కొత్త రకం రోగాలకు కేరాఫ్ అడ్రస్ చైనా. నాలుగేళ్ల కిందట ఆ దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని కబళించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో తలెత్తిన మరో వ్యాధి ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఊపిరితిత్తులపై దాడిచేసి, శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసే సరికొత్త బ్యాక్టీరియా ఇప్పడు చైనాను వణికిస్తోంది.
ఇది చైనాకే పరిమితం కాలేదు, అమెరికా, డెన్మార్క్ వంటి దేశాలకూ విస్తరిస్తోంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే పిల్లలకు ఈ బ్యాక్టీరియా సోకి, వారి లంగ్స్ ను దెబ్బతీస్తుంది. దీనికి వైట్ లంగ్ సిండ్రోమ్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది ఒకరకంగా న్యూమోనియాలాంటిదే.
దగ్గు, తుమ్ముల ద్వారా ఎదుటి వ్యక్తికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. ముందుగా జ్వరంతో ఈ వ్యాధి మొదలవుతుంది. ఆ తర్వాత తీవ్రమైన దగ్గు వస్తూ ఉంటుంది. ఆపై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమందికి గుండెనొప్పి కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఈ వ్యాధి యాంటీ బయొటిక్స్ తో తగ్గుతోందని డాక్టర్లు చెబుతున్నారు.