పారిస్ : భారతదేశం నుంచి సరఫరా నిలిపివేతతో ఫ్రాన్స్‌లో గోధుమల ధరలు సోమవారం అత్యధిక స్థాయికి చేరాయి. గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించింది. దీనితో పలు దేశాలలో గోధుమల కొరత ఏర్పడుతోంది. సోమవారం యూరోపియన్ మార్కెట్ లావాదేవీలు ఆరంభం కాగానే గోధుమల ధరలు టన్నుకు 435 యూరోలు అంటే 453 డాలర్లకు చేరాయి. ఇటీవలి కాలంలో ఫ్రాన్స్‌లో ఇది అతి ఎక్కువ గోధుమ ధరగా నిలిచింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నాటి నుంచే అంతర్జాతీయంగా గోధుమల ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. ఈ దశలోనే దేశంలో ధరల నియంత్రణకు భారతదేశం గోధుమల ఎగుమతులను నిలిపివేసింది. దీనితో గోధుమలు ప్రధాన ఆహారంగా తీసుకునే యూరప్ దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. అదే విధంగా గోధుమపిండిపై ఆధారపడి ఉండే బ్రెడ్స్ తయారీ కంపెనీలు కూడా విలవిలలాడుతున్నాయి. నాణ్యమైన గోధుమల రకాలతోనే బ్రెడ్‌లు తయారు చేస్తారు.
ఈ క్రమంలో కొన్ని దేశాల క్వాలిటి గోధుమలపైనే అంతర్జాతీయ స్థాయి బ్రెడ్ బ్రాండ్ కంపెనీలు ఆధారపడుతున్నాయి. కానీ ఆయా దేశాల నుంచి ప్రత్యేకించి భారతదేశం నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో కంపెనీలపై కూడా ప్రభావం పడుతోంది. పేదదేశాలలో గోధుమ ఆహారాలకు కొరత ఏర్పడింది. ప్రపంచంలోనే గోధుమ ఉత్పత్తిలో ఇండియా రెండో అతి పెద్ద దేశంగా ఉంది. అయితే ఈసారి మార్చిలో తీవ్రస్థాయి వేసవి, అంతకు ముందటి భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగినందున స్వదేశీ కోటా ధరలపై నియంత్రణకు గోధుమల సరఫరాను కేంద్రం నిలిపివేసింది.