భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగిన ఆహార భద్రత కల్పించి, పేదరికాన్ని నిర్మూలించడంలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తోన్నా రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాల విధానాలు, నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వ్యవసాయరంగం రోజురోజుకు కునారిల్లిపోతోంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, చీడపీడలు, దిగుబడులు పడిపోవడం, కూలీల ఖర్చు పెరిగిపోవడం, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడం, రుణభారం మొదలగు కారణాలతో రైతులు వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతున్నారు.
ఎండనక, వాననక ఆరుగాలం కష్టపడిన చివరకు కుటుంబం గడవడమే కష్టమైపోతోంది. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పల్లెల్లో వ్యవసాయం నిర్వీర్యం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వేల కుటుంబాలు జీవనోపాధి కోసం పట్టణాలకు వలస బాట పట్టడంతో సేద్యానికి స్వస్తి చెబుతున్న వారి సంఖ్య పెరిగిపోయి పంట భూములు బీడు పడుతున్నాయి.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోడీ సారథ్యంలో బిజెపి 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అధికారంలోకి వచ్చింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి ఏటా బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రులువల్లె వేయడం ఆనవాయితీగా వస్తోంది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఊదరగొడుతూ మరోవైపు వ్యవసాయంలో అంతంత మాత్రంగా ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బ తీయటానికి కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పగించాలనే ప్రభుత్వ దుర్నీతికి వ్యతిరేకంగా గత ఆరు నెలలుగా ఢిల్లీ వేదికగా రైతులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం ఏమాత్రం తలొగ్గటం లేదు. మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని రైతుల డిమాండ్‌కు ప్రభుత్వంలో చలనంలేదు.
తాజాగా వ్యవసాయ పంట ఉత్పత్తులకు కొత్త మద్దతు ధరల పేరుతో అన్నదాతలను కేంద్ర సర్కార్ మళ్లీ నైరాశ్యంలోకి నెట్టింది. డీజిల్, రసాయనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతూ సాగు వ్యయం విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునే రీతిలో కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి) ప్రకటించకపోవడం దారుణమైన పరిణామం. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సమావేశంలో 2021- 22 (జూలై- జూన్) పంట కాలానికి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కొద్దిమేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరి, పత్తితో పాటు ఇతర పంటల సాగు వ్యయం పెరుగుతోందని మద్దతు ధరలను పెంచాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం, పంటలపై పెట్టుబడిని, వచ్చే దిగుబడిని ఏమాత్రం అంచనా వేయకుండా కనీస మద్దతు ధరలు ప్రకటించడాన్ని రైతులు, రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి.
జాతీయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ (సిఎ సిపి) లోపభూయిష్ట ధరల నిర్ణయం మూలంగా రైతులు నిండామునిగే పరిస్థితి ఏర్పడింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని పంటలపై పెట్టిన పెట్టుబడికి 50 శాతం అదనపు రాబడి వచ్చేలా ధరలు నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ ప్రకటించటం రైతులను మోసగించినట్లే అవుతుంది. అన్ని పంట ఉత్పత్తుల వాస్తవ వ్యయంలో సగానికంటే తక్కువ ధరలను మద్దతు ధరలుగా ప్రకటించడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం జోడించి కనీస మద్దతు ధర ప్రకటించాలన్న స్వామినాథన్ కమిటీ సిఫారసుల కనుగుణంగా ప్రస్తుత మద్దతు ధరల ప్రకటన కలదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం పూర్తిగా అవాస్తవం, అంచనాలకు ఏమాత్రం అందనటు వంటిది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) పంటల కయ్యే ఖర్చును శాస్త్రీయంగా లెక్కగట్టి దానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.
