Tuesday, January 21, 2025

నమ్మకంగా ఉంటూనే.. దోపిడీకి స్కెచ్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ఇటీవలి కాలంలో నేపాల్‌కు చెందిన పనిమనుషుల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాల్ ముఠాల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసేందుకు చేరిన నేపాల్ ముఠాలు ఇంటి యజమానుల మెప్పు పొందే వరకు బాగానే పనిచేస్తున్నారు. ఇంటి యజమానులకు నమ్మకం కుదిరినట్లు తెలియగానే ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, డబ్బులు ఎక్కడ పెడుతారో తెలుసుకుంటున్నారు.

తర్వాత సమయం చూసుకుని ఇంట్లోని సొత్తును దోచుకుని పారిపోతున్నారు. కొందరు నిందితులు ఇంటి యజమానులు పార్టీలకు, దైవదర్శనాలకు వెళ్లిన సమయాన్ని తమకు అనుకూలంగా మల్చుకుని దోచుకుంటున్నారు. కూకట్‌పల్లికి చెందిన ఇంటి యజమాని దైవదర్శనానికి వెళ్లగానే ఇంట్లో పనిచేస్తున్న కోటి రూపాయల సొత్తుతో నేపాల్ జంట పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ సంపన్నుడి ఇంటిని టార్గెట్‌గా చేసుకున్న నేపాల్ ముఠాకు చెందిన దంపతులు ఇంట్లో పనికి చేరారు.

పనిలో చేరిన ఎనిమిది నెలలు మంచి నమ్మకంగా పనిచేశారు.దీంతో ఇంటి యజమానులు వారిని సొంత మనుషులుగా భావించిన తర్వాత తమ ప్లాన్‌ను మొదలు పెట్టారు. ఇంట్లోని బంగారం, డబ్బులు, వెండి వస్తువులు ఎక్కుడ పెడుతున్నారో తెలుసుకున్నారు. వంటి పనికూడా వారే చేయడంతో వీరు తమ ప్లాన్‌ను సులభంగా అమలు చేశారు. ఇంటి యజమాని కుటుంబ సభ్యులు అందరికి మత్తు కలిపిన బోనం వడ్డించారు. దానిని తిన్న తర్వాత అందరూ మత్తులోకి జారుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఇంట్లో పనిచేస్తున్న దంపతులు, వారికి సాయం చేసేందుకు వచ్చిన నేపాల్‌కు చెందిన నిందితుడు కలిసి అంతాదోచుకుని పారిపోయారు.

కానీ ఇంటి యజమాని కుటుంబ సభ్యుల్లో ఒకరు మత్తు నుంచి త్వరగా బయటకు రాగానే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఆస్పత్రికిక తరలించి చికిత్స చేయించారు. తర్వాత నేపాల్‌కు చెందిన ముఠాను పట్టుకునేందుకు దర్యాప్తు చేసి ముంబాయిలో పట్టుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 9వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్‌కు వెళ్లాడు. ఇంట్లో నేపాల్‌కు చెందిన పనిమనులు గత ఐదేళ్ల నుంచి పనిచేస్తుండడంతో వారిపై నమ్మకంతో ఇంట్లోనే సొత్తు, డబ్బులను పెట్టి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.40లక్షల నగదు కన్పించలేదు. దీంతో నేపాల్‌కు చెందిన పనిమనుషులను పిలవగా వారు కన్పించలేదు.

వెంటనే సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులు నేపాల్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండగా ముంబాయిలో పట్టుకున్నారు. నిందితులు ముంబాయి రైల్వే స్టేషన్‌లో రైలు ద్వారా పారిపోతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లోని అబిడ్స్‌కు చెందిన వ్యాపారి ఇంట్లో పనిచేసిన నేపాల్ దంపతులు యజమాని ఊరికి వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లోని రూ.40లక్షల సొత్తుతో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండేళ్ల తర్వాత నిందితులను అరెస్టు చేశారు. నారాయణగూడకు చెందిన వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన దంపతులు ఇంటి యజమాని సమ్మర్ టూర్‌కు వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లోని రూ.18లక్షలతో పరారయ్యారు.
తక్కువకు పనిచేస్తారని ఆశపడితే…
నేపాల్‌కు చెందిన వారిని పనిలో పెట్టుకునే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు పలుమార్లు కోరుతున్నా, వ్యాపారులు పట్టించుకోవడంలేదు. ఇండియాకు చెందిన బీహార్, ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకుంటే ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సి వస్తుందని భావించి తక్కువ డబ్బులకు పనిచేస్తారని నేపాలీల వైపు చూస్తున్నారు.

వీరికి ఇక్కడి రూపాయి వారి దేశంలో ఎక్కువ విలువ ఉండడంతో తక్కువ జీతంపై పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇక్కడే వారు వక్రబుద్దిని చూపిస్తున్నారు. అదును చూసి పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి పరారవుతున్నారు. నేపాల్‌కు ఇండియాకు రోడ్డు ద్వారా చేరుకునే అవకాశం ఉండడంతో ఇక్కడ కొట్టేసిన సొత్తుతో నేపాల్‌కు సులభంగా పారిపోతున్నారు.
ప్లాన్ ప్రకారమే చేరిక…
నేపాల్‌కు చెందిన పనిమనుషులు తమ ముఠా నాయకుడి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పనిలో చేరుతున్నారు. ముందుగా ఒక్కరు చేరిన తర్వాత తమ మనుషులు మరొకరిని పనిలోకి రప్పిస్తున్నారు. ఇలా ఒక ఇంట్లో ముగ్గురు, నలుగురు చేరిన తర్వాత ముఠా నాయకుడు చెప్పిన తర్వాత చోరీ చేస్తున్నారు. చోరీ చేసే సమయంలో ముఠాకు చెందిన సభ్యులు ఆ నగరానికి వచ్చి సొత్తును తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు పారిపోతున్నారు.

కొద్ది రోజుల తర్వాత అందరు కలుసుకుంటున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ దర్యాప్తులో పోలీసులకు నేపాల్ ముఠాలకు సంబంధించిన విషయం తెలిసింది. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా గాలించి అందరు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News