న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా రెపో రేటును పెంచుతూ ఉండడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్‌లతో సహా పలు పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచాయి. ఎస్‌బిఐలో ఎఫ్‌డిపై గరిష్టంగా 7 శాతం వడ్డీ లభిస్తోంది. ఎఫ్‌డిలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసుకొని, వాటిలో ఎఫ్‌డి చేయాలి.
ఎఫ్‌డి వడ్డీపై పన్ను చెల్లించాలి
ఎఫ్‌డి నుంచి వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక సంవత్సరంలో ఎఫ్‌డిపై ఎంత వడ్డీని సంపాదించినా, అది వార్షిక ఆదాయానికి జోడిస్తారు. మొత్తం ఆదాయం ఆధారంగా పన్ను స్లాబ్ నిర్ణయిస్తారు. ఎఫ్‌డిపై సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని ‘ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం‘గా పరిగణిస్తారు. టిడిఎస్ కింద పన్ను వసూలు చేస్తారు. బ్యాంక్ వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు క్రెడిట్ చేసినప్పుడు, అదే సమయంలో టిడిఎస్ తీసివేస్తారు. ఒక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టిడిఎస్‌ని తీసివేయవు. అయితే దీని కోసం ఫామ్ 15జి లేదా 15హెచ్ సమర్పించాలి. అన్ని ఎఫ్‌డిల నుండి వడ్డీ ఆదాయం సంవత్సరంలో రూ. 40,000 కంటే తక్కువగా ఉంటే టిడిఎస్ తీసివేయరు. మరోవైపు వడ్డీ ఆదాయం రూ. 40,000 కంటే ఎక్కువ ఉంటే 10 శాతం టిడిఎస్ తీసివేస్తారు.
పాన్ కార్డ్ ఇవ్వనందుకు బ్యాంక్ 20 శాతం కట్ చేస్తుంది. 40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై టిడిఎస్ తీసివేయడానికి ఈ పరిమితి 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం వేరుగా ఉంటుంది. ఎఫ్‌డి ద్వారా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ. 50,000 వరకు పన్ను రహితంగా ఉంటుంది. దీని కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 10 శాతం టిడిఎస్ తీసివేస్తారు. బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ ఆదాయంపై టిడిఎస్‌ని తీసివేసి, మీ మొత్తం ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి రానట్లయితే, పన్ను దాఖలు చేస్తున్నప్పుడు తీసివేయబడిన టిడిఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు. ఇది మీ ఖాతాలో జమ అవుతుంది.
2 సంవత్సరాల ఎఫ్‌డిపై వడ్డీ …
బ్యాంక్ వడ్డీ రేటు (%లో)
ఐసిఐసిఐ బ్యాంక్ 7.00
ఎస్‌బిఐ 7.00
హెచ్‌డిఎఫ్‌సి 7.00
యెస్ బ్యాంకు 7.50
… 3 సంవత్సరాల ఎఫ్‌డిపై వడ్డీ…
బ్యాంక్ వడ్డీ రేటు (%లో)
ఐసిఐసిఐ 7.00
ఎస్‌బిఐ 6.50
హెచ్‌డిఎఫ్‌సి 7.00
… 5 సంవత్సరాల ఎఫ్‌డి పై వడ్డీ …
బ్యాంక్ వడ్డీ రేటు (%లో)
ఎస్‌బిఐ 6.50
హెచ్‌డిఎఫ్‌సి 7.00
ఐసిఐసిఐ 7.00
యెస్ బ్యాంకు 7.00