Sunday, January 19, 2025

కాంగ్రెస్, బిజెపి మ్యానిఫెస్టోల్లో బిసి బిల్లు ప్రస్తావన ఏది?

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ… కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఆర్.కృష్ణయ్య లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో బిసి బిల్లు ప్రకటించక పోవడాన్ని జాతీయ బిసి సంక్షేమ సంఘం వేలెత్తి చూపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు బహిరంగ లేఖ రాశారు. ఈ రెండు పార్టీలు బిసి బిల్లు పెట్టి, బిసిలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు పెడతామనే అంశాన్ని ప్రస్తావించక పోవడాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. బిసిలు దేశవ్యాప్తంగా చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమిస్తున్నారని, ఇది దేశంలోని 50 కోట్ల మంది బిసి ప్రజల చిరకాల కోరిక అని ఆయన తెలిపారు.

బిజెపి బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన విషయాన్ని కృష్ణయ్య ప్రస్తావిస్తూ బిసి ఉద్యమంలో ఇది ఒక భాగం మాత్రమేనన్నారు. బిసిలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే ప్రధానమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి బిసి కులాల వారి లెక్కలు తీసి, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచుతామని, క్రీమీ లేయర్ తొలగిస్తామని ప్రకటించిందన్నారు. ఇది బిసి ఉద్యమంలో మంచి విజయమని కృష్ణయ్య పేర్కొన్నారు.

ఏ పార్టీ కూడా బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి సిద్ధపడడం లేదని విమర్శించారు. రాజ్యాధికారంలో వాటా ఇచ్చేవరకు బిసి ఉద్యమం కొనసాగుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బిఆర్‌ఎస్ బిసిల అభివృద్ధిపై విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కులాల వారి జనాభా లెక్కలు, చట్టసభలలో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు అంశంపై విధాన ప్రకటన చేయాలని కోరారు. బిసి బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీకే బిసిలు మద్దతు ప్రకటిస్తామని కృష్ణయ్య స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News