Friday, November 15, 2024

హైదరాబాద్ డ్రగ్స్ కేసు…. లక్ష్మీపతి ఎక్కడ!?

- Advertisement -
- Advertisement -

రంగంలోకి మూడు బృందాలు.. విస్తృతంగా గాలింపు చర్యలు..
తరచూ మకాం మార్చడం, నెంబర్ల మార్పుతో
పోలీసులకు చిక్కని వైనం

Where is Lakshmipathy in Drug case
మన తెలంగాణ/హైదరాబాద్: హై-దరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతి ఎక్కడ!? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. లక్ష్మీపతి కోసం పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నప్పటికీ అతడి ఆచూకి అధికారులకు లభ్యం కావడం లేదు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలి డ్రగ్స్ కేసు మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు . ఇందుకోసం మూడు నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. అరకు, విశాఖ, తణుకు, గోవాలలో లక్ష్మీపతి తలదాచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవడం తరచూ మకాం మారుస్తూ వుండటంతో లక్ష్మీపతి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. గతంలో 2020 నవంబర్ 27న లక్ష్మీపతిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఐటి వింగ్‌లో భారీ నెట్‌వర్క్ వున్నట్లుగా గుర్తించారు. ఐటి ఉద్యోగులే టార్గెట్‌గా హ్యాష్ ఆయిల్ విక్రయాలు జరుపుతున్నట్లుగా నిర్ధారించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసగా మారి బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ప్రేమ్ ఉపాధ్యాయ్, శ్రీరామ్ అనే డ్రగ్స్ విక్రేతలను వేర్వేరు ఘటనల్లో అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి డ్రగ్స్ తీసుకొంటున్న దీపక్ కుమార్ జాదవ్, రామకృష్ణ, నిఖిల్ జాస్వ, జీవన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రేమ్ ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేయడంతో అతనికి హాష్ అయిల్ సరఫరా చేస్తున్న లక్ష్మీపతి వ్యవహారం వెలుగు చూసింది. స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా.. డ్రగ్స్‌కు సంబంధించి బీటెక్ విద్యార్థులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు లక్ష్మీపతి సమాచారం ఇస్తున్నాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసిన లక్ష్మీపతి.. డ్రగ్స్ దందా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అతను ఓ పోలీసు అధికారి కొడుకుగా నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అతనిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

అరకులో గంజాయి పెడ్లర్ నగేష్ సహాయంతో హాష్ ఆయిల్ దందా సాగిస్తున్నాడు. మీర్ పేట, బీరంగూడ కు చెందిన మోహన్‌రెడ్డి లక్ష్మీపతికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని దందా సాగిస్తాడని తెలుస్తోంది. హైద్రాబాద్‌లోని కొండాపూర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రామకృష్ణ, గిటార్ టీచర్ నిఖిల్ జాషువా, బీటెక్ స్టూడెండ్ జీవన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గోవా కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. బీటెక్ విద్యార్ధులు, నలుగురు డీజేలతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కోసం వచ్చే వారికి టాటూస్ వేసేవారు. టాటూస్ ఉన్న వారికే డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఇదిలా ఉంటే హైద్రాబాద్ నుండి గోవాకు వచ్చే వారి కోసం 15 డెన్లు ఏర్పాటు చేశారు. ఈ డెన్లలో 24 గంటల పాటు డ్రగ్స్ సరఫరా చేసేవారు. హోటల్స్, పబ్స్, రిసారట్స్ లలో అర్ధరాత్రి డ్రగ్స్ అందించేవాళ్లని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News