దుర్గ్: ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లా భిలాయ్ లోని మైత్రీబాగ్ జూలో మూడు పిల్లలకు తెల్లపులి జన్మనిచ్చిందని అధికారులు ఆదివారం తెలిపారు. దీంతో ఆ జూలోని తెల్లపులుల సంఖ్య తొమ్మిదికి చేరింది. రక్షా అనే పేరుగల తెల్లపులి ఏప్రిల్ 28న మూడు కూనలను ప్రసవించింది. వీటికి తండ్రి తెల్లపులి సుల్తాన్. జంతువైద్య నిబంధనల ప్రకారం పోషణ, ఇతర ఆరోగ్య ప్రమాణాలు పర్యవేక్షించడానికి ఇప్పుడు పుట్టిన కూనలతోపాటు తల్లిపులిని కూడా చీకటి గదిలో ఉంచవలసి ఉందని జూ ఇన్‌ఛార్జి ఎన్‌కె జైన్ చెప్పారు.
నాలుగు నెలల పాటు సంరక్షించిన తరువాత వీటిని ప్రజలు చూడడానికి అనుమతిస్తామని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తెల్లపులి రోమా ఒక కూనను ప్రసవించగా, దానికి సింఘం అని పేరు పెట్టారు. దానికి కూడా తెల్లపులి సుల్తానే తండ్రి. 1997లో ఒడిశా నందన్ కనన్ జూ నుంచి మొట్టమొదటి సారి తెల్లపులుల జంట తరుణ్, తప్సీలను మైత్రీబాగ్ జూకు తరలించారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈ జూను నిర్వహిస్తోంది.