Wednesday, January 22, 2025

మెగా టెక్స్‌టైల్ పార్కుకు మోక్షమెప్పుడు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేటాయిస్తామని ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై అప్పుడే రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలనే ఆయన తుంగలో తొక్కారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిలబెట్టుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇచ్చిన హామీలు, విభజన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఎంపీలు నిరంతరం కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.

ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం ముం దుకు వచ్చి రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలనుగా నీ, విభజన సమస్యలనుగానీ పరిష్కరించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఫలితంగా రెండు రాష్ట్రాలు విభజన సమస్యలతో అల్లాడిపోతున్నాయి. పైగా రాష్ట్రాలపై పెత్తనం కొనసాగిస్తూ…తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం అనేక ఇబ్బందులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధలన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో విజయసంకల్ప్ పేరుతో బిజెపి ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడు తూ మెగా టెక్స్‌టైల్స్ పార్కును కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మోడీ ఏ మేరకు కట్టుబడి ఉంటారన్నదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

కొన్నాళ్లుగా రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతుల్లో భారత్ వాటా గణనీయంగా తగ్గుతోంది. దేశాలైన బంగ్లాదేశ్, వియత్నాం వంటివి టెక్స్‌టైల్స్ రం గంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా కొనసాగుతున్నాయి. ఫలితంగా 2010 సంవత్సరం నుంచి 2021 వరకు దేశ ఎగుమతులు 6శాతం నుంచి 4.2శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచస్థాయిలో టెక్స్‌టైల్స్ పరిశ్రమను పోటీగా మార్చాలన్న లక్షంతో మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పిఎం మిత్ర’ (ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద మొత్తం రూ.4,445 కోట్లతో ఏడు మెగా టెక్స్‌టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మొత్తాన్ని రానున్న ఐదేళ్లు ( 20272028) వరకు వెచ్చించాలని తలపెట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఉండగా రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్స్ ఏర్పాటు కోసం కొంత కాలంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప థకం కింద రాష్ట్రానికి మెగా టెక్స్‌టైల్స్ పార్కును మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ పథకం కింద ప్రతి గ్రీన్‌ఫీల్డ్ మిత్ర పార్కుకు కేంద్రం మొత్తంగా రూ. 500 కోట్లు …బ్రౌన్‌ఫీల్డ్ పార్కుకు రూ. 200 కోట్ల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక ప్రతి పార్కులో టెక్స్‌టైల్స్ తయారీ యూనిట్ల ప్రారంభ స్థాపనకు పోటీతత్వ ప్రోత్సాహక మద్దతుగా అదనంగా రూ.300 కోట్లు అందిస్తుంది.

వాస్తవానికి వరంగల్ జిల్లా శాయంపేట- చింతలపల్లి వద్ద కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కెఎంటిపి)ను అభివృద్ధి చేసింది. దక్షిణ కొరియా వస్త్ర దిగ్గజం యంగ్‌వన్, కేరళకు చెందిన కిటెక్స్, దేశంలో పేరెన్నికగన్న వస్త్ర కంపెనీ గణేశా ఇకోసిఫెర్ తదితర 16 కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకొన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కెఎంటిపికి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పిఎం మిత్ర పథకం రాకముందే అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కాని కేంద్రం ఇప్పటి వరకు ఒక్క పైసా విదిల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లతో మౌలిక వసతులను కల్పించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా దీన్ని తీర్చిదిద్దేందుకు ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పించడానికి రూ.897 కోట్లు అవసరమని భావించి కేంద్ర సాయాన్ని కోరింది.

అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి నిధుల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపింది. గతంలో పంపించిన ప్రతిపాదనలు పిఎం మిత్ర పథకంలో చేర్చాలని కేంద్రానికి సూచించింది. అందువల్ల మెగా పార్కు నిర్మాణం కోసం వెంటనే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ చేసిన ప్రకటనతో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు మహర్ధశకు పడుతుందన్న ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే మిత్ర నిబంధనల్లోనూ కేంద్రం ఆంక్షలు పెట్టింది.

తగ్గనున్న రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత

పిఎం మిత్ర పథకంలో కేంద్రం పొందుపరిచిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను పూర్తిగా తగ్గనుంది. అలాగే టెక్స్‌టైల్ పార్కుల్లో కేంద్రానికి 49 శాతం వాటాను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలకు అశనిపాతంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేస్తే, కేంద్రం దానికి ఎంతోకొంత సహాయం చేయటం గత ప్రభుత్వాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. తాజాగా మోడీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలో పిఎం మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆ సంప్రదాయానికి మంగళం పాడింది. టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు, నిర్వహణలో రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోంది. టెక్స్‌టైల్ పార్కుల అభివృద్ధిలో 49 శాతం వాటా తమది ఉంటుందని, తాము రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే పార్కులను అభివృద్ధి చేయాలని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.

దేశంలో వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయటానికి గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం మిత్ర పథకాన్ని ప్రారంభించగా, ఈ సంవత్సరం జనవరి నెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. మెరుగైన నిర్వహణ, వ్యాల్యూ చెయిన్ ఏర్పాటు చేయడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ పథకం లక్ష్యాలు. ఇందులో భాగంగా భారీ, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన మొత్తం వ్యాల్యూ చెయిన్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్, టెక్స్‌టైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రింటింగ్ వంటి దశల్లో పరిశ్రమకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. అయితే మిత్ర పథకంలో రాష్ట్రాలు చేరాలంటే కేంద్ర విధించే ప్రతి షరతుకు అంగీకరించాల్సి ఉంటుంది. 49 శాతం వాటా తీసుకోవటం ద్వారా పార్కు నిర్వహణను కేంద్రం నియంత్రించే అవకాశం ఉంటుంది. అలాగే మిత్ర పథకంలో ఏర్పాటు చేసే టైక్స్‌టైల్ పార్కులో పెట్టుబుడులు పెట్టించేందుకు రాష్ట్రాలే సదరు కంపెనీలను ఒప్పించాల్సి ఉంటుంది.

అనేక మెలికలు.. పలు రకాల ఆంక్షలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త మెలికతో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాలేదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం టెక్స్‌టైల్ పార్కుల్లో కేంద్రానికి 49 శాతం వాటా ఇస్తేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కనీసం వెయ్యి ఎకరాలు క్లియర్ టైటిల్ స్థలం ఉండాలన్న నిబంధనలను తీసుకొచ్చింది. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేసి సదరు స్థలాన్ని దానికి బదలాయించాల్సి ఉంటుంది. దీంతో చట్టబద్ధమైన ఎస్‌పివిలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వం, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. ఇక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పి), రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌క్యూ)తదితర పద్ధతుల ద్వారా అర్హులను ఎంపికచేసి భూకేటాయింపు జరిపి అదే పద్ధతిలో రాయితీలు కల్పించాల్సి ఉంటుంది. కాగా రెండు దశల వడపోత ద్వారా పిఎం మిత్ర పార్కుల ఎంపిక జరుగుతుంది.

మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం పార్కు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు ఎస్‌పివి ఆమోదం తప్పనిసరి. ఇక రెండో దశలో మాస్టర్‌ప్లాన్ అమలు కోసం డెవలప్‌మెంట్ క్యాపిటల్ సపోర్ట్ (డిసిఎస్) కింద కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఎస్‌పివికి నిధులు సమకూర్చుతుంది. డిసిఎస్ కింద మొదటి దశలో గ్రీన్‌ఫీల్డ్ పార్కులకు రూ.300 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.100 కోట్లు మంజూరు చేస్తారు. రెండో దశలో గ్రీన్‌ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.100 కోట్లు ఇస్తారు. అయితే మొదటి దశలో పనులన్నీ అనుకున్న విధంగా పూర్తయితేనే రెండో దశలో నిధులిస్తారు. ఇన్ని మెలికలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి టెక్స్‌టైల్స్ పార్కు కావాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతోంది. మరి మోడీ తాను చేసిన ప్రకటనకు కట్టుబడి వెంటనే రాష్ట్రానికి మెగా పార్కును మంజూరు చేస్తారా? లేదా? ఎప్పటి మాదిరిగానే హామీని పక్కనపెడతారా? అన్నది ప్రస్తుతానికి వేచి చూడాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News