ఐస్‌క్రీంలో విస్కీ కలిపి విక్రయిస్తున్న ఐస్‌క్రీం పార్లర్‌పై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. ముగ్గరు నిందితులను అరెస్టు చేసి, పార్లర్ నుంచి 11.5కిలోల ఐస్‌క్రీంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి ఆబ్కారీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్1లో ఉన్న వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీం పార్లర్‌ను శరత్ చంద్రారెడ్డి ఏర్పాటు చేశారు, అందులో దయాకర్ రెడ్డి, శోభన్ పనిచేస్తున్నారు. నిందితులు భారీగా లాభాలు రావాలని ప్లాన్ వేసి ఐస్‌క్రీంలో 100 పేపర్స్ విస్కీ కలిపి విక్రయించడం ప్రారంభించారు. ఐస్‌క్రీంను తింటున్న యువకులు, యువతులు, పిల్లలు వీస్కీ ఐస్‌క్రీంకు అలవాటు పడి రెగ్యులర్‌గా తినడం ప్రారంభించారు.
చాలామంది విస్కీఐస్ క్రీంకు బానిసలుగా మారడంతో నిర్వాహకులు ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. ఎక్కువ ధరకు విక్రయిస్తున్న కూడా తినేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఐస్‌క్రీం తినేందుకు యువకులు, పిల్లలు ఎగబడుతున్నారు. నిందితులు 100 గ్రాములు ఐస్‌క్రీంలో 60మిల్లీ లీటర్ల విస్కీని కలుపుతున్నారు. దీంతో పిల్లలు ప్రతి రోజు ఐస్‌క్రీం తినేందుకు ఎగబడుతున్నారు. ఐస్‌క్రీంలో విస్కీ కలిపి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేశారు. వ్యాపారం పెంచుకునేందుకు నిందితులు ఏకంగా ఫేస్‌బుక్‌లో ప్రచారం నిర్వహించినట్లు చేశారు. ఐస్‌క్రీంలో విస్కీ కలిపి విక్రయిస్తు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఈ విషయం తెలిసి దాడి చేశామని జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.