Wednesday, January 22, 2025

మీ ప్రభుత్వ స్కూళ్లు చూసేందుకు ఎప్పుడు రమ్మంటారు ?

- Advertisement -
- Advertisement -

When should I come to see your govt schools

అసోం సిఎం హిమంత బిస్వశర్మను ప్రశ్నించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ప్రభుత్వ స్కూళ్ల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ మధ్య మూడు రోజులుగా ట్విటర్‌లో వాగ్యుద్ధం కొనసాగుతోంది. అసోంలో ప్రభుత్వ పాఠశాలలను చూసేందుకు తనను ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్ శనివారం సీఎం శర్మను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అసోంలో కొన్ని స్కూళ్లు మూతపడినట్టు వచ్చిన ఓ వార్తా కథనం కూడా జతచేసి ట్విటర్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదని, దేశ వ్యాప్తంగా మరిన్ని స్కూళ్లు తెరవాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ బుధవారం ట్వీట్ చేశారు. దీనికి హిమంత్ బిశ్వశర్మ వరుస ట్వీట్లతో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఢిల్లీకి, అసోంకి చాలా తేడాలున్నాయని, ఈ విషయంలో మీకు సరైన పరిజ్ఞానం లేకపోవడం బాధాకరమని హిమంత్ బిశ్వశర్మ సమాధానంలో వ్యాఖ్యానించారు. “ఢిల్లీ కంటే అసోం 50 రెట్లు పెద్దది. మాకున్న 44.521 స్కూళ్లలో 65 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మీకు (ఢిల్లీ) 1000 కు పైగా స్కూళ్లున్నాయి. మాకు అంకిత భావం కలిగిన 2 లక్షలకు పైగా టీచర్లు, 1.18 లక్షల మిడ్‌డే మీల్ వర్కర్లు ఉన్నారు ”అని శర్మ ఓ ట్వీట్‌లో తెలిపారు.

మరో ట్వీట్‌లో “ అసోంలో మీరు ఉన్నప్పుడు మా స్కూళ్లు చూడాలనుకుంటే మా మెడికల్ కాలేజీలకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీ (ఢిల్లీ) మొహల్లా క్లినిక్‌ల కంటే 1000 రెట్టు బెటర్‌గా ఉంటాయి. ప్రతిభావంతులైన మా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు , విద్యార్థులను కూడా మీరు కలుసుకోవచ్చు. ఇండియాను నెంబర్ 1 చేసే ఆలోచన విడిచిపెట్టండి. ఆ పని మోడీ చేస్తున్నారు. ” అని శర్మ అన్నారు. ఏదైనా వ్యాఖ్యానించేటప్పుడు హోం వర్క్ చేయాలని కూడా కేజ్రీవాల్‌కు చురకలు అంటించారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అసోం ప్రభుత్వం 8,610 కు పైగా కొత్త పాఠశాలలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం గత ఏడేళ్లలో ఎన్ని పాఠశాలలు తెరిచిందని ఎదురు ప్రశ్నించారు.

కేజ్రీవాల్ ప్రతిస్పందన …

హిమంత్ బిస్వా శర్మ శుక్రవారం చేసిన ట్వీట్‌కు కేజ్రీవాల్ స్పందించారు. ‘ నా మాటలను మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. మీ తప్పులను ఎత్తి చూపడం నా ఉద్దేశం కాదు. మనమంతా ఒకే దేశ వాసులం. ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలి. అప్పుడే మన దేశం నెంబర్ వన్ అవుతుంది. నాకు అసోంలో పర్యటించాలని ఉంది. విద్యారంగంలో మీరు చేసిన కృషి నాకు చూపించండి. మీరు ఢిల్లీ రండి. ఢిల్లీలో మేము చేసిన కృషి చూపిస్తాం. ” అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు కొనసాగింపుగా శనివారం నాడు కూడా కేజ్రీవాల్ ట్విటర్‌లో మాటల యుద్ధం కొనసాగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News