దీనికి భిన్నంగా కేంద్రం సూచిస్తోన్న ధరలనే మద్దతు ధర పేరుపెట్టి సిఎసిపి కేంద్రానికి సిఫారసు చేయడం, దాని కేంద్రం ఆమోదించటం ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది.హెక్టారు సాగు కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ యంత్రాలకు రైతులు చెల్లించే అద్దె మొత్తం, రైతు కుటుంబం భూమిలో చేసిన శ్రమను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని సిఎసిపి చెబుతోంది. భూమి కౌలుధర, సొంత పెట్టుబడి పెట్టినప్పుడు దానికయ్యే వడ్డీని కూడా కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చేసిన సూచనలను మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పరిశ్రమలోనైనా ఉత్పత్తి చేసే సరుకుల ధరలలో యంత్రాలపై పెట్టుబడి ఖర్చు, స్థలం అద్దె మొదలగునవి జోడించబడుతాయి. కానీ దీనికి విరుద్ధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ధారణలో భూమి కౌలు ధర, సొంత పెట్టుబడిపై వ్యయాన్ని తీసుకోకపోవడం రైతులను నిండా ముంచుతోంది.
పంటలకు కేంద్రం ప్రకటిస్తున్న మద్ద తు ధరల కన్న తెలంగాణలో సాగు ఖర్చులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పంటల ఉత్పత్తి వ్యయాన్ని, స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం సాగు వ్యయంపై యాభైశాతం అదనంగా కలిపి 2021 -22లో మద్దతు ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే సిఎసిపి కి విన్నవించింది. కానీ వీటిని సిఎసిపి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎ గ్రేడు వరి రకం క్వింటా పండించేందుకు నారుమడి, విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, పంటకోత, కూలీల, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలిపితే రూ. 2,758 అవుతుందని దీనికి 50 శాతం కలిపి రూ. 4,137 మద్దతు ధరను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం రూ. 1,960నే మద్దతు ధరగా నిర్ణయించింది.
క్వింటా సాధారణ వరి ధాన్యం ఉత్పత్తి చేయడానికి వాస్తవ వ్యయం రూ. 1,293 గా నిర్ధారించి దానికి 50 శాతం కలిపి 1,940 రూపాయల మద్దతు ధరను కల్పించినట్టు గొప్పలు చెబుతోంది. గత సంవత్సరం మద్దతు ధరకు 72 రూపాయలు రెండు రకాల వరి ధాన్యానికి అదనంగా ఇచ్చి చేతులు దులుపుకుంది. క్వింటా పత్తి ఉత్పత్తి వ్యయం రూ. 9,954గా లెక్కగట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ దానికి 50 శాతాన్ని జోడించి రూ. 1,4931ల మద్దతు ధరను నిర్ణయించాల్సిందిగా సిఫారసు చేస్తే రూ. 6,025లనే మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. అలాగే అన్ని రకాల పంట ఉత్పత్తుల వ్యయానికి, కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలకు మధ్యన ఏ మాత్రం పొంతనే లేకుండా పోయింది.
ప్రస్తుత మద్దతు ధరల నిర్ణయ విధానం లోపభూయిష్టంగా ఉందని మార్పులు చేయాలనే అభిప్రాయాలు రైతులు, వ్యవసాయ నిపుణులు నుంచి వస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సాగు వ్యయాలు తీసుకుని గుండుగుత్తగా జాతీయ సగటు ఆధారంగా ధర నిర్ణయించడంతో శాస్త్రీయత లోపిస్తోంది. దీని వల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఏటా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ లు సవాలక్ష నిబంధనలు, పలు రకాల కారణాలతో కొద్ది పంట ను మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా ఉత్పత్తులను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తమకున్న పరపతి తో ప్రభుత్వరంగ సంస్థలకే మరల అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను పునః పరిశీలించి అన్నదాతలను ఆదుకోవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పిఎం ఆశ) పథకం కింద ఒక రాష్ట్రంలో పండిన పంట దిగుబడిలో 25శాతం కొనాలనే నిబంధనను మార్పు చేసి అధిక మొత్తంలో కొనుగోలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఎఫ్ సిఐ, సిసిఐ, నాపెడ్, మార్క్ ఫెడ్ లాంటి ప్రభుత్వ కొనుగోలు సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
2021- 22 జూలై -జూన్ కాలానికి తెలంగాణ ప్రభుత్వం
సిఎసిపికి చేసిన సిఫారసులు, కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు