Monday, December 23, 2024

గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమాధిగా పనిచేస్తాం

- Advertisement -
- Advertisement -

గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు
ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నేను పార్టీ మారే ప్రసక్తే లేదు
ప్రజా సేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదు
విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన బిఆర్‌ఎస్‌ఎ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమాధిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ప్రజల వైపు ఉండాలనే సూత్రీకరణకు అనుగుణంగా తాము ఉంటామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో గెలిచిన ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా తాము నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి తిప్పి కొట్టారు. ప్రజా సేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. బిఆర్‌ఎస్ నేతలు తొందరపడి ఎవరూ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఓటమిని హుందాగా స్వీకరిద్దామని అన్నారు. ప్రజస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం నాలుగైదు నెలల సమయం ఇచ్చి వేచి చూశాక.. హామీలు అమలు చేయకపోతే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామని అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బిఆర్‌ఎస్ సర్కారు వస్తుందని కొందరు సీనియర్ నేతలు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

కెసిఆర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయం
యశోద ఆసుపత్రిలో ఉన్న కెసిఆర్‌ను సిఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం రాజకీయాల్లో మంచి సంప్రదాయం, అభినందనీయం అని ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిని అందరూ స్వాగతించాలే కానీ వక్రీకరించకూడదని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, సినీ అగ్రహీరో చిరంజీవి కూడా పరామర్శించి రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాను ఇలా మాట్లాడితే పార్టీ మారతారని అన్వయించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ తాను కెసిఅర్ సైనికుడినని, బిఆర్‌ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను, బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు ఎవరూ పార్టీ మారరని తెలిపారు. బిఆర్‌ఎస్ ఓటమికి కారణాలు విశ్లేషించుకొని బలంగా ముందుకొస్తామని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News