వికారాబాద్: 2014కు ముందు తెలంగాణ లో ఉన్న పల్లెలు, ఇప్పుడు ఉన్న పల్లెల పరిస్థితులు ప్రజలు గమనించాలని మంత్రులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. చేవెళ్ల నియోజకవర్గము నవాబ్ పేట్ మండల కేంద్రం తో పాటు ఎక్ మామిడి, పుల్ మామిడి, లింగం పల్లి, ఎల్లకొండ, మహేతాబ్ ఖాన్ గూడ, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పల్లెల రూపు రేఖలు మారిపోయాయని, పల్లె ప్రగతి దేశానికి ఆదర్శంగా ఉందని కొనియాడారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపిస్తలేదా? ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఒక్క రోజే 30 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, 3 గంటలు కూడా సక్రమంగా రాని కరెంట్ నేడు తెలంగాణ లో 24 గంటల వస్తుందని పేర్కొన్నారు. 40 వేల కోట్ల ఖర్చుతో ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని ప్రశంసించారు. ఈ ప్రాంతానికి కూడా సాగునీరు కోసం కృషి చేస్తామని, .ఎలాంటి పైరవీలు లేకుండా రైతులకు ఎకరాకు 10 వేలు రూపాయలు కెసిఆర్ ఇస్తున్నారన్నారు. ఇప్పటివరకు 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, మరి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో ఎందుకు పంట పెట్టుబడి సహాయం అందిస్తాలేరని అడిగారు. తెలంగాణ వడ్లు కొనమని టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ లో పోరాడితే, బిజెపి కాంగ్రెస్ ఎంపిలు ఎక్కడ పారిపోయారని మంత్రులు ప్రశ్నించారు.
మీది తెలంగాణ కాదా? తెలంగాణ రైతుల గోస మీకు పట్టదా? అని అడిగారు. అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానం లో ఉందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడంలో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని బిజెపి నాయకులను ప్రశ్నించారు. కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలలో 9 లక్షల ఖాళీలు ఉన్నాయని, దొంగ నిరుద్యోగ దీక్షతో తెలంగాణ లో ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉన్న ఉద్యోగాలను మోడీ ప్రభుత్వం తీస్తుందని మంత్రులు మండిపడ్డారు. ఇప్పటివరకు 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఎక్కడ ఇచ్చారని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నయాపైసా ఇప్పటి వరకు తెలంగాణకు ఇవ్వలేదని, బిజెపి నేతలు కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ముందు నిధులు తీసుకరావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడదామని మంత్రులు సవాలు విసిరారు.