‘వైట్ పేపర్’ చిత్రం కేవలం 10 గంటల వ్యవధిలో చిత్రీకరణ పూర్తిచేసుకోవడంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్‌లో కూడా ఈ చిత్రం ఎక్కబోతుందని తెలిపారు ఫిల్మ్‌మేకర్స్. జిఎస్‌కె ప్రొడక్షన్స్ పతాకంపై అదిరే అభి (అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ నటీనటులుగా శివ దర్శకత్వంలో గ్రంధి శివప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వైట్ పేపర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నటి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత సాయి రాజేష్, నిర్మాతలు శ్రీనివాస్, శ్రీకర్, జర్నలిస్ట్ ప్రభు, తాగుబోతు రమేష్ ,హైపర్ ఆది, అదిరే అభి, పంచ్ ప్రసాద్, రాఘవ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ “ఈ సినిమాను 10 గంటల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమాకు పడిన కష్టాన్ని, కృషిని గుర్తించి మనమందరం మనస్ఫూర్తిగా అభిని, దర్శకుడిని అభినందించాలి”అని అన్నారు. హీరో అదిరే అభి మాట్లాడుతూ “మేము ఈ ప్రాజెక్టును ఛాలెంజింగ్‌గా తీసుకుని ప్రీ ప్లాన్డ్‌గా మేము ముందే రిహార్సల్ చేసుకున్నాము. షూట్‌లోకి వెళ్లిన తరువాత ఆలస్యం కాకూడదని 4 కెమెరాలతో షూట్ చేయడం జరిగింది. తెలుగులోనే కాదు ఇండియాలో కూడా ఇప్పటివరకు 10 గంటల్లో పూర్తి చేసిన సినిమాలు రాలేదు”అని చెప్పారు. – చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ “10 గంటల్లో చేస్తే రికార్డు సృష్టించవచ్చని ఈ మూవీ చేయడం జరిగింది”అని పేర్కొన్నారు.