Thursday, December 19, 2024

పటేల్ పద్మక్క ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యురాలు పటేల్ పద్మ (60), అలియాస్ సుజాత, కల్పన పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఆమెను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె అనారోగ్యం కారణంగా బస్తర్ నుంచి హైదరాబాద్‌లో వైద్యం కోసం వస్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా ? లేక అనారోగ్య కారణంగా ఆమె తనకు తెలిసిన వారితో కలిసి లొంగిపోయేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడిందా అన్న విషయం ఇంకా స్పష్టం కావడం లేదు. పోలీసులు మాత్రం సుజాత తమ అధీనంలో లేదని వెల్లడిస్తున్నారు. ఆమెను మహబూబ్‌నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకోలేదని, కొత్తగూడెం ప్రాంతంలోనే అదుపులోకి తీసుకోని ఉంటారని భావిస్తున్నారు. సుజాత చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో పని చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా దండకారణ్యంలో పోలీసుల వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు.

పార్టీపై పూర్తి స్థాయిలో నిర్భంధం కొనసాగుతున్న నేపథ్యంలో సుజాత పోలీసులకు చిక్కడం పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త మల్లోజుల కోటేశ్వర్ రావు ఆలియాస్ కిషన్‌జి గత మూడు సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్లో మృతి చెందారు. సుజాత పార్టీలో సీనియర్ మెంబర్లలో ఒకరిగా ఉంటున్నారు. వయస్సు మీద పడినా ఆమె పలు ఎదురు కాల్పుల నుంచి పలుసార్లు తప్పించుకున్నారు. పార్టీలో అనేక మంది సీనియర్ మావోయిస్టు నేతలు లొంగిపోయినా, ఎదురు కాల్పుల్లో మరణించినా పటేల్ పద్మ ఆలియాస్ సుజాత మాత్రం ఉద్యమంలోనే కొనసాగుతూ వచ్చింది. ఆమెపై కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో సొంత ఊరు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

40 ఏళ్లుగా ఊరు ముఖం చూడని పద్మ
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పటేల్ పద్మది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం పెంచికల పాడు గ్రామం. తండ్రి తిమ్మారెడ్డి తల్లి వెంకటమ్మలకు పద్మ రెండవ సంతానంగా జన్మించింది. ఈమెకు అన్న శ్రీనివాస్ రెడ్డి ( ప్రస్తుతం సొంత ఊరిలోనే పోస్టు మాస్టర్‌గా ఉన్నారు) తమ్ముళ్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పటేల్ హనుమంతురెడ్డిలు ఉండగా వారిద్దరు వ్యవసాయ పనులు చేస్తున్నారు. చెల్లి లత ఉన్నారు. పద్మ కుటుంబం మొదటి నుంచి భూస్వామ్య కుటుంబమే. తండ్రి తిమ్మారెడ్డి సొంత ఊరిలోనే పోస్టు మాస్టర్‌గా పని చేస్తూనే 300 ఎకరాలకు భూస్వామిగా ఉన్నారు. పద్మ ప్రాథమిక విద్యాభ్యాసం పెంచికల పాడు, ఐజలో కొనసాగింది. ఇంటర్మీడియట్ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి కళాశాలలో చదువుకుంది. అప్పట్లో ఐజకు చెందిన పటేల్ సుదర్షన్ రెడ్డి పీపుల్స్‌వారు జిల్లా కార్యదర్శిగా ఉన్న సందర్భంలో పద్మ ఆలియాస్ సుజాత రాడికల్ విద్యార్థి సంఘంలో పని చేశారు.

డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ డిగ్రీ చదువుకుంటూనే ఆర్‌ఎస్‌యులో క్రీయాశీలకంగా పని చేశారు.అదే సందర్భంలో ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతున్న మల్లోజుల కోటేశ్వర్ రావు, ఆలియాస్ కిషన్‌జితో పరిచయం అయ్యింది. ఇద్దరు కూడా అజ్ఞాత దళంలో సభ్యులుగా చేరి పార్టీ కోసం అనేక ప్రాంతాల్లో పని చేశారు.ఈ క్రమంలోనే పద్మ ఆలియస్ సుజాత మల్లోజుల కోటేశ్వర్‌రావును ఆదర్శ వివాహం చేసుకున్నారు. దళ సభ్యురాలితో చేరిన పద్మ అంచలంచలుగా కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్ రావు గత మూడు సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్లో చనిపోయినా సుజాత పార్టీని వీడ లేదు. దండకారణ్యంలో పార్టీ విస్తరణకు కృషి చేసింది. అనేక ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుంది. పోలీసులు ఆమె కోసం అనేక సార్లు గాలించినా తృటిలో తప్పించుకుంది. సుజాత ప్రస్తుతం వయస్సు భారం పడడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆమె వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటారా ? లేక ఆమె వయస్సు భారం, అనారోగ్య సమస్యల కారణంగా లొంగిపోయేందకు వచ్చి పట్టు బడిందా అన్న విషయం స్పష్టం కావడం లేదు. పోలీసులు ఇంకా ఈమెపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో 18 ఏళ్ల వయస్సులో పార్టీ కోసం ఇంటి నుంచి వదిలివెళ్లిన పటేల్ పద్మ ఆలియాస్ సుజాత 40 ఏళ్లుగా ఇంటి ముఖం చూడలేదు. ఆమె తల్లిదండ్రులు మరణించినా చూడడానికి రాలేక పోయింది. చిన్న వయస్సులో చూసిన అన్నా తమ్ముళ్లు చెల్లెను ఇప్పటి దాక చూడ లేకపోయింది. పెద్ద అగ్రవర్ణ కుటుంబంలో భూస్వామ్య కుటుంబలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని పేద ప్రజల కోసం సర్వం వదులుకొని ఉద్యమంలోకి వెళ్లిన పటేల్ పద్మ ఆలియాస్ సుజాత క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రజినీ బాయ్‌ది కూడా ఉద్యమ దారే ః
ప్రస్తుతం గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టు నేతలు మాత్రమే పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఒకరు పటేల్ పద్మ, మరొకరు రజినీబాయి వీరిద్దరు కూడా సీనియర్ నేతలుగా కొనసాగుతున్నట్లు సమాచారం. పటేల్ పద్మ, ఆలియాస్ సుజాతది గట్టు మండలం పెంచికల పాడు గ్రామం కాగా, రజినీ బాయ్‌ది గద్వాల జిల్లా కేంద్రంగా చెబుతున్నారు. ప్రస్తుతం వీరిలో రజినీబాయ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిందా లేక ఇంకా పార్టీలో కొనసాగుతున్నారా అన్న విషయం తెలియడం లేదు. నడిగడ్డ నుంచి గతంలో అనేక మంది పీపుల్స్‌వార్ పార్టీలో చేరి అనేక మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఐజ మండలానికి చెందిన పటేల్ సుధాకర్ రెడ్డి కూడా రాష్ట్రకమిటి సభ్యుడిగా ఎదిగి గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయారు. ప్రస్తుతం ఇద్దరు మహిళా నేతలు మినహా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మావోయిస్టు పార్టీలో ఎవరు లేరని సమాచారం.
ఫోటోలు ః 17 ఎంబిఎన్‌ఆర్ 51,52

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News