Monday, December 23, 2024

అరుదైన తెల్ల జింక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : జింక అనగానే ముదురు గోధుమ వర్ణం రంగులో.. తెల్ల మచ్చలతో ఉంటాయి.. ఈ జింక మాత్రం పాల తెలుపులో ఉంది.. చెవులు కూడా తెల్లగా నిగనిగలాడుతున్నాయి.. బంగారు జింకలు రామాయణ కాలంలో విన్నాం.. ఇప్పుడు తెల్ల జింకలు దేశంలో కనిపిస్తున్నాయి. ఈ అరుదైన తెల్ల జింక ఫోటోలను ఇటీవల అటవీ శాఖ అధికారి అకాష్ ట్విట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కతర్నియా ఘాట్ వన్య ప్రాణుల అభయారణ్యంలో తెల్ల జింకలు ఉన్నాయని.. పెద్ద ఆడ జింక వెంట ఈ చిన్న తెల్ల జింక వెళుతూ కనిపించిందంటూ ట్వీట్ చేశారు.

ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయని.. జన్యుపరమైన సమస్యలు ఉంటేనే.. ఈ రంగులో ఉంటాయని వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరం అన్నారు. అడవిలో ఫలానా జంతువులు.. ఫలానా రంగుంలో ఉంటాయని అందరికీ స్పష్టంగా తెలియటంతోపాటు.. మిగతా జంతువులకు ఓ అవగాహన ఉంటుందన్నారు . జింక తెల్ల రంగులో ఉండటం వల్ల దానికి మిగతా జంతువులు, మనుషుల నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్ల జింకకు భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయంటున్నారు.

ఆయా జంతువులు తమ సహజమైన రంగులో కాకుండా ఇతర రంగుల్లో పుట్టినట్లయితే.. వాటికి అనారోగ్య సమస్యలు వస్తాయని.. కళ్లు కనిపించకపోవటం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ తెల్ల జింక మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. 15 ఏళ్ల క్రితం ఒడిశాలో కూడా ఇలాంటి తెల్ల జింక ఒకటి కనిపించినట్లు సుశాంత్ నందా అనే ఫారెస్ట్ అధికారి చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News