Saturday, December 21, 2024

పేదల సొంతింటి కల నెరవేరిన వేళ

- Advertisement -
- Advertisement -
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
  • మోర్తాడ్‌లో అట్టహాసంగా బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ

మోర్తాడ్: డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్దిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. లబ్ద్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన డబుల్ బెడ్ రూం ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకే సముదాయంలో అన్ని వసతులతో మొత్తం 224 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించగా, తొలి విడతగా 155 మంది లబ్ద్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యత, ఇతర సదుపాయలను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ద్ధిదారుల కోరిక మేరకు సముదాయానికి కెసిఆర్ కాలనీగా నాయకరణం చేశారు.

ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్తులు మంత్రికి డప్పు వాయిద్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. సముదాయ ప్రాంగణం నుండి సభా వేదిక వరకు దారి పొడుగునా పూల వర్షంతో మంత్రికి స్వాగతం పలికిన లబ్దిదారులు వారి కుటుంబీకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రికి రుణపడి ఉంటామని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డబుల్ లబ్ద్ధిదారుల ఎంపిక ఎంతో నిఖార్సుగా జరిగిందన్నారు.

మోర్తాడ్‌లో డబుల్ నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు మంజూరు చేయించానని, అందులో 13.5 కోట్లు ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించామని, మిగతా నిధులతో రోడ్ల నిర్మాణాలు జరిపించామని వివరించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన వారికి ఎంపిక చేసేలా అధికారులకు పూర్తి స్వేచ్చా కల్పించామని, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సైతం జోక్యం చేసుకోకుండా లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు పూర్తి సహకారం అందించారని మంత్రి వారిని అభినందించారు.

ప్రస్తుతం 155 కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేశామని, మిగితా 69 ఇళ్లను రెండవ విడతలో అర్హులకు త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. అంతేగాకుండా సొంత జాగా కలిగి ఉన్న మరో 12 మందికి గృహలక్ష్మి పథకం కింద మంజూరి తెలిపామని వివరించారు. అదనంగా మరో 20 మందికి ఇళ్లను అందిస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఇల్లు రాని వారు నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇళ్లను పంపిణీ చేస్తామని భరోసా కల్పించారు.

ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితును ఇతరులకు అమ్ముకోవద్దని, పిల్లల భవిష్యత్తు కోసం సొంత ఇంటి అవసరాల కోసం తమ పేరిట అట్టి పెట్టుకోవాలని మంత్రి లబ్దిదారులకు హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపిపి శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్‌కుమార్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రాజేశ్వర్ రెడ్డి, డిఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News