ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న పి.ఎఫ్.ఆర్.డి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇటీవల ఆమోదించిన యుపిఎస్ విధానాన్ని అమలు చేసుకోవాలని లేఖలు రాయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో చర్చనీయాంశమైంది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మసిపూసి మారేడుకాయ చేయడంలో కేంద్ర ఆర్థికశాఖను మించినవారు లేరు. ఇందుకు మరో తాజా ఉదాహరణ టివి సోమనాథం కమిటీ సిఫారసు చేసిన యూనిఫైడ్ పెన్షన్స్‌కి ఇది చూడడానికి గొప్పగా కనిపిస్తున్నా కరి మింగిన వెలగపండు చందమే అన్న రీతిలో ఉంది. ఇది కేవలం 2024 అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరిగిన ఎన్నికల కోసం వచ్చిన పెన్షన్ పథకం.
గత ఏప్రిల్, మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఉద్యోగుల సెగ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా పాత పెన్షన్ పథకాన్ని ఒపిఎస్‌ను పునరుద్ధరణకు కాంగ్రెస్ ఎంచుకుంది. అదే విధంగా బిజెపి సిపిఎస్ స్థానంలో యుపిఎస్‌ను హడావిడిగా ఆమోదించింది. పాత పెన్షన్ పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై 20 ఏళ్లుగా చేస్తున్న నిరంతరాయ ఆందోళన ఫలిస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24న ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ విధానం తీవ్ర నిరాశపరిచింది. కేంద్ర ప్రభుత్వం 2023 మార్చిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో మార్పులు సూచించడానికి ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ కమిటీని నియమించింది.
ఏడాది తర్వాత దీని సిఫారసుల మేరకు యూనిఫైడ్ పెన్షన్స్‌కి 2024 ఆగస్టు 24న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగి కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఒపిఎస్‌లో 20 ఏళ్ల సర్వీస్ ఉంటే పూర్తి పెన్షన్ వచ్చేది యుపిఎస్‌లో దాన్ని పాతికేండ్లు చేశారు. దీనివల్ల వెనుకబడిన, ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు రిటైర్మెంట్ తరువాత బి.పి.ఎల్ కుటుంబాలుగా మారే అవకాశం ఉంది. అన్ని ఇస్తామంటూనే ఉద్యోగి నుండి వాటాను అడుగుతున్నది ఈ యుపిఎస్ విధానం. ప్రపంచ బ్యాంకు ఒత్తిడితోనే పెన్షన్ సంస్కరణలు, దాని ఆదేశాల మేరకు ఉద్యోగుల నుండి కచ్చితంగా కాంట్రిబ్యూషన్ వసూలు చేయాలి. దేశవిదేశీ పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వ్యక్తులకు అనాయాస పెట్టుబడి సమకూర్చాలి అన్న లక్ష్యంగానే ఈ సిపిఎస్ యుపిఎస్ పెన్షన్ విధానాలు ఉన్నాయి.
ఆమోదయోగ్యం కాని ఏకీకృత పెన్షన్ పథకం: ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసానిచ్చే పథకంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీంను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్ణించారు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పిఎస్) అత్యంత లోపభూయిష్టం, నిష్ప్రయోజనకరమైనదని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లే కదా! అంతమాత్రాన యూనిఫైడ్ పెన్షన్ స్కీం అంత గొప్పదా? అంటే అదేమీ కాదు. జాతీయ పెన్షన్ విధానం కన్నా మెరుగైనదా? వివరంగా పరిశీలిస్తే, యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని ఏ రకంగా చూసినా జాతీయ పెన్షన్ విధానం కన్నా మెరుగైనది కాదు.
ఎస్‌పిఎస్ కంటే యుపిఎస్ మెరుగైనదైనప్పుడు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకుండా మళ్లీ కొత్త పేరుతో యూనిఫైడ్ పెన్షన్ స్కీంను తీసుకురావడం వెనుక కచ్చితంగా కార్పొరేట్ కుట్ర దాగి ఉంది. ఓట్ ఫర్ ఒపిఎస్ పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో, ఒపిఎస్ ఇచ్చిన జార్ఖండ్‌లో, హర్యానా, మహారాష్ట్రలలో పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం చూపాయి. డిసెంబర్ నెలలో జరిగిన రైల్వే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఒపిఎస్ అంశమే ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నోఏళ్లుగా ఉన్న వ్యవస్థీకృత సంఘాలను ఓడించాయి. అదే విధంగా మన రాష్ట్రంలో గత సాధారణ ఎన్నికల్లో 14 శాసనసభ స్థానాలను గెలుపొందటం కీలకమైంది.
సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లే. రాష్ట్రంలో ఫిబ్రవరి 27న జరగనున్న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గంలో 45 శాతానికి పైగా ఉపాధ్యాయుల ఓట్లు ఉండటం, పట్టభద్రులు సిపిఎస్ కుటుంబ సభ్యుల ఓట్లు 60,900 ఉండటం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒపిఎస్ ప్రకటించడంతో ఆల్‌ఫోర్స్ నరేందర్ రెడ్డికు మద్దతు ఇవ్వడం, అదే విధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో 43 శాతానికి సిపిఎస్ ఉపాధ్యాయు ల ఓట్లు ఉండటం, ఈ ఎన్నికల్లో సిపిఎస్ సంఘం నుండి ఎంఎల్‌సి అభ్యర్థులు ఉండటం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరోసారి పాత పెన్షన్ ఆకాంక్ష తెలుపుటకు, యుపిఎస్‌ను అడ్డువేయుటకు సిపిఎస్ ఉపాధ్యాయులు సిద్ధం అయ్యారో లేదో మార్చి 3 వరకు వేచిచూడాల్సిందే.
– కల్వల్ శ్రీకాంత్