Monday, December 23, 2024

మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు: వైట్ హౌస్ ఖండన

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గతవారం ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీని భారత్‌లో ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై ప్రశ్నించిన అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరి సబీనా సిద్దిఖికి ఎదురవుతున్న వేధిపులను వైట్ హౌస్ సోమవారం ఖండించింది.

సబీనా సిద్దిఖీకి వేధింపులు ఎదురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి జాన్ కిర్బీ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇది ఆమోదయోగ్యం కాదని, ఎక్కడైనా ఎటువంటి పరిస్థితులలోనైనా జర్నలిస్టులపై వేధింపులను తాము తీవ్రంగా ఖండిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గతవారం అమెరికా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రశ్నించిన మహిళా విలేకరిపై వేధింపులకు పాల్పడడం ప్రజాస్వామిక సూత్రాలకే అనైతికమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా..కిర్బీ ప్రకటనను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్ పీరె పునరుద్ఘాటించారు. పత్రికా స్వేచ్ఛకు తాము అంకితమయ్యామని, అందుకే తాము గత వారం విలేకరుల సమావేశం నిర్వహించామని పీరె స్పష్టం చేశారు. తమ బాధ్యతలు నిర్వర్తించే ఏ జర్నలిస్టునైనా వేదింపులకు పాల్పడడాన్ని తాము ఖండిస్తామని జీన్ పీరె తెలిపారు. సబీనా వేసిన ప్రశ్నకు మోడీ ఇచ్చిన సమాధానంతో అధ్యక్షుడు బైడెన్ సంతృప్తి చెందుతున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆ విషయానికి ప్రధాని మోడీయే సమాధానం ఇవ్వగలరని పీరె అన్నారు.

కాగా..ప్రధాని మోడీని ప్రశ్నించే అత్యంత అరుదైన అవకాశం సబీనా సిద్దిఖికి లభించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని తనకు తానుగా గర్వంగా చెప్పుకునే భారతదేశంలో మీ ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతోందని, విమర్శకుల గొంతు నొక్కుతోందని అనేక మానవ హక్కుల గ్రూపులు చెబుతున్నాయని, ముస్లింలు, ఇతర మైనారిఈల హక్కులను మెరుగుపరిచేందుకు, వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకు మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని సబీనా సిద్దిఖి ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యమే తమ స్ఫూర్తి అని, ప్రజాస్వామ్యం తమ రక్త నాళాలలో ప్రవహిస్తోందని ఆయన తెలిపారు. తాము ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల ఆధారంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కుల, మత, జాతి, లింగ వివక్షకు తావు లేకుండా తమ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ఆయన జవాబిచ్చారు. తమ దేశంలో వివక్షకు ఎక్కడా తావులేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా&ప్రధాని మోడీని ప్రశ్నించిన సబీనా సిద్దిఖిపై బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాల్వీయ మండిపడ్డారు. ఆమె ప్రశ్న దురుద్దేశంతో కూడుకున్నదరి, టూల్ కిట్ గ్యాంగ్‌తో ఆమెను పోల్చారు. ఆయనతోపాటు హిందూత్వ అనుకూల, బిజెపి అనుకూల ట్విట్టర్ ఖాతాలలో సబీనాను పాకిస్తానీ ఇస్లామిస్టుగా అభివర్ణిస్తూ ట్రోలింగ్‌లు సాగాయి. ఆమె తల్లిదండ్రులు పాకిస్తాన్ దేశస్తులని, ఇస్లామిస్టుల పలుకులనే ఆమె కూడా పలుకుతోందంటూ ఆమెపై వ్యాఖ్యానాలు సాగాయి.

ఈ ఆరోపణలకు సబీనా సిద్దిఖీ కూడా ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. తాను, భారతీయుడైన తన తండ్రి భారత క్రికెట్ జట్టును అభినందిస్తున్నప్పటి ఫోటోను ఆమె షేర్ చేశారు. తన జాతీయతను ప్రశ్నించినందున తాను తన వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఏర్పడిందని ఆమె చెప్పారు.

కాగా..సబీనా సిద్దిఖీ జర్నలిస్టుగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించినందుకు కాంగ్రెస్ అమెను అభినందిస్తూ అండగా ఉంటామని తెలియచేసింది. అంతేగాక ఆమె సహ జర్నలిస్టులు సైతం ఆమెకు సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News