దాదాపు 14ఏళ్ల కిందటి (2008 జూలై) అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు శుక్రవారం నాడు విధించిన శిక్షల్లో కొట్టవచ్చినట్టు కనిపించిన విశేషం ఒకేసారి 38మందికి ఉరిశిక్ష పడడం. గతంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో మాత్రమే అతి ఎక్కువ మందికి ఒకేసారి ఉరిశిక్షలు పడ్డాయి. అప్పట్లో 26మందికి మరణశిక్ష విధించారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 11మందికి మరణించే వరకు యావజ్జీవ శిక్షను కూడా వేశారు. 28మందిని విడుదల చేశారు. 2008 జూలై 26వ తేదీన సంభవించిన 21వరుస బాంబు పేలుళ్లు అహ్మదాబాద్‌ను దద్దరిల్ల చేశాయి. ఆ పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200మంది గాయపడ్డారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఇండియన్ ముజాహిదీన్ సభ్యులను అహ్మదాబాద్ పేలుళ్లకు బాధ్యులను చేసి ఈ కేసు పెట్టారు. 2002నాటి గుజరాత్ అల్లర్ల ఘటనలకు ప్రతిగా అహ్మదాబాద్ పేలుళ్లు సంభవించాయి. 2002 ఫిబ్రవరి 7న గోద్రాలో సంభవించిన రైలు బోగీ దహనంలో 58మంది కరసేవకులు దుర్మరణం పాలయ్యారు. 2500మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు ముస్లింలు కాగా హిందువులు కూడా వున్నారు. ఈ అల్లర్లలో వినడానికి భీతిగొలిపే అమానుష ఘటనలు కూడా సంభవించినట్టు వార్తలు వచ్చాయి. అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా టెర్రరిజం ప్రబలడం తెలిసిందే. 2001సెప్టెంబర్ 11న జంట ప్రాసాదాలపై అక్కడ జరిగిన అతి భయంకరమైన టెర్రరిస్టు దాడుల్లో దాదాపు 3000మంది మరణించారు. అప్పటికి, ఇప్పటికి అంత దుస్సాహసం, చాకచక్యంతో జరిగిన టెర్రరిస్టు దాడి మరొకటి లేదనవచ్చు. భారతదేశంలో హిందూ ముస్లిం వైషమ్యాలు 1992, డిసెంబర్ నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత విపరీత స్థాయికి చేరి తీవ్రమైన టెర్రరిస్టుల దాడులకు దారితీశాయి. దేశంలో టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్‌తో మనకున్న విభేదాలు కూడా కారణం. కశ్మీర్‌లో నిత్య అనిశ్చితి సృష్టించడానికి సరిహద్దులకు అవతలి నుంచి టెర్రరిస్టులను మంత్రించి పాకిస్తాన్ పంపిస్తున్నది. అలాగే ఒకవైపు వామపక్ష ఉగ్రవాదం, మరోవైపు ఈశాన్యంలో తిరుగుబాట్లు చెప్పనలవికానంత తీవ్రమైన దాడులకు కారణమవుతున్నాయి. ఈ దాడుల్లో అత్యధిక సంఖ్యలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఎన్‌కౌంటర్ ఘటనల్లో పోలీసులు, భద్రతా దళాల కాల్పుల్లో చాలామంది ఉగ్రవాదులు చనిపోతున్నారు. ఆర్థికవ్యవస్థ మీద కూడా ఇవి తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మొత్తం మీద ప్రపంచ, భారత పురోభివృద్ధిని టెర్రరిస్టు దాడులు అడ్డుకుంటున్నాయి. పేదరికం తీవ్రం కావడానికి కారణమవుతున్నాయి. సిరియా, యెమెన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో నిరంతర మారణహోమం జరిగిపోతున్నది. శ్రీలంకను చిరకాలం రక్తసిక్తం చేసి మన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని బలి తీసుకున్న తమిళఈలం ఉగ్రవాదం గురించి తెలిసిందే. సాంకేతికంగా, వైజ్ఞానికంగా పురోగతి సాధించి నిరంకుశ రాచరిక పాలనల నుంచి దూరమై ప్రజాస్వామిక రీతులను అలవరచుకుంటున్నామన్న సంతోషాన్ని గాని, లింగపరమైన అసమానతను తొలగించుకొని స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించుకుంటున్నామన్న సంతృప్తిని గానీ, రంగు తేడాల వివక్షను, వైషమ్యాన్ని నెమ్మది నెమ్మదిగానైనా వదిలించుకుంటున్నామన్న ఆనందాన్ని గానీ మిగల్చకుండా వేలాది మంది అమాయక ప్రాణాలను బలి తీసుకుంటూ కష్టపడి నిర్మించుకున్న సంపదలను ధ్వంసం చేస్తూ టెర్రరిజం రోజురోజుకి మరింతగా కోరలు చాచడం మానవాళికి అత్యంత అవమానకరం. ఆఫ్ఘానిస్తాన్ పరిణామం ఉగ్రవాద శక్తుల ముందు, ప్రజాస్వామ్య వ్యతిరేక ఆరాచక మూకల ముందు మానవత్వం లొంగిపోయి మోకరిల్లిన అత్యంత విషాద అధ్యయంగా ఆధునిక ప్రపంచ చరిత్రలో నమోదైంది. అక్కడ స్త్రీల హక్కులపై తిరిగి సాగుతున్న దమనకాండ అత్యంత బాధాకరమైనది. అమెరికా ఏకైక ప్రపంచ ఆధిపత్య శక్తిగా టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్నదే గానీ వాస్తవానికి దానిని అంతమొందించలేకపోతున్నది. వాస్తవానికి ఉగ్రవాదులు పుట్టుకతోనే ఆ లక్షణాలను పుణికిపుచ్చుకోరు. ఆయా సమాజాల్లో ఉన్న అసమానత్వం దోపిడీ పీడనల నుంచి అనివార్యంగా పుట్టేదే ఉగ్రవాదం అనే దానిని ఎవరూ కాదనలేరు. ప్రతి టెర్రరిస్టు విజృంభణ వెనుక పాలకశక్తుల మితిమించిన అణచివేత ఉండి తీరుతుంది. అమెరికా గానీ ఇతర పాలక సామ్రాజ్యాలు గానీ ఈ వాస్తవాన్ని గుర్తించకుండా బలప్రయోగంతో టెర్రరిజాన్ని అణచివేస్తామని చేసే ప్రకటనలన్నీ ప్రగల్బాలు గానే రుజువవుతాయని ఇంతవరకు సాగిన టెర్రరిస్టు దాడుల చరిత్ర రుజువు చేస్తున్నది. అందుచేత ప్రపంచ ఆధిపత్య శక్తులు తమ రక్షణలో కొనసాగుతున్న అసమాన పంపిణీని మానవ హక్కుల అణచివేతను అంతమొందించడానికి కృషిచేయాలి. అందుకు చిత్తశుద్ధితో సంకల్పించుకోవాలి. లేనిపక్షంలో టెర్రరిజం మరిన్ని వెర్రితలలు వేసి మానవాళికి మరింత ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది.
టెర్రరిజం అంతమెప్పుడు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -