Friday, November 22, 2024

సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

Where is the science with human touch?

ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది. ఏడు లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఆనవాల్లు మొట్టమొదటిసారిగా ఆఫ్రికా ఖండంలో కనబడినాయని చెప్పబడినాయని చెప్పింది మనిషే. మనిషే దేవున్ని సృష్టించుకున్నాడు. మతాలను, విశ్వాసాలను సృష్టించుకున్నాడు. Nece ssity is the Mother of Inventionను అనుసరించి అనేక ఆవిష్కరణలు చేశాడు. వివిధ శాస్రాలను, సైంటిఫిక్ జ్ఞాన సంపదనుసృష్టించినది మనిషే. మూఢ విశ్వాసాలను సృష్టించింది మనిషే. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం సృష్టి రహస్యాన్ని ఛేదించింది లక్షలాది సంవత్సరాల క్రమపరిణామం వల్ల అమీబా దశ నుండి మనిషి ఈ రూపానికి వచ్చాడని నిర్ధారించింది. దైవ, మత ఊహాజనిత విశ్వాసాలకు ఈ సిద్ధాంతంతో చరమగీతం పాడినట్టు యింది. అయినా మతాలు, సైన్సు మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణకు కారణం మనిషే.

డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వచ్చింతరువాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క పెద్ద మతమూ రాలేదన్నది వాస్తవం. అయితే మతాల స్థానంలో బాబాలు, స్వామీజీలు మతాలు చేస్తున్న పనిని కొనసాగిస్తున్నాయి. అటు సైన్సు సంబంధమైన అభివృద్ధి, గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతున్నదీ, ఇటు మత, మూఢ విశ్వాస, దైవసంబంధమైన ఘర్షణలు జరుగుతున్నదీ వాస్తవమే. ఈ రెండు పనులు చేస్తున్నదీ మనిషే.

మనిషి ఎందుకు? ఏమిటి? ఎలా? ఎక్కడ? అని ప్రశ్నలు వేసుకొని అవసరాలననుసరించి కొంత, జిజ్ఞాసతో కొంత చేసిన ప్రయోగాలు, ఆవిష్కరణలతో సృష్టికి ప్రతి సృష్టి చేయగల స్థాయిచేరుకున్నాడు. ప్రాచీన శిలాయుగం నుండి అణుయుగం, ఎలెక్ట్రానిక్ యుగం, గ్రహాంతర సేవలకు పోగల జ్ఞాన సంపదను ఆవిష్కరించింది మనిషే. ఇవన్నీ సైన్సు వల్ల వచ్చిన సంఘటనలే. సైన్సు పురోభివృద్ధి వల్ల మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకున్నమాట వాస్తవమే. కానీ సుఖవాంఛ మనిషి జీవితాన్ని దుఃఖమయమూ చేస్తుంది. మనిషి మనుగడను భూగోళంపై ప్రశ్నార్ధకమూ చేస్తుంది. శాస్త్ర విజ్ఞానపరమైన అభివృద్ధికి మానవాంశ కరువైనందు వల్ల ఈ దుస్థితి ఏర్పడుతుంది. యుద్ధకాంక్ష, ఆయుధ పోటీ, అధికరలాలసత, ఆర్ధికాధిపత్యం లాంటి అనేక కారణాల వల్ల సైన్సు రెండు వైపులా పదునైన కత్తిలా మారింది. అభివృద్ధి పేరు మీద భోగలాలసత, ఆధిపత్య భావజాలాన్ని పెంచుకోవడంవల్ల మానవ జాతి పురోభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాల్సిన సైన్సు మానవ జాతి వినాశనానికే దోహదం చేసేదవుతుంది.

యుద్ధాలు ఎప్పుడైనా సరే వినాశకరమైనవే. మానవజాతి విధ్వంసానికి ప్రధాన కారణాలలో యుద్ధాలు ముఖ్యమైనవే. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు అనేది వాస్తవం. ఈ నేలపైన ప్రతి అంగుళం రక్తంతో తడిసినదే. రాజుల కాలంలో యుద్ధాలు రధ గజ తురగ పదాతి దళాలతో మానవ శక్తి పైనే ఆధారపడి ఉండేవి. ఆ యుద్ధాలే నేలనంతా రక్తసిక్తం చేశాయి. ఒక్కో యుద్ధంలో వేలు లక్షలు మరణించారు. కాని సైన్సు బాగా అభివృద్ధి చెంది అణుబాంబులు, హైడ్రోజన్ బాంబు లు, నూక్లియర్ బాంబులు, బయోలాజికల్ కిల్లర్స్, ఆధునిక ఆయుధాలు, గన్స్, ఫైటర్ విమానాలు వచ్చింతర్వాత జరిగే యుద్ధాల మాటేంటి? న్యూక్లియర్ వెపన్స్ పూర్తి స్థాయిలో తయారు కాకముందే జరిగిన రెండవ ప్రపంచ యుధ్ధంలో జరిగిన మారణహోమంతో పాటు దేశాలే భస్మీపటలం కావడం ఎంత దారుణం?

ఇది ఏ అమానవీయ సంస్కృతికి నిదర్శనం? అపుడే అలా జరిగితే ఇప్పుడు యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు జరిగితే జరిగే విధ్వంసాన్ని ఊహించగలమా? అయినాసరే దేశాలన్నీ తమ దేశాల నిండా యుద్ధసామగ్రిని నింపివేశాయి. ఇది సైన్సును పిచ్చి వాడిచేతిలో రాయిలా వాడుకోవడమే అవుతుంది. ఇప్పటికే రష్యా, అమెరికా, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఫ్రాన్స్, ఉత్తరకొరియా అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పొందితే, ఇంకెన్నో దేశాలు ఆ ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సైన్సు ఎవరిని ఉద్ధరించడాని కోసం? భూగోళాన్ని భస్మీపటలం చేసే ఇలాంటి సైంటిఫిక్ డెవలప్‌మెంట్ అవసరమా? ఇలాంటి సైంటిఫిక్ డెవలప్ మెంట్‌ను ఆపి ఆయుధాలను నిర్వీర్య పరిచి, ప్రపంచ దేశాలను ఆయుధ రహిత దేశాలుగా మార్చవచ్చుకదా? పాలకుల ఆధిపత్య భావాలు, ప్రపంచాధిపత్య అమానవీయ పోటీ సైన్సు విత్ హ్యమన్ బీయింగ్స్ డెత్‌గా మార్చేస్తుంది. ఇది మానవాళి వినాశ హేతువే..

విస్పోటనాలతో మనుష్యులను చంపడం, కాల్పులు, ఎదురుకాల్పుల పేరు మీద మనుషులను చంపడం, బాంబు పేలుళ్లతో చంపడం లాంటివన్నీ సైన్సు ప్రసాదించిన ఆయుధాల వల్లనే. ఈ ఆయుధాలను తయారు చేసింది, చేస్తున్నదీ మనిషే. దీనికి సరిపడే విజ్ఞానాన్ని సమాజాని కిచ్చిందీ మనిషే. నోబుల్ కనుగొన్న విస్పోటనా సూత్రం, ఐన్‌స్ట్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం బాంబుల తయారీకి, పేల్చివేతలకు ఉపయోగించుకోవడం ఎంత అమానుషకరం? మనిషి స్థాపించిన మతాలు, దేవళ్ళ పేరు మీద తీవ్రవాదం, హత్యలు, యుద్ధాలు జరుగడం మానవ జాతి హననానికే కదా? బిన్ లాడెన్ అనుచర తీవ్రవాదులు సైన్సు నేర్పిన విజ్ఞాన పరిజ్ఞానంతోనే ఒక్క విమాన ‘ఢీ’ తో న్యూయార్క్ టవర్స్ ను పేల్చి వేస్తే వేల మంది మరణాలకి గురయ్యారు. ఇలాంటి సైన్సు డెవలప్మెంట్ అవసరమా? ఇంట్లోనే కూర్చొని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాలను భస్మీపటలం చేసే సైన్సు ఎవరికోసం…? ఎందుకోసం..? విచక్షణా రహితంగా చెట్లు నరికి వర్షాలు రాకుండా చేస్తున్నాడు మనిషి.

చెట్లు బాగా ఉండడం వల్ల కాలుష్య వాయువులను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేసేవి చెట్లేనని కనుగొన్నది మనిషే. చెట్లతో వర్షాలు పడుతాయని కనుగొన్నది మనిషే. వాటిని నరికింది మనిషే. చెట్లు నరికివేత, భూగర్భ జలాలు లోతుల్లోకి పోవడం, వాతావరణ కాలుష్యం, విష వాయువులను వాతావరణంలోకి నిరభ్యంతరంగా వదలడం వల్ల ఓజోన్ పొర దెబ్బతింది. సూర్య కిరణాలు సూటిగా భూమిపై పడి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఇలాగే ప్రకృతి విధ్వంసం జరిగితే మరోవెయ్యేళ్ల లోపే భూగోళంపై మానవజాతి మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని స్టెఫీన్ హాకింగ్ హెచ్చరించాడు. మనిషే భూమి, గ్రహాలు అన్నిటి గురించి తెలుసుకున్నాడు. అవన్నీ ఉన్నాయని చెప్పిందే మనిషే. వీటినన్నింటినీ సర్వనాశనం చేస్తున్నదీ మనిషే. భూమిని, నీటిని, గాలిని, ఆహార పదార్ధాలను కలుషితం చేసింది మనిషే. భూమిపై మానవ జాతిని తన చర్యలతో ప్రశ్నార్ధకం చేస్తున్నదీ, వినాశనం చెందకుండా కాపాడవల్సింది మనిషే.

ప్రకృతి విధ్వంసాన్ని ఆపి ఆకుపచ్చని విశ్వాన్ని తయారు చేసుకున్నప్పుడే ఇదిసాధ్యమవుతుంది. యుద్ధరహిత, ఆయుధ రహిత, కాలుష్య రహిత, హరిత విశ్వంతోనే మానవ జాతికి భరోసా లభిస్తుంది.ప్రస్తుత సమయంలో సంవత్సర కాలం పైగా మానవ జాతిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కంటికి కనిపించని సూక్ష్మవైరస్ కరోనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని మరణ శయ్యపైకి నెట్టి ఇంకా వికృటాట్టహాసం చేస్తోంది. కరోనా వైరస్ లాంటి వైరస్ లు ప్రకృతి విధ్వంసం, అనేక మానవ తప్పిదాల వల్ల వచ్చినవే. దీన్ని ఎదుర్కోవడానికైనా, నిర్మూలించడానికైనా, ఇటువంటి వైరస్‌లు రాకుండా ఉండడానికైనా సైన్సు మాత్రమే ఉపయోగపడుతుందని కరోనా కాలం నిరూపిస్తుంది. బయోలాజికల్ కిల్లర్స్ పంపి, అణ్వాయుధాలు ఉపయోగించి, మందుపాతరల ద్వారా మనుషులను చంపడం కంటె భయంకరం, ప్రమాదకరం ఇలాంటి వైరస్‌లు.

ఇలాంటి వైరస్‌ల సృష్టి కొందరు చెబుతున్నట్టు మానవ మస్తిష్కం లోంచి వచ్చిన దురాలోచనల ఫలితమే అయ్యుంటే అంతకంటె నీచమైన పని మరొకటుండదు. అంతకంటే చరిత్రహీనమైన పనీలేదు. కాని అనేక భయంకర రోగాల్లా, వైరస్‌ల్లా ఇదీ సహజంగా వచ్చిందే అయ్యుంటుంది. ఇలాంటి వాటి మూలాలను పరిశోధించి నిర్మూలించకుంటే భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు మానవజాతి పాలిటి శాపాలుగా రావచ్చు. వీటిని నిర్మూలించ గలిగే శక్తి సైన్సుకు మాత్రమే ఉంది. మనిషి మస్తిస్కానికి మాత్రమే ఉంది. అందుకోసమే సైన్సు విత్ హుమెన్ టచ్ వైజ్ఞానికాభివృద్ధి కావాలి. ఇలా సైన్సు మనిషి సుఖవంతమైన జీవితానికి దోహదపడింది. సృష్టి రహస్యాలను విప్పి చెప్పింది.

అలాగే యుద్ధ పరికరాలు, ప్రకృతి విధ్వంస చర్యలు, వైరస్‌లలాంటి సృష్టి, బయో లాజికల్ కిల్లర్స్ సృష్టి, ఆయుధాలు మానవ జాతిని ప్రమాదపుటంచుకు నెడుతుంది. నెట్టింది. సైంటిఫిక్ అభివృద్ధి జరగాల్సిందే కాని ఆ అభివృద్ధి, ఆవిష్కరణలు మానవజాతిని, జీవరాశులను ఈ భూగోళంపై శాశ్వతంగా ఉండే దిశలో మాత్రమే ఉండాలి. మానవజాతికి, జీవరాశులకు నష్టం కలిగించే ఏ ఆవిష్కరణా అవసరం లేదు. అలాంటి వాటిని, ధ్వంసం చేయాలి. సైన్సు విత్ హ్యూమెన్ టచ్ వైజ్ఞానికాభివృద్ధి నేటి చారిత్రక, మానవీయ అవసరమని కరోనా వల్ల మానవ జాతి నేర్చుకొని తీరాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News