Friday, November 15, 2024

సంపాదకీయం: ఆర్థిక ప్రగతి?

- Advertisement -
- Advertisement -

Farmers concerned that no Minimum Support Price for Crops

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో మొదలు కానున్నాయి. 2020 లో కొవిడ్ 19 (కరోనా) విజృంభణ కారణంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు మాసాల తరబడి స్తంభించిపోయి ఆదాయాలు, అభివృద్ధి దారుణంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా ఊపిరిపోసేదిగా ఉండాలి. భవిష్యత్తు మీద ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా రూపుదిద్దుకోవాలి. లాక్‌డౌన్‌లో అనేక కష్టాలు ఎదుర్కొన్న అసంఖ్యాక వలస కార్మికుల్లో, అవ్యవస్థీకృత రంగంలోని పలు రకాల ఉపాధి పనుల ప్రజల్లో, ఉద్యోగాలు ఊడిపోయిన, వేతనాలు పడిపోయిన తెల్లచొక్కా పని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించితేగాని మన ఆర్థిక విధాన వ్యూహకర్తల కృషి ఫలించినట్టు కాబోదు. కొత్త సంవత్సరంలో ప్రవేశించగానే 2020 డిసెంబర్ నెల వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్ల సమాచారం ఎదురు చూడని తీపిని తినిపించింది.

ఈ పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంత అత్యధిక మొత్తంలో గడిచిన నెలలో జిఎస్‌టి వసూళ్లు నమోదు అయ్యాయి. అంతేకాదు జిఎస్‌టి వసూళ్లు వరుసగా మూడు నెలల్లో రూ. లక్ష కోట్లు దాటాయి. డిసెంబర్‌లో రూ. లక్ష 15 వేల కోట్లు వసూలయింది. జిఎస్‌టి వసూళ్లు కూడా ఆర్థిక రంగ స్వస్థతకు సంబంధించిన సూచియే అయినప్పటికీ అదొక్కటే మొత్తం దేశ ఆర్థికారోగ్యాన్ని ప్రతిబింబించదు. డిసెంబర్ జిఎస్‌టిలోగాని అంతకు ముందరి రెండు నెలల వసూళ్లలోగాని పండగల సీజన్ కొనుగోళ్లు, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు అత్యవసర వస్తు సామగ్రి కొనుగోళ్ల కోసం ఒక్కుమ్మడిగా మార్కెట్ మీదికి ఎగబడడం వల్ల పెరిగిన అమ్మకాలు ప్రతిబింబించడం సహజం. అందుచేత జిఎస్‌టి వసూళ్ల ప్రగతి ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని అనుకోడానికి వీల్లేదు. పన్నుల అధిక వసూళ్లలో పై వర్గాల కొనుగోలు శక్తి కూడా కనిపిస్తుంది. సాధారణ ప్రజల జేబు బలాన్ని అందులో ఖచ్చితంగా చూడలేము.

దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు డిసెంబర్ నెలలో 9.1 శాతానికి ఎగబాకిందన్న సమాచారంలోనే మన ఆర్థిక వ్యవస్థ దుస్థితి ద్యోతకమవుతున్నది. నవంబర్ నెలలో 6.5 శాతం వద్ద ఉన్న నిరుద్యోగ రేటు డిసెంబర్‌లో 9.1 శాతానికి చేరుకోడం ఆందోళనకరమే. లాక్‌డౌన్ తర్వాత దేశ ఆర్థిక కార్యకలాపాల్లో ఆశించిన వృద్ధి లేకపోడం వల్లనే ఈ పెరుగుదల సంభవించిందని అనుకోవలసి ఉంది. నిరుద్యోగం డిసెంబర్‌లో ఒక వారానికి మించి ఇంకొక వారం పెరుగుతూ నెలాఖరుకు 9.1 శాతానికి చేరుకున్నదని ఈ నెల 4వ తేదీ నాటికి అది 9.3 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 3.1 శాతానికి పడిపోడం గమనార్హం. ఇది గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగజారుడని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారాలైన తయారీ, నిర్మాణ రంగాలు పుంజుకోకపోతే ఆర్థిక పరిస్థితి కొట్టవచ్చినట్టుగా మెరుగుపడడం సాధ్యం కాదు. లాక్‌డౌన్ కారణంగా 2020 ఏప్రిల్ మే నెలల్లో 25 శాతానికి చేరుకున్న నిరుద్యోగ పెరుగుదల రేటు జులై నాటికి 7 శాతానికి తగ్గడం సంతోషాన్ని కలిగించింది.

ఇప్పుడది తిరిగి 9.3 శాతం వద్దకు వచ్చి 10 శాతం వైపు పై చూపు చూస్తున్నదంటే దేశ ఆర్థిక వ్యూహకర్తలు వచ్చే బడ్జెట్‌లో ఇందుకు బలమైన విరుగుడును ప్రయోగించవలసి ఉంది. నిరుద్యోగ పెరుగుదల రేటు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 8.8 శాతంగా, గ్రామాల్లో 9.6 శాతంగా నమోదయింది. జిఎస్‌టి వసూళ్లు పెరగడానికి ప్రత్యక్ష మార్కెట్ విక్రయాలతో పని లేదు. సగటు జనాభా కొనుగోలు శక్తితో నిమిత్తం లేకుండా పై వర్గాల జేబు బలాన్ని బట్టి ఆన్‌లైన్ వ్యాపారం ఊపందుకుంటుంది. అందువల్ల సగటు ప్రజల కొనుగోలు శక్తిని చెప్పుకోదగిన స్థాయికి పెంచడానికి ఏమి చర్యలు తీసుకుంటారనే దాని మీదనే దేశ ఆర్థిక పురోగతి ఆధారపడి ఉంటుంది. దేశం శిఖర ప్రాయమైన ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే వచ్చే దశాబ్ద కాలంలో వ్యవసాయేతర రంగాల్లో 9 కోట్ల ఉద్యోగాలు కల్పించవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

2030 నాటికి నిర్మాణ రంగంలో కోటి 60 లక్షలు, రియల్ ఎస్టేట్‌లో 2 కోట్ల 40 లక్షలు, మౌలిక సదుపాయాల రంగంలో 80 లక్షలు, తయారీ రంగంలో కోటి 10 లక్షల అదనపు ఉద్యోగాల సృష్టి జరగాలని చెబుతున్నారు. ఇది ప్రైవేటు రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోడం వల్ల సాధ్యమయ్యేది కానేకాదు. అలా చేయడం వల్ల ఉద్యోగాలు, ఉపాధులు పెరగకపోగా కార్మికుల కష్టాలు, నష్టాలు పేట్రేగిపోయి మానవ విషాదం అవధులు మీరే ప్రమాదముంది. అందుచేత కేంద్ర ప్రభుత్వమే వివిధ రంగాల్లో వ్యయాన్ని పెంచి కొత్త ప్రాజెక్టులు చేపట్టి ప్రజలకు ఉపాధులు, ఉద్యోగాలు కల్పించి వారి కొనుగోలు శక్తి పెంచవలసి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202122 బడ్జెట్‌లో ఏమి చేస్తారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News