుదల నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ఒకటి రెండు రాష్ట్రాలలో గోధుమ పంట ఎక్కువగా పండిస్తారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి చూస్తే ఇప్పుడు పెంచిన మద్ధతు ధరనే అత్యధిక స్థాయిలో ఉంది. గోధుమలతో పాటు ఇతర ఆరు రబీ పంటలు బార్లీ, మసూరు, శెనగ , కందులు, ఆవాలు, పొద్దుతిరుగుడు పంటలకు కనీస మద్దతు ధరలు పెంచారు.

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. దేశంలో గోధుమ ప్రధాన రబీ పంటగా ఉంది. ఇప్పుడు గోధుమల మద్దతు ధర క్వింటాలుకు రూ 2125గా ఉంది. వ్యవసాయ వ్యయం , ధరల కమిషన్ (సిఎసిపి) సిఫార్సుల మేరకు రబీ పంటల ధరలను పెంచినట్లు మంత్రి వివరించారు. ఇప్పుడు పెంచిన ధరలతో గోధుమల మద్దతు ధర రూ 2275 అవుతుంది. బార్లీకి రూ 115 పెంచడంతో ఇప్పుడు మద్దతు ధర రూ 1850 అవుతుంది. కాగా శెనగపై రూ 105 పెంచడంతో వీటి మద్దతు ధర క్వింటాలుకు రూ 5440, కందులపై రూ 425 పెంచి ఇప్పుడు క్వింటాలుకు రూ 6425 చేశారు. ఆవాలుపై రూ 200 పెంచడం ద్వారా వీటి మద్దతు ధర ఇక రూ 5650, సన్‌ఫ్లవర్‌పై రూ 150 పెంచి ఇప్పుడు రూ 5800గా కనీస మద్దతు ధరను ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో గోధుమ పంట విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వంటనూనెలు, పప్పుధాన్యాలు, గోధుమల దిగుబడికి మరింత ప్రోత్సహం అందించేందుకు మద్దతుధరలను పెంచినట్లు మంత్రి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News