Friday, November 15, 2024

అటు దేశ రక్షణ.. ఇటు సామాజిక సేవ

- Advertisement -
- Advertisement -

White Volunteer social service by CRPF Jawan Maraneni shekhar

మానవత్వానికి మచ్చుతునక ‘మారనేని శేఖర్’
దేశం కోసం శ్రమిస్తూ.. సామాజిక సేవలో పునీతులవ్వాలనే ఆకాంక్ష
వైట్ వాలంటీర్స్ సంస్థ స్థాపన.. ఐదు పాఠశాలలు దత్తత.. నిత్యం పాల సరఫరా
చేయూతనిస్తే మరింతగా ముందడుగు

మన తెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థుల పట్ల ప్రేమను కనబరుస్తూ మానవత్వానికి మచ్చుతునక నిలుస్తున్నారు. విద్యార్థుల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఇందు నిమిత్తం ‘వైట్ వాలంటీర్స్’ పేరిట ఓ సంస్థను 2018 మార్చి 24వ తేదీన ప్రారంభించారు. ఐదు పాఠశాలలను దత్తత తీసుకుని తన దయార్థ హృదయాన్ని చాటారు. ఆయనే సిఆర్‌పిఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ‘మారనేని శేఖర్’. ప్రజా సంక్షేమమే పరమావధిగా, బాలల ఆరోగ్యమే భావిభారత సంక్షేమంగా తన వంతు సేవ చేస్తున్నారు. తాను దత్తత తీసుకున్న పాఠశాలలకు ప్రతి నిత్యం 200 మి.లీ పాలు సరఫరా చేస్తున్నారు. ఇందు నిమిత్తం తన జీతంలో 6 వేలు వెచ్చిస్తూ.. మరో 4 వేలు స్నేహితుల వద్ద నుంచి తీసుకుని నెలకు 10 వేలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇంతటితో ఆగకుండా మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా బట్టలు అందించడంతో పాటు చదువు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తన దయార్థ హృదయాన్ని కనబరుస్తున్నారు.

తాను స్థాపించిన వైట్ వాలంటీర్స్ సంస్థ తరపునుంచి 200 మంది కాలేజీ విద్యార్థులతో ఇతరత్రా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. మానవతకు నిలువుటద్దంగా నిలుస్తున్నారు. కడు పేదరికం నుంచి వచిచన మారనేని శేఖర్ కష్ట సుఖాల విలువ బాగా తెలుసు. తండ్రి ఒక రైతుగా, తల్లి ఒక బీడీ కార్మికురాలిగా పనిచేసి తమ ఇద్దరి అన్నదమ్ములను చదివించి ఉన్నతులను చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తన సోదరుడు ఎస్‌బీఐలో మేనేజర్‌గా ఉన్నారని సంతోషంతో తెలిపారు. తాను చేపట్టిన సేవా కార్యక్రమాలకు తన సతీమణి పూర్తి సహకారాన్నందిస్తోందన్నారు. చిన్నతనం నుంచి తనకు సామాజిక సేవ చేయాలని ఎనలేని మక్కువగా ఉండేదన్నారు. భవిష్యత్తులో ఈ వైట్ వాలంటీర్స్ ద్వారా భారతదేశం యావత్తూ పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు, మహిళలకు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడమే తన ఆశయంగా మారనేని శేఖర్ చెప్పుకొచ్చారు.

దత్తత తీసుకున్న సిరిసిల్ల జిల్లాలోని లింగన్నపేటలోని ఎస్.సి.కాలనీ, ప్రైమరీ స్కూల్, దేశాయిపేటలోని అంగన్‌వాడీ స్కూలు, సిరిసిల్ల జిల్లా దేశాయిపేట స్కూలు, రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసరి పిల్లెవాలి అంగన్‌వాడీ స్కూల్‌లలో ఇప్పటికే ఆరు మెడికల్ క్యాంపులు నిర్వహించి, సమస్యలు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపారు. చత్తీస్‌గఢ బీజాపూర్‌లో ఆపరేషన్‌కు వెళ్లినప్పుడు తెల్లవారుజామున కూంబింగ్ పార్టీ మీద నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేయగా శేఖర్ మెడలో బులెట్ తగిలినా తన దేశమాత పాదాలే తనకు పవిత్ర సన్నిధానమని భావించి భారతావనికి సేవలందిస్తున్నారు. అటు దేశం కోసం శ్రమిస్తూ.. ఇటు సామాజిక సేవలో పునీతులవ్వాలని మారనేని శేఖర్ ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆకాంక్షలు నెరవేరె విధంగా ప్రతి ఒక్కరూ వైట్ వాలంటీర్స్‌కు చేయూతనిస్తూ మారనేని శేఖర్ ఆశయ సిద్ధికి కారకులవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